ప్రధాని మోదీ రెండో టర్మ్ లో మొదటిసారిగా మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రకటన ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విస్తరణ తర్వాత మంత్రివర్గపు సగటు వయసు తగ్గిపోతుందని, చరిత్రలో ఇదే అత్యంత యువ కేబినెట్ అవుతుందని చెబుతున్నారు. పి.హెచ్.డి.లు, ఎంబిఎల వంటి ప్రొఫెషనల్స్ వస్తారని, మొత్తంగా బీసీలు రెండు డజన్లు అవుతారని సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో 81 మందికి అవకాశం ఉండగా ఇప్పుడు 53 మంది మాత్రమే ఉన్నారు.
2021-07-06ఇండియా తరపున గూఢచర్యం చేసినందుకు తన కుమారుడు యుఎఇలో జైలు పాలయ్యాడన్న కేరళ మహిళ షాహుబనాత్ బీవీ నివేదనపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించింది. దీనికి కేంద్ర ప్రభుత్వ కౌన్సెల్ స్పందిస్తూ, ఆమె విన్నపాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. 2015 నుంచి జైలులో ఉన్న తన కుమారుడు తీవ్రమైన చిత్రహింసలకు గురవుతున్నాడని, అక్కడి భారత ఎంబసీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ కనీస సాయం చేయలేదని పిటిషనర్ ఆరోపించారు.
2021-07-06బౌద్ధ మత గురువు దలైలామా 86వ పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్టు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1959లో ఇండియాకు పారిపోయి వచ్చిన దలైలామా బృందానికి భారత ప్రభుత్వం ఆశ్రయమిచ్చింది. ఆ బృందం ఇండియా నుంచే టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇండియా, చైనా సంబంధాలను ప్రభావితం చేసిన ప్రధానాంశాల్లో ఇదొకటి.
2021-07-06కాంగ్రెస్ పార్టీ ‘‘టూల్ కిట్’’పై ఎన్.ఐ.ఎ.తో దర్యాప్తు కోరిన ‘‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’’ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ ప్రచారంపై ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ ను ఎలా అనుమతిస్తామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా పిటిషనర్ ను ప్రశ్నించారు. ‘‘టూల్ కిట్ మీకు నచ్చకపోతే వదిలేయండి’’ అన్న జస్టిస్ చంద్రచూడ్, ‘‘ఇండియా ఒక ప్రజాస్వామ్యం, మీకు తెలుసా’’ అని పిటిషనర్ ను ప్రశ్నించారు. ‘‘పనికిమాలిన పిటిషన్లు’’ సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
2021-07-05ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల కేసులో అరెస్టయిన 84 సంవత్సరాల గిరిజన హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి సోమవారం మరణించారు. ముంబై తలోజా జైలులో ఉన్న స్వామి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పమని గత నెలలో బాంబే హైకోర్టు ఆదేశించింది. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో నిన్న ఆయన పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ అమర్చారు. ఈ రోజు మధ్యాహ్నం స్టాన్ స్వామి మరణించినట్టు బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ఎస్ షిండే, ఎన్.జె. జమాదార్ ప్రకటించారు.
2021-07-05రెండో వేవ్ రూపంలో ఇండియాను కుదిపేసిన కరోనా ‘డెల్టా’ రకం (B.1.617.2) ముందు వ్యాక్సిన్లు బోల్తా పడ్డట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. టీకాల వల్ల పుట్టిన యాంటీబాడీలకు డెల్టా రకం 8 రెట్లు తక్కువగా స్పందిస్తోందని ఢిల్లీ గంగారామ్ ఆసుపత్రి తాజా అధ్యయనంలో తేల్చింది. అంటే.. చైనాలో గుర్తించిన తొలి రకం వైరస్ పై చూపిన ప్రభావంలో 8వ వంతు కూడా ‘డెల్టా’ రంకపైన వ్యాక్సిన్లు చూపలేకపోయాయి. డెల్టా రకాన్ని మొదటిగా ఇండియాలోనే కనుగొన్న సంగతి తెలిసిందే.
2021-07-05ఇండియాలో కరోనా మూడో వేవ్ ఆగస్టులో ప్రారంభమై సెప్టెంబరులో పతాక స్థాయికి చేరుతుందని ఎస్.బి.ఐ. రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. మహమ్మారి రెండో వేవ్ ఏప్రిల్ లో మొదలై మే నెలలో పతాక స్థాయికి చేరిన విషయాన్ని సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కొత్త కేసుల సంఖ్య జూలై రెండో వారానికి రోజుకు 10 వేల స్థాయికి తగ్గి తిరిగి ఆగస్టు రెండో పక్షంలో పెరగడం ప్రారంభమవుతుందని ఎస్.బి.ఐ. బృందం అంచనా వేసింది. కాగా, సోమవారం 39,796 కొత్త కేసులు నమోదయ్యాయి.
2021-07-05గత నెలలో లాహోర్ నగరంలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక ఇండియా ప్రణాళిక ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఆ బాంబు పేలుడు ఒక భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పనేనని విచారణలో తేలినట్టు పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ విమర్శించారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కోసం పని చేస్తున్న ఒక భారతీయుడు ఈ పని చేశాడన్న మోయీద్, ఆ ఏజెంట్ పేరు మాత్రం చెప్పలేదు. ‘‘ప్రధాన మాస్టర్ మైండ్ ‘రా’కు చెందినవాడు అనడంలో ఏ సందేహమూ లేదు’’ అని మొయీద్ ఉద్ఘాటించారు.
2021-07-04ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడంతో తాలిబన్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లోని పలు కీలక జిల్లాలను వారు ఆక్రమించారు. వాటిలో కాందహార్ ప్రావిన్సులో కీలకమైన పంజ్వాయ్ జిల్లా ఒకటి. కాందహార్ అనగానే ఇండియాకు ఒక చేదు అనుభవం గుర్తుకొస్తుంది. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తరలించారు. అటువైపు తాలిబన్లు, ఇటువైపు ప్రస్తుత ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ చర్చలు జరిపాక... ఇండియా జైళ్ళలో ఉన్న మాసూద్ అజర్ తదితరులను విడుదల చేశారు.
2021-07-04గిరిజన హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచినట్టు ఆయన సహచరులు తెలిపారు. భీమా కోరెగావ్ కేసులో తొమ్మిది నెలలుగా జైల్లో మగ్గుతున్న 84 సంవత్సరాల స్వామికి మే నెలలో కరోనా సోకింది. దీంతో జూలై 5 వరకు ఆయనను ఆసుపత్రిలో ఉంచాలని బాంబే హైకోర్టు గత నెలలో సూచించింది. స్వామి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని జైలు నుంచి విడుదల చేయాలని పౌర సమాజం అనేకసార్లు విన్నవించినా ఎన్ఐఎ వ్యతిరేకించింది. స్వామి ప్రస్తుత స్థితికి ఎన్ఐఎ, కేంద్ర ప్రభుత్వాలదే బాధ్యత అని పౌర హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.
2021-07-04