పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి చట్టం చేయడంలో భాగమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా... ప్రజల నిరసనల తర్వాత నష్ట నివారణ చర్యలకు దిగింది. జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)ని మాత్రం రాష్ట్రంలో అమలు చేయబోమని ఏపీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా గురువారం ప్రకటించారు. ఎన్.ఆర్.సి.ని అన్ని ఫార్మాట్లలోనూ వ్యతిరేకిస్తున్నామని భాషా చెప్పారు. ఏ ఒక్క ముస్లింకూ అన్యాయం జరగదని కేంద్ర పెద్దలు హామీ ఇవ్వడంవల్లనే పౌరసత్వ సవరణ బిల్లుకు మద్ధతు ఇచ్చామన్నారు.
2019-12-19పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు అసాధారణ ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రం మొత్తంలో 144వ సెక్షన్ కింద.. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమి కూడటంపై నిషేధం విధించారు. ఈ ఉత్తర్వులు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.నిర్దిష్ట ప్రదేశాల్లో విధించేందుకు ఉద్దేశించిన 144ను రాష్ట్రం మొత్తంలో అమలు చేయడం తప్పంటున్నారు.
2019-12-19తాము ఒత్తిడి కారణంగా... పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశామని తమిళనాడు అధికార పార్టీ అన్నా డిఎంకె పేర్కొంది. తమిళనాట అనేక చోట్ల సిఎఎకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ మాట మారింది. గురువారం చెన్నైలో 60 సంస్థలు భారీ నిరసన చేపట్టాయి. ఎఐఎడిఎంకె ముస్లింలకు వ్యతిరేకం కాదన్న ఎఐడిఎంకె ఎంపీ మాలసుబ్రమణియన్, బిజెపి ‘‘హిందూ రాష్ట్ర’’ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని కూడా ఆరోపించారు.
2019-12-19పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి) లకు వ్యతిరేకంగా గురువారం బెంగళూరు ప్రదర్శనలో పాల్గొన్న చరిత్రకారుడు రామచంద్ర గుహను పోలీసులు నిర్భంధించారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించడంతో అరెస్టు చేశామని బెంగళూరు పోలీసులు చెబుతుండగా, తాను గాంధీ చిత్రం చేతబట్టుకొని మీడియాతో మాట్లాడుతుండగా నిర్భంధించారని గుహ విమర్శించారు. పోలీసులు చర్య అప్రజాస్వామికమని, శాంతియుత నిరసనను అనుమతించడం లేదని ధ్వజమెత్తారు.
2019-12-19పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ తో పాటు ఎస్.ఎం.ఎస్.లు, కాల్స్ కూడా నిలిపివేశాయి టెలికం కంపెనీలు. ప్రభుత్వ ఆదేశాలమేరకు సేవలను నిలిపివేస్తున్నట్టు ఎయిర్ టెల్, వోడాఫోన్ నిర్ధారించాయి.
2019-12-19రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని మాజీ మంత్రి పి. నారాయణ తీవ్రంగా తప్పు పట్టారు. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాల భూమిని రైతులు ఇచ్చారని, ఇప్పుడు రాజధానిని తరలిస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వానికీ ప్రజలు ‘భూ సమీకరణ’ కింద భూమి ఇవ్వరని నారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ‘3 రాజధానుల’ ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో గురువారం నారాయణ మాట్లాడారు.
2019-12-19పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), విద్యార్థులపై ఉక్కుపాదం వంటి పరిణామాలపై క్రికెటర్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుమార్తె సన స్పందించారు. కుష్వంత్ సింగ్ నవల ‘‘ద ఎండ్ ఆఫ్ ఇండియా’’ను ఉటంకిస్తూ... ‘‘ప్రతి ఫాసిస్టు వ్యవస్థా ఎదగడానికి... అది దోషులుగా చూపించే కొన్ని సమూహాలు కావాలి. అది ఒకటి లేదా రెండు సమూహాలతో ప్రారంభిస్తుంది. కానీ, అది ఎప్పటికీ అంతం కాదు.. ఈ రోజు మనలో ముస్లింలు లేదా క్రైస్తవులు కానందున సురక్షితంగా ఉన్నట్టు భావిస్తున్న వారు మూర్ఖుల స్వర్గంలో ఉన్నట్టే’’ అన్న వాక్యాలను షేర్ చేశారు.
2019-12-19పౌరసత్వ సవరణ చట్టం పర్యవసానాలపై మౌనం దాల్చిన బాలీవుడ్ ప్రముఖులపై నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. హీరోలు ‘‘ఆడంగులు‘‘, ‘‘పిరికివారు’’, ‘‘వెన్నెముక లేనివారు’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘బాలీవుడ్ నిండా పిరికివారే! నటులు వారిని చూసి వారే సిగ్గుపడాలి. వాళ్ళు చేసేదేమిటంటే.. రోజుకు 20 సార్లు అద్దంలో చూసుకోవడమే..!! ఏదైనా అడిగితే, మాకు విద్యుత్ ఉంది..అన్ని సదుపాయాలూ ఉన్నాయి.. దేశం సంగతి మాకెందుకంటారు’’ అని కంగన దుయ్యబట్టారు.
2019-12-18మీడియాపై కేసులు పెట్టేందుకు శాఖాధిపతులకు అధికారమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430ని ఉపసంహరించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) సిఫారసు చేసింది. బుధవారం అలహాబాద్ నగరంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ కౌన్సిల్ స్వచ్ఛందంగా స్వీకరించిన ఈ అంశంపై జర్నలిస్టుల తరపున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఎపియుడబ్ల్యుజె) నాయకుడు ఆలపాటి సురేశ్ కుమార్ బుధవారం వాంగ్మూలమిచ్చారు.
2019-12-18గత ఏడు నెలల్లో రాష్ట్రంలో ఏం జరిగిందో ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విన్నవించారు. ‘‘ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని టీడీపీని ఓడించారు. లేదంటే.. పదేళ్లు తిరిగాడు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓట్లు వేశారు. ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు... మరి ఏం జరిగింది? 7 నెలల్లో ఒక్క అభివృద్ధి పనీ లేదు. మేము తెచ్చిన అదానీ, లులు ప్రాజెక్టులు వెళ్లిపోయాయి’’ అని బుధవారం అనంతపురంలో జిల్లా పార్టీ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2019-12-18