తెలంగాణలో ‘కరోనా’ స్వైరవిహారం చేస్తోంది. శనివారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1087 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే 888 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 74, మేడ్చల్ జిల్లాలో 37, నల్లగొండలో 35, సంగారెడ్డిలో 11 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13,436కి పెరిగింది. ఇప్పటివరకు పరీక్షించిన నమూనాలలో ఇవి 17 శాతం. అంటే.. పరీక్షలు చేయించుకున్న ప్రతి ఆరుగురిలో ఒకరికి ‘కరోనా’ నిర్ధారణ అయింది. ఇది ఆందోళనకరం.
2020-06-27ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిర్దేశించిన 10 శాతం కోటాలో సగాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాపులకు కేటాయిస్తే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు కాపు రిజర్వేషన్ జపం చేసిన జగన్ రెడ్డి, పాదయాత్ర మధ్యలో వ్యూహకర్తల బోధనలతో మాట మార్చారని ఆక్షేపించారు. బ్రిటిష్ పాలనలో బీసీలలో ఉన్న కాపులను 1956లో నీలం సంజీవరెడ్డి తొలగించారని, దామోదరం సంజీవయ్య 1961లో తిరిగి రిజర్వేషన్లు కల్పిస్తే కాసు బ్రహ్మానందరెడ్డి తొలగించారని విమర్శించారు. కొన్ని వర్గాల వారు కాపు రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని పవన్ ఆరోపించారు.
2020-06-27హైదరాబాద్ నగరంలో ‘కరోనా’ పాజిటివ్ రేటుపై కేంద్ర ప్రభుత్వ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘టెస్టింగ్ స్టేటస్: హైదరాబాద్ అండ్ తెలంగాణ’ అనే పేరిట నిపుణులు రూపొందించిన నివేదికపై ‘ద హిందూ’ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణలో జూన్ 23న పరీక్షించిన నమూనాలలో ఏకంగా 32.1 శాతం ‘కరోనా’ పాజిటివ్ గా తేలినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇది దేశంలోని అన్ని నగరాల్లోకి అత్యధికమని నిపుణులు స్పష్టం చేశారు. తెలంగాణలో అతి తక్కువ పరీక్షలు నిర్వహించడాన్ని ఎత్తిచూపుతూ.. జూన్ 10-23 మధ్య పాజిటివ్ రేటు 27.7 శాతంగా ఉందని పేర్కొన్నారు.
2020-06-27 Read Moreఢిల్లీలో నిన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను, ఎన్నికల సంఘం అధికారులను కలసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. శనివారం కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, కిషన్ రెడ్డి లతో సమావేశమయ్యారు. సొంత పార్టీ (వైసీపీ) నేతలు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విన్నవించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్రాణానికి వైసీపీ కార్యకర్తల నుంచి ముప్పు ఉన్నందునే నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు చెప్పారు. తిరుమల ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకే బెదిరింపులు వచ్చాయని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
2020-06-27 Read Moreరాజ్యసభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు కాంగ్రెస్ నేతలు శనివారం బిజెపిలో చేరారు. మార్చి, జూన్ మాసాల్లో రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలలో వీరు ఉన్నారు. మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ సభ్యుల ఎన్నిక ‘కరోనా’ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. జూన్ 19న ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతిపక్షాలకు రాజ్యసభ సీట్లు దక్కకుండా ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించడానికి పలు రాష్ట్రాల్లో రాజీనామాలు చేయించింది బిజెపి. ప్రభుత్వాలను పడగొట్టడానికి కూడా రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నికల్లో తమ పార్టీ సీట్లు కేటాయించడమూ తెలిసిందే.
2020-06-27‘కరోనా’ కేసులు అనంతపురం జిల్లాలో వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఆ జిల్లాలో అత్యధికంగా 161 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1320కి పెరిగింది. కర్నూలు (1684 కేసులు) తర్వాత ఇప్పుడు రెండో స్థానం అనంతపురందే! నిన్నటిదాకా రెండో స్థానంలో ఉన్న కృష్ణా జిల్లా 1252 కేసులతో ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. గుంటూరు కేసులు 1103కి పెరిగాయి. ఇతర రాష్ట్రాలు (1815), విదేశాల నుంచి (377) దిగుమతి అయిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటిదాకా 12,285 మందికి వైరస్ నిర్ధారణ అయింది. నిన్న ఒక్క రోజే 796 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 157 మంది చనిపోయారు.
2020-06-27విద్వేష ప్రచారానికి వేదికైన ‘ఫేస్ బుక్’కు వాణిజ్య ప్రకటనలు నిలిపివేయాలన్న కొన్ని కంపెనీల నిర్ణయం ఈ సామాజిక మాథ్యమ దిగ్గజంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచంలోనే అతిపెద్ద అడ్వర్టైజర్లలో ఒకటైన యూనిలివర్ కంపెనీ కూడా తాజాగా ‘ఫేస్ బుక్’ను బహిష్కరించింది. దీంతో శుక్రవారం ‘ఫేస్ బుక్’ షేరు విలువ 8.3 శాతం పడిపోయి.. కంపెనీ మార్కెట్ విలువ 56 బిలియన్ డాలర్లు తగ్గింది. అధినేత మార్క్ జుకెర్ బెర్గ్ నికర విలువ 7.2 బిలియన్ డాలర్ల (రూ. 54,720 కోట్ల) మేరకు తగ్గి 82.3 బిలియన్ డాలర్లకు చేరింది. అంతే కాక.. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో మార్క్ 3 నుంచి 4వ స్థానానికి తగ్గిపోయారు.
2020-06-27భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా తమిళనాడులో ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ నిర్మాణానికి చేపట్టిన టెండర్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తమిళనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిఎఎన్ఎఫ్ఐఎన్ఇటి) చేపట్టిన టెండర్లలో అవకతవకలపై ‘అరప్పోర్ ఇయక్కమ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. కేంద్రం గత నెలలో టెండర్లను తాత్కాలికంగా నిలిపివేసింది. టెండరు నిబంధనలు కొన్ని కంపెనీలకు మేలు చేసేలా రూపొందించారన్నది ప్రధాన ఆరోపణ. కంపెనీల అర్హతలకు సంబంధించి విధించిన వివక్షాపూరితమైన నిబంధనలను మార్చి మళ్ళీ టెండర్లను పిలవాలని కేంద్రం నిర్దేశించింది.
2020-06-27‘కరోనా’ వైరస్ దేశంలో కొత్త ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తుంటే... దానిపై పోరాడటానికి ప్రధానమంత్రి నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ఐసిఎంఆర్ ప్యానల్ లేదు, మంత్రుల గ్రూపు సమావేశాల్లేవు, విలేకరుల సమావేశాల్లేవు- కోవిడ్ కేసులు పెరుగుతున్నా మోడీ ప్రభుత్వం వెనక్కు వెళ్తోంది’’ అనే శీర్షికన ‘ద ప్రింట్’ రాసిన కథనాన్ని రాహుల్ గాంధీ శనివారం ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘ప్రధాని మౌన వహించారు. ఆయన లొంగిపోయారు. మహమ్మారిపై పోరాడటానికి నిరాకరిస్తున్నారు’’ అని రాహుల్ దుయ్యబట్టారు. ‘కరోనా’ను ఓడించడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రణాళికే లేదని విమర్శించారు.
2020-06-27హైదరాబాద్ ఛాతీ ఆసుపత్రి హెడ్ నర్సు ఒకరు ‘కరోనా’ కారణంగా శుక్రవారం మరణించారు. ఆమె ఈ నెలాఖరులో ఉద్యోగ విమరణ చేయవలసి ఉంది. ఆరోగ్య కారణాలతో సెలవు పెట్టిన ఆమె.. సిబ్బంది కొరత కారణంగా విధుల్లో చేరారు. ‘కరోనా’ వార్డులో విధులు నిర్వర్తిస్తూ వైరస్ బారిన పడ్డారు. విషమ పరిస్థితుల్లో గాంధీ ఆసుపత్రిలో చేరిన ఆమెకు రెండు రోజుల క్రితం వెంటిలేటర్ అమర్చారు. మధుమేహంతో బాధపడుతున్న ఆ నర్సును ‘కరోనా’ బలి తీసుకుంది. శుక్రవారం ఉదయం ఆమె మరణించినట్టు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.
2020-06-27