‘కరోనా వైరస్’ కేసులు అమెరికాలో శరవేగంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 10 గంటల సమయానికి 1,04,661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి ‘కరోనా’ కేసులు లక్ష కంటే ఎక్కువ నమోదైన ఏకైక దేశం అమెరికా. మరణాల రేటు ప్రస్తుతం తక్కువగానే ఉన్నా.. నెమ్మదిగా పెరుగుతుండటం అమెరికాలో ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం వరకు అమెరికాలో కరోనా మరణాలు 1706 నమోదు కాగా.. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 450 మంది చనిపోయారు. గత రెండు రోజుల్లో 36 వేల మందికి కొత్తగా ‘కరోనా’ పాజిటివ్ తేలింది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య అసాధారణంగా పెరుగుతోంది.
2020-03-28ఇండియాలో ప్రముఖులు ‘కరోనా’ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారు. చాలాచోట్ల చర్యలేమీ తీసుకోవడంలేదు. కానీ కేరళలో అలా కాదు. ‘హోం క్వారంటైన్’లో ఉండనందుకు ఐఎఎస్ అధికారి అనుపమ్ మిశ్రాను సస్పెండ్ చేశారు కేరళ సిఎం పినరయి విజయన్. అతనిపై కేసు కూడా నమోదైంది. కొల్లాం సబ్ కలెక్టరుగా పని చేస్తున్న మిశ్రా భార్యతో సహా ఇటీవల సింగపూర్, మలేషియా సందర్శించి వచ్చారు. మార్చి 19న తిరిగి విధులకు రిపోర్టు చేశారు. అయితే, ఆ జంటను ‘హోంక్వారంటైన్’లో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గన్ మ్యాన్, వ్యక్తిగత సహాయకులపై కూడా ఆరోగ్య నిఘా పెట్టారు. అయితే, అదే రోజు మిశ్రా తన సొంత రాష్ట్రం యుపికి వెళ్లిపోయారు.
2020-03-27యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సైతం ‘కరోనా వైరస్’ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఆయనే స్వయంగా వెల్లడించారు. గత 24 గంటల్లో స్వల్పంగా ‘కరోనా’ లక్షణాలు కనిపించాయని, పరీక్షించుకుంటే పాజిటివ్ తేలిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నానని, అయినా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తానని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ‘‘ఇంట్లో ఉండి ప్రాణాల్ని కాపాడండి’’ అని ఆయన నినాదమిచ్చారు.
2020-03-27ఎక్కడివాళ్ళను అక్కడే ఉంచడం తప్ప మనకు మరో గతి లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉటంకిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ‘’మనకు మరో గతి లేదు. హై ఎండ్ టెక్నాలజీ లేదు. వెంటిలేటర్లు కూడా ఎక్కువ లేవు. మన చేతిలో ఉండే ఏకైక ఆయుధం.. వ్యాప్తి చెందకుండా చూడటం. మందు లేదు. వైద్య సదుపాయాలు విదేశాలంత లేవు. మనకు ఉన్నవి ఐకమత్యం, తెలివి తేటలు’’ అని కేసీఆర్ చెప్పారు. అమెరికా వంటి దేశాలకే వెంటిలేటర్ల కొరత ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో శుక్రవారం ఒక్క రోజే 10 కొత్త కేసులు నమోదయ్యాయని, మొత్తంగా 20 వేల మంది స్వీయ నియంత్రణలో ఉన్నారని చెప్పారు.
2020-03-27పట్టణాల్లోని వ్యవసాయ మార్కెట్లను మూసివేశామని, రైతులు ఎవరూ రావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పారు. ఏప్రిల్ నెలలో ధాన్యం ప్రతి గింజనూ గ్రామాల్లోనే కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు ప్రభుత్వానికి లేదా వ్యాపారులకు అమ్ముకోవచ్చని, మద్ధతు ధర కచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు జరిగిన వెంటనే అధికారులు చెక్కులు ఇస్తారని చెప్పారు. ఈ విషయమై ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ- మార్కెటింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.
2020-03-27తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలకు ఆందోళన అక్కర్లేదని, హాస్టళ్ల మూసివేత ఉండదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పారు. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలుతున్న ప్రజలతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో సహా ఎవరూ ఆకలితో ఉండకూడదని, వారికి షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల వారు ఎక్కువమంది హైదరాబాద్, చుట్టూ ఉన్న 9 కార్పొరేషన్ల పరిధిలోనే ఉన్నారని చెప్పారు.
2020-03-27‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి వేగం మరింత పెరిగింది. గురువారం వరకు వైరస్ సోకినవారి సంఖ్య 5 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 23 వేలకు చేరింది. మరణాలు ఇటలీలో 8 వేలు, స్పెయిన్ లో 4 వేలు, ఇరాన్ లో 2 వేలు, అమెరికాలో వెయ్యి దాటాయి. మరణాల రేటు ఇటలీలో 10.19%కి, ఇరాన్, స్పెయిన్ లలో వరుసగా 7.79%, 7.38%కి పెరిగింది. శుక్రవారం వేకువ జామున 2.30సమయానికి ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ సోకిన వ్యక్తుల సంఖ్య 5,23,163. వారిలో 1,22,059 మంది కోలుకోగా 23,639 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్యలో ఇటలీ (80,589) ఉదయానికల్లా చైనా (81,782)ను దాటనుంది. మార్చి 25న రికార్డు స్థాయిలో 49.5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
2020-03-27నిత్యావసరాలు లేదా ఇతరత్రా సమస్యలు ఎదురైతే 1902కు ఫోన్ చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు. 10 ప్రభుత్వ శాఖల అధికారులు, ముగ్గురు మంత్రులు, సిఎం కార్యాలయ అధికారులు ఆ కంట్రోల్ రూములో ఉంటారని చెప్పారు. నిత్యావసరాలకోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బయటకు రావచ్చని, అయితే.. ఇతరేతర పనులపై మాత్రం రావద్దని స్పష్టం చేశారు. రైతులు, రైతుకూలీలు కూడా తప్పనిసరి అయితేనే బయటకు రావాలని సూచించారు. క్రమశిక్షణతోనే ‘కరోనా’ను గెలవగలమని, నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందన్న విషయం కొన్ని దేశాల్లో చూస్తున్నామని పేర్కొన్నారు.
2020-03-26ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోవాలని ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి హైదరారాబాద్ లోని ఆంధ్రులకు విన్నవించారు. నిన్న, ఈరోజు ఏపీ- తెలంగాణ సరిహద్దులలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సరిహద్దుల దాకా వచ్చినవారిని కాదనలేక తీసుకున్నామని, అయితే.. వారిని నేరుగా ఇళ్ళకు పంపలేదని, 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పదని స్పష్టం చేశారు. ఈరోజు కూడా సాగర్, దాచేపల్లి వద్ద అదే పరిస్థితి నెలకొందన్న సిఎం, ఇళ్లకు పరిమితం కావలసిన ఈ స్థితిలో ప్రయాణాలు చేస్తే ‘కరోనా’ నియంత్రణ కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.
2020-03-26ఇండియా ప్రస్తుతం ‘కరోనా వైరస్’ మూడో దశలోకి ప్రవేశించిందని ‘కోవిడ్ 19’ ఆసుపత్రుల టాస్క్ ఫోర్స్ కన్వీనర్ డాక్టర్ గిరిధార్ గ్యాని వెల్లడించారు. దేశంలో వైరస్ ‘సాంఘిక వ్యాప్తి’ ప్రారంభమైందని ఆయన గురువారం ‘క్వింట్’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటువ్యాధుల సమయంలో ‘సాంఘిక సంక్రమణం’ కీలకమైన దశ. ఈ దశలో ఒక సమూహంలోని ప్రజల మధ్య వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఈ దశ ప్రారంభంలో ఉన్నామని డాక్టర్ గ్యాని చెప్పారు. వచ్చే 5-10 రోజుల్లో వైరస్ వ్యాప్తిని తప్పనిసరిగా నిరోధించాల్సి ఉంటుందని పేర్కొన్న గ్యాని, సమయం తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
2020-03-26