ఏ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులపైనైనా దర్యాప్తు జరపడానికి సిబిఐకి రాష్ట్రాల అనుమతి అక్కర్లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు వినయ్ మిశ్రాపై సిబిఐ దర్యాప్తు చేస్తున్న స్మగ్లింగ్ కేసులలో జోక్యానికి కోర్టు నిరాకరించింది. 2018లో రాష్ట్రం సిబిఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నందున తమపై దర్యాప్తు చెల్లదని పిటిషనర్లు వాదించారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్ర ఉన్న కేసుల్లో దర్యాప్తునకు మాత్రం రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
2021-07-28ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రధాన పూజారి పోస్టుకు ‘మళయాళ బ్రాహ్మణులు’ మాత్రమే అర్హులని పేర్కొంటూ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని సవివరంగా పరిశీలించాల్సి ఉందని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ సి.టి. రవికుమార్, జస్టిస్ మురళి పురషోత్తమన్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. బోర్డు నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ పూజారి విష్ణునారాయణన్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక్క కులం తప్ప మిగిలిన అర్హతలు ఉన్న మరికొంతమంది కూడా కోర్టును ఆశ్రయించారు.
2021-07-28డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) బిల్లు 2021 సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏదైనా బ్యాంకు విఫలమైతే డిపాజిటర్లకు 90 రోజులలోగా ఐదు లక్షల వరకు చెల్లించేందుకు ఈ సవరణ వీలు కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బుధవారం కేబినెట్ సమావేశం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. విదేశీ బ్యాంకుల ఇండియన్ బ్రాంచిలు సహా వాణిజ్య బ్యాంకులన్నిటిలోని డిపాజిట్లకు డిఐసిజిసి బిల్లు బీమా కల్పిస్తుందని ఆమె చెప్పారు.
2021-07-28టోక్యో ఒలింపిక్స్ తొలి రోజున భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను రజత పతకాన్ని సాధించడం దేశమంతటా ఉత్సాహాన్ని నింపింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రభుత్వ పెద్దలంతా హడావుడి చేశారు. మరో రెండు రోజులు గడిచాయి. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. పతకాల ప్రాధాన్య క్రమంలో ఇండియా 14వ స్థానం నుంచి 37కి దిగజారింది. మొత్తం మెడల్స్ సంఖ్యలో 31వ స్థానంలో ఉంది. సోమవారం మూడో రోజు క్రీడా సమయం ముగిసేసరికి జపాన్ (8 స్వర్ణాలు), అమెరికా (7 స్వర్ణాలు), చైనా (ఆరు స్వర్ణాలు) అగ్రస్థానాల్లో ఉన్నాయి.
2021-07-26ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మిజోరాం సరిహద్దుల్లో సోమవారం హింస చెలరేగింది. మిజోరాం వైపు నుంచి దుండగులు జరిపిన కాల్పుల్లో అస్సాం పోలీసులు ఆరుగురు మరణించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. కాల్పులు, రాళ్ళదాడిలో కాచర్ జిల్లా ఎస్.పి. సహా 50 మంది గాయపడినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. అయితే, అస్సాం పోలీసులే హింసను ప్రారంభించారని మిజోరాం ప్రభుత్వం ఆరోపించింది. అస్సాం ఐజిపి నాయకత్వంలో 200 మంది సి.ఆర్.పి.ఎఫ్. డ్యూటీ పోస్టును దాటి మిజోరాం పోలీసు పోస్టుపైకి వచ్చారని పేర్కొంది.
2021-07-26కాకతీయ రాజులు 13వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప (రుద్రేశ్వర) దేవాలయాన్ని చారిత్రక సాంస్కృతిక సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. తెలంగాణలోని నేటి ములుగు (పాత వరంగల్) జిల్లాలో ఈ శైవ ఆలయం ఉంది. ఇక్కడి శిల్పాలు గొప్ప కళాత్మక నాణ్యతతో ప్రాంతీయ నృత్య రీతులను, కాకతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని యునెస్కో ఒక ప్రకటనలో పేర్కొంది. చైనాలోని సాంగ్-యువాన్ ప్రపంచ ఎంపోరియాన్ని, ఇరాన్ లోని ట్రాన్స్-ఇరానియన్ రైల్వేను, స్పెయిన్ లోని పాసియో డెల్ ప్రాడో - బ్యూన్ రెటిరో సాంస్కృతిక ప్రదేశాన్ని కూడా యునెస్కో తాజాగా గుర్తించింది.
2021-07-25భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు టోక్యో ఒలింపిక్స్ లో తన ప్రస్థానాన్ని ఓ సునాయాస విజయంతో ప్రారంభించింది. మహిళల సింగ్సిల్స్ లో ఇజ్రాయిల్ షట్లర్ క్సేనియా పొలికర్పోవాపై వరుస మ్యాచులలో 21-7, 21-10తో విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్ సింధు తొలి మ్యాచ్ లో మొదటి రెండు పాయింట్లు కోల్పోయింది. త్వరగానే గాడిలో పడి ఓ దశలో వరుసగా 13 పాయింట్లు స్కోర్ చేసింది. తొలి గేమ్ 13 నిమిషాల్లోనే పూర్తి కాగా, మొత్తంగా 29 నిమిషాల్లో ఆటను ముగించింది. సింధు తర్వాత మ్యాచ్ ఈ నెల 28న హాంకాంగ్ షట్లర్ చెయుంగ్ యితో జరగనుంది.
2021-07-25ఒలింపిక్స్ రెండో రోజున అమెరికా దూకుడు చూపించింది. నిన్న పతకాల పట్టికలో చోటు సంపాదించలేకపోయిన అగ్రరాజ్యం... ఆదివారం కొద్ది గంటల వ్యవధిలోనే ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంశ్య పతకాలతో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. స్విమ్మర్ చేజ్ కాలిజ్ అమెరికాకు తొలి స్వర్ణాన్ని అందించాడు. ఇప్పటివరకు చైనా మూడు స్వర్ణాలు, రెండు కాంశ్య పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, ఆతిథ్య దేశం జపాన్ రెండు స్వర్ణాలు, ఒక రజతంతో రెండో స్థానానికి చేరుకుంది. ఇండియా ఒకే ఒక రజత పతకంతో పట్టికలో 19వ స్థానంలో ఉంది.
2021-07-25సౌదీ అరేబియాలోని హిమ కల్చరల్ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది ‘యునెస్కో’. అక్కడ 7000 సంవత్సరాల సాంస్కృతిక కొనసాగింపునకు చిహ్నాలుగా రాళ్ళపై వేసిన చిత్రాలు గణనీయంగా లభించాయి. వేట, జంతుజాలం, వృక్షజాలం, జీవనశైలిని ప్రతిబింబించిన ఆ చిత్రాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ముస్నాద్, అరామిక్-నబాటియన్, దక్షిణ అరేబియన్, తముడిక్, గ్రీకు, అరబిక్ లిపిలో అక్షరాలున్నాయి. ఫ్రాన్స్ లోని కార్డౌన్ లైట్ హోస్, జర్మనీలోని మాథిల్డెన్‌హో డార్మ్‌స్టాడ్ట్, ఇటలీలోని పాడువాలో గల ఫ్రెస్కో సైకిల్స్ కూడా ‘యునెస్కో’ జాబితాలో చేరాయి.
2021-07-25టోక్యో ఒలింపిక్స్ తొలి రోజున పతకాలను సాధించడంలో అగ్రరాజ్యం అమెరికా విఫలమైంది. అదే సమయంలో ప్రత్యర్థి చైనా ఒలింపిక్స్ తొలి బంగారంతో సహా మూడు బంగారు పతకాలను, ఒక కాంశ్య పతకాన్ని సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. అమెరికా ఒలింపిక్స్ తొలి రోజు ఏ ఒక్క పతకమూ సాధించకపోవడం 1972 తర్వాత ఇదే మొదటిసారి. 1972 మ్యూనిచ్ సమ్మర్ ఒలింపిక్స్ లో ఇలాగే జరిగిందని ఒలింపిక్స్ చరిత్రకారుడు బిల్ మాలన్ చెప్పారు. ఈ ఒలింపిక్స్ తొలి రోజున ఫెన్సింగ్, ఎయిర్ రైఫిల్, ఆర్చరీలలో పతకాలు వస్తాయని అమెరికా ఆశించింది.
2021-07-24