ముంబైలో 167 మంది టీవీ జర్నలిస్టులకు ‘కరోనా’ పరీక్షలు నిర్వహించగా 53 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో మెజారిటీ యువ రిపోర్టర్లు, కెమేరామెన్. తగిన రక్షణ లేకుండా క్షేత్ర స్థాయికి వెళ్లినవారు. వారికి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలుగల ఓ యువ జర్నలిస్టు చెప్పిన మాట ‘‘మాకు వేరే ఛాయిస్ లేదు’’. ఇంటినుంచి రిపోర్టు చేయగలిగినా.. టి.ఆర్.పి.లకోసం క్షేత్రస్థాయికి పంపుతున్నారని జర్నలిస్టులు చెబుతున్నారు. తనకు ‘కరోనా’ సోకినట్టు ‘బ్యూరో చీఫ్’కు ఫోన్ చేసి చెబితే ‘‘జాగ్రత్త. కొద్ది రోజులు బయటకు రాకు’’ అని మాత్రమే బదులిచ్చినట్టు ఆ యువ జర్నలిస్టు చెప్పాడు.
2020-04-21తాను చంద్రబాబుకు అమ్ముడుపోయానని వ్యాఖ్యానించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని, పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. కొరియా నుంచి చత్తీస్ గఢ్ రూ. 337కే కొన్న ‘కరోనా’ టెస్టు కిట్లను ఏపీ రూ. 730కి కొనడాన్ని తాను ప్రశ్నిస్తే.. విజయసాయిరెడ్డి అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 16 నెలలు జైలుకెళ్లి వచ్చి బెయిలుపై ఉన్న విజయసాయిరెడ్డి తనపై మాట్లాడటం ఆకాశం పైన ఉమ్మి వేయడమేనని కన్నా వ్యాఖ్యానించారు.
2020-04-20అనివార్య పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. ప్రభుత్వాలు బాధ్యత మరచి అధికారాన్ని మాత్రమే ప్రదర్శిస్తే (పేద) ప్రజలకు కష్టాలు తప్పవు. ‘కరోనా’ కట్టడికోసం విధించిన ‘లాక్ డౌన్’ ఇందుకు తాజా ఉదాహరణ. బీహార్ లోని జెహానాబాద్ లో కొంతమంది పిల్లలు కప్పలు పట్టుకొని తింటున్న ఉదంతాన్ని ‘న్యూస్ డి’ వెలుగులోకి తెచ్చింది. ‘లాక్ డౌన్’ కారణంగా ఇళ్ళలో ఆహార ధాన్యాలు లేకపోవడంతో నాలుగు రోజులుగా కప్పలతోనే కడుపు నింపుకుంటున్నట్టు ఆ పిల్లలు చెప్పారు. కప్పలను మంటపై కాల్చి తినడం ఆ వీడియోలో కనిపిస్తోంది. కప్పల వేట కోసం రోజంతా వెచ్చిస్తున్నట్టు ఆ పిల్లలు చెప్పారు.
2020-04-20అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చలామణి అవుతోంది. ఆ వీడియోలో.. ముగ్గురు వ్యక్తులు సుమారు 12 అడుగుల పొడవైన నల్లత్రాచు (కింగ్ కోబ్రా)ను భుజాలపై వేసుకొని ఉన్నారు. దాంతో విందు చేసుకోవడానికి అరటి ఆకులను కింద పరిచారు. ‘లాక్ డౌన్’తో ఇళ్ళలో బియ్యం నిండుకున్నందువల్ల అడవికి వెళ్లి రాచనాగును చంపి తెచ్చామన్నది వారిలో ఒక వేటగాడి కథనం. ‘‘ఏదో ఒకటి తెచ్చుకుందామని వెళ్ళాం. ఇది (కింగ్ కోబ్రా) కనిపించింది’’ అని అతను చెప్పాడు. చట్టం ప్రకారం కింగ్ కోబ్రాను చంపడం నేరం. నాన్ బెయిలబుల్ కేసు పెట్టవచ్చు.
2020-04-20ఇండియాలో ‘కరోనా’ వ్యాప్తి ప్రభుత్వాలు చెబుతున్న మోతాదు కంటే ఎక్కువే ఉంది. ఆదివారం ఒకే రోజు 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ డేటా ప్రకారం కేసుల సంఖ్య 17,615కి, మరణాలు 556కి పెరిగాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఆదివారం అదనంగా 552 కేసులు నమోదు కాగా 12 మంది మరణించారు. మహారాష్ట్రలో మొత్తం కేసులు 4,200 దాటగా దేశ రాజధాని ఢిల్లీలో 2000 దాటాయి. గుజరాత్ లో 1743కు పెరిగాయి. పరీక్షలు పెరిగేకొద్దీ కొత్త కేసులు ఎక్కువ వస్తున్నాయి. దేశంలో ఇప్పటిదాకా 3,86,791 నమూనాలను పరీక్షించగా అందులో 4.55 శాతం (17,615 మంది) పాజిటివ్ వచ్చాయి.
2020-04-20మే 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమలవుతున్న ‘లాక్ డౌన్’ను తెలంగాణలో మే 7 వరకు పొడిగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఈ నెల 20 నుంచి దేశవ్యాప్తంగా ఇస్తున్న సడలింపులు కూడా తెలంగాణలో ఉండవని స్పష్టం చేశారు. ఆన్ లైన్ ఆర్డర్లతో ఆహారాన్ని డోర్ డెలివరీ చేయడంపై నిషేధం విధిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. మే 5న మరోసారి మంత్రివర్గం సమావేశమై తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో 858 ‘కరోనా’ కేసులు నమోదు కాగా 21 మంది మరణించారని చెప్పారు.
2020-04-19ఇండియాలో మూడో అతిపెద్ద ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్ ‘సెన్సార్’ ఆరోపణల్లో చిక్కుకుంది. తన వ్యాసాన్ని సెన్సార్ చేసిన కారణంగా ఆ పత్రికకు రాయకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ ఆదివారం ప్రకటించారు. ఆదివారం పత్రికలో ‘గతం, వర్తమానం’ పేరిట గుహ నిర్వహించే కాలంలో ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’పై వ్యాసం రాశారు. అయితే, దాన్ని పత్రిక కత్తిరించింది. ‘‘ఈ వ్యాసాన్ని వదిలేసి కాలంను కొనసాగించాలని పత్రిక నాకు ఆప్షన్ ఇచ్చింది. వారికోసం రాయడం ఆపేయాలని నేను నిర్ణయించుకున్నాను’’ అని గుహ ప్రకటించారు.
2020-04-19అత్యవసరం కాని సరుకులను సరఫరా చేయవద్దని ఇ కామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘లాక్ డౌన్ 2.0’ కోసం ఈ నెల 15, 16 తేదీల్లో ఇచ్చిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదివారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో... ఇ కామర్స్ వేదికల్లో అత్యవసరం కాని సరుకుల అమ్మకంపై నిషేదం అమలవుతుంది.
2020-04-19‘‘నిన్న రిపోర్టయిన 186 కరోనా పాజిటివ్ కేసులూ... వైరస్ లక్షణాలు పైకి కనిపించనివే!. తమకు కరోనా వైరస్ సోకినట్టు వారికి తెలియదు. ఇది మరింత ఆందోళనకరం’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం చెప్పారు. ప్రస్తుతానికి ‘లాక్ డౌన్’ సడలింపు లేదని ఆయన స్పష్టం చేశారు. వారం తర్వాత మళ్ళీ సమీక్షిస్తామని తెలిపారు. దేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదు కావడానికి పరీక్షలు తక్కువ సంఖ్యలో జరగడం ఓ కారణమనే విమర్శలున్నాయి. ‘కరోనా’ పరీక్షల సంఖ్యను పెంచిన తర్వాతే.. లక్షణాలు కనిపించని కేసులు కూడా బయటపడుతున్నాయి.
2020-04-19‘కరోనా’ కేసులు, మరణాల గ్రాఫులో ఇండియా పైపైకి ఎగబాకుతోంది. మృతుల సంఖ్య శనివారం 500 దాటింది. నిన్నటివరకు నమోదైన మరణాల సంఖ్య(480)ను కేంద్ర ప్రభుత్వం శనివారం ఉదయం వెల్లడించింది. గుజరాత్ లో శనివారం మరో ఏడుగురు మరణించడంతో ఆ రాష్ట్రంలో మొత్తం ‘కరోనా’ మృతుల సంఖ్య 48కి పెరిగింది. కేంద్ర జాబితాలో రాజస్థాన్ మృతుల సంఖ్యను 11గా పేర్కొనగా.. వాస్తవంలో 19కి పెరిగింది. ఏపీలో మృతుల సంఖ్య 15కి పెరిగింది. మరికొన్ని రాష్ట్రాల్లో శనివారం మధ్యాహ్నానికి మరణాలు పెరిగాయి. కేసుల సంఖ్యలో నిన్నటిదాకా ప్రపంచంలో 18వ స్థానంలో ఉన్న ఇండియా శనివారం ఆస్ట్రియాను అధిగమించింది.
2020-04-18