‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ రిటైల్ స్టోర్లను శాశ్వతంగా మూసివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటించింది. కంపెనీ వెబ్ సైట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 83 స్టోర్లు ఉన్నాయి. ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాలు, ఇతర హార్డ్ వేర్ ఆ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ‘యాపిల్’కు పోటీగా 2009లో రిటైల్ స్టోర్లను ప్రారంభించింది మైక్రోసాఫ్ట్. అయితే, ఆయా స్టోర్లలో అమ్మకాల ఆదాయం అనుకున్నంతగా రావడంలేదు. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ స్టోర్ల ద్వారా జరుగుతున్నది కేవలం 2 శాతమే. ఈ నేపథ్యంలో ‘కరోనా’ తాకిడితో స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తూ మార్చిలో కంపెనీ నిర్ణయం తీసుకుంది.
2020-06-27జాత్యహంకారానికి, వలస పాలనకు ప్రతీకలుగా ఉన్నవారి విగ్రహాలు అమెరికాలో ఈ మధ్య కూలిపోతున్నాయి. వాటి పరిరక్షణకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వును తాజాగా జారీ చేశారు. స్మారక చిహ్నాలు, విగ్రహాలు ధ్వంసం చేస్తే దీర్ఘకాల జైలు శిక్షలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉత్తర్వుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇంతకు ముందే ఉన్న ‘వెటరన్స్ మెమోరియల్ ప్రిజర్వేషన్ యాక్ట్’కు, తాజా ఉత్తర్వుకు తేడా ఏమిటో కూడా తెలియరాలేదు. అయితే... విగ్రహాలు, మాన్యుమెంట్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని గత వారం నుంచీ ట్రంప్ చెబుతున్నారు.
2020-06-27ఇండియాలో ‘కరోనా’ వైరస్ 5 లక్షల మార్కును దాటి వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి వెల్లడిస్తున్న సమాచారం ప్రకారమే రోజుకు 18 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి వరకు దేశంలో అధికారికంగా 5,09,446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటిదాకా 15,689 మంది మరణించారు. ఇండియా కొత్త కేసుల సంఖ్యలో మూడో స్థానంలోనూ, సీరియస్ పేషెంట్ల సంఖ్యలో రెండో స్థానంలోనూ ఉంది. మొత్తం కేసుల సంఖ్యలోనూ వచ్చే వారం రష్యాను అధిగమించి మూడో స్థానానికి చేరనుంది.
2020-06-27దేశంలో వరుసగా 20 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 8.87 చొప్పున ధర పెరగ్గా, డీజిలుపై లీటరుకు ఏకంగా రూ. 10.8 చొప్పున పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడం దీనికి నేపథ్యం. అసలే ‘కరోనా’ కాటుకు గురై అల్లాడుతున్న ప్రజలు ఒక్కో లీటరు పెట్రోలుపై ఏకంగా రూ. 32.98, డీజిలుపై రూ. 31.83 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించవలసి వస్తోంది. డీలర్ వద్దకు వచ్చేసరికి పెట్రోలు ధర సుమారు రూ. 22గా, డీజిల్ ధర సుమారు రూ. 23గా ఉంటోంది. అక్కడ ప్రజలు ఒక్క కేంద్ర ప్రభుత్వానికే 150 నుంచి 170 శాతం వరకు పన్ను కడుతున్నారు.
2020-06-26ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమిపైకి ప్రసరించిన ఈ మెరుపు తీగ పొడవును 700 కిలోమీటర్లుగా ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ లెక్కించింది. ఇప్పటిదాకా రికార్డులకెక్కిన మెరుపులలో ఇదే అతి పొడవైనదని గురువారం ప్రకటించింది. 2018 అక్టోబర్ 31న బ్రెజిల్ లో పిడుగు పడినప్పుడు ఇంత పొడవు మెరుపుతీగ కెమేరాకు చిక్కింది. ఈ మెరుపు తీగ నేలపై పరుచుకుంటే.. హైదరాబాద్ నుంచి దాదాపు శ్రీకాకుళం వరకు వస్తుంది. అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో 2007 జూన్ 20న సంభవించిన మెరుపు తీగ (321 కి.మీ) ఇప్పటిదాకా ఓ రికార్డు. దానికి బ్రెజిల్ మెరుపు రెట్టింపు కంటే ఎక్కువ ఉండటం గమనార్హం.
2020-06-26ప్రపంచవ్యాప్తంగా మత్తుమందుల వినియోగం భారీగా పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించింది. 2018లో 26.9 కోట్ల మంది మత్తుమందులు వినియోగించారని, 2009 నాటికంటే వీరు 30 శాతం ఎక్కువని ప్రపంచ డ్రగ్ రిపోర్టు 2020లో ఆందోళన వ్యక్తం చేసింది. ‘కరోనా’ కారణంగా పెరుగుతున్న నిరుద్యోగం నిరు పేదలను బాధిస్తోందని, మత్తుమందుల వాడకానికి ఇది ప్రేరేపణ అవుతుందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ‘కరోనా’ ప్రభావంతో డ్రగ్ మార్కెట్లలో కొరత ఏర్పడటంవల్ల ధరలు పెరిగి స్వచ్ఛత తగ్గిందని కూడా ఈ నివేదిక విశ్లేషించింది. శుక్రవారం ప్రపంచ డ్రగ్ దినం సందర్భంగా ఈ నివేదిక విడుదలైంది.
2020-06-26చైనా నుంచి వచ్చిన సరుకులను పోర్టులలో తనిఖీ చేయాలన్న ఆకస్మిక నిర్ణయంతో.. హాంకాంగ్, చైనా అధికారులు ఇండియా కన్సైన్మెంట్లను పోర్టుల్లోనే నిలిపివేసినట్టు భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఇఒ) తెలిపింది. ‘‘అధికారికంగా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకున్నా.. తనిఖీల వల్ల పోర్టులలో దిగుమతుల రాశులు పెరిగాయి’’ అని ఎఫ్ఐఇఒ అధ్యక్షుడు శరద్ కుమార్ సరాఫ్ కేంద్ర వాణిజ్య శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఇండియాకు చైనా ఎగుమతులు ఆ దేశ మొత్తం ఎగుమతుల్లో 2.8 శాతమే! ఇండియా చైనాకు పంపే సరుకులు మాత్రం మన ఎగుమతుల్లో 5.4 శాతం’’ అని ఎఫ్ఐఇఒ డీజీ అజయ్ సహాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
2020-06-26 Read Moreయూరప్ నుంచి తమ సేనలను తగ్గించి ఇతర ప్రాంతాలకు పంపడానికి.. చైనాతో ఇండియా, ఇతర దేశాలు ఎదుర్కొంటున్న ప్రమాదం ఒకానొక కారణమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. జర్మనీ నుంచి సేనల ఉపసంహరణపై గురువారం బ్రస్సెల్స్ ఫోరంలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు పాంపియో ఈ సమాధానమిచ్చారు. చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ చర్యలతో ఇండియా, వియత్నాం, మలేషియా, ఇండొనేషియాలకు ప్రమాదం ఉందని, దక్షిణ చైనా సముద్రంలో సవాలు ఎదురవుతోందని పాంపియో వ్యాఖ్యానించారు. ఆ సవాళ్ళను ఎదుర్కొనేలా అమెరికా ఆర్మీ మోహరింపు ఉంటుందని స్పష్టం చేశారు.
2020-06-26‘కరోనా’ వైరస్ వేగంగా వ్యాపిస్తున్న టాప్ 3 దేశాల్లో ఇండియా ఒకటి. దేశంలో వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య గురువారం రాత్రికి 15,308కి పెరిగింది. శుక్రవారం వైరస్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటనుంది. నిన్న రాత్రికి ఈ సంఖ్య 4,91,170గా ఉంది. ఒకే రోజు 18 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంకా రిపోర్టు కాని కేసులు చాలా ఉన్నాయనడంలో సందేహం లేదు. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు పరిమితంగా చేయడం దీనికి ప్రధాన కారణం. దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ లలో వైరస్ వ్యాప్తి అమెరికా నగరాలకు ఏమాత్రం తీసిపోవడంలేదు.
2020-06-26బీహార్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా పిడుగులతో కూడిన వర్షాల ధాటికి 83 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ గురువారం ప్రకటించింది. 23 జిల్లాల్లో పిడుగుపాటుకు మరణాలు సంభవించాయని, అత్యధికంగా గోపాల్ గంజ్ జిల్లాలో 13 మంది చనిపోయారని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది గాయపడగా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్టు తన ప్రకటనలో పేర్కొంది. నవడా, మధుబని జిల్లాల్లో 8 మంది చొప్పున, సివాన్, భాగల్పూర్ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, తూర్పు చంపారన్, దర్భంగా అండ్ బంకా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు.
2020-06-25