రైతులు కోరని బహుమతిని ప్రధాని మోదీ ఇస్తానంటున్నారని ‘స్వరాజ్ ఇండియా’ చీఫ్ యోగేంద్ర యాదవ్ విమర్శించారు. ఆదివారం ఢిల్లీ - జైపూర్ రహదారిపై రైతులతో కలసి యోగేంద్ర నిరసనలో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ ను కేంద్రం అర్ధం చేసుకోకపోవడం వల్లనే చర్చలు విఫలమయ్యాయని ఆయన ఉద్ఘాటించారు. ‘‘అదొక వింత చర్చ. వాళ్ళు అవాంఛనీయమైన బహుమతి తీసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారు. ఇది చారిత్రక బహుమతి అని ప్రధాని చెప్పారు. కానీ, రైతులు దాన్ని కోరుకోవడం లేదు’’ అని యోగేంద్ర వ్యాఖ్యానించారు.
2020-12-13బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆదివారం ఆయనే ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. నడ్డా వయసు 60. కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నట్టు ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా బిజెపి రాజకీయ ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రాల పర్యటనలకు వెళ్ళారు. తనకు దగ్గరగా వచ్చినవారు కూడా పరీక్ష చేయించుకోవాలని నడ్డా సూచించారు.
2020-12-13కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం ఉధృతమవుతోంది. ఆదివారం రాజస్థాన్, పంజాబ్, హర్యానాలతో పాటు దక్షిణ భారతం నుంచి వెళ్లిన రైతులు కూడా జైపూర్ - ఢిల్లీ రహదారిపై బైఠాయించారు. ఢిల్లీవైపు ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్తున్న రైతులను రాజస్థాన్- హర్యానా సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా 600 మంది పోలీసులు అక్కడ మోహరించి రోడ్డుపైన అనేక వరుసల్లో బారికేడ్లు, పెద్ద బండరాళ్ళను వేశారు. దీంతో రైతులు రోడ్డుపైనే ధర్నాకు దిగారు.
2020-12-13కరోనా మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయి సంగం భారత దేశం ఆకలితో అలమటిస్తున్న తరుణంలో రూ. 1000 కోట్ల ఖర్చుతో నూతన పార్లమెంటు భవనం నిర్మించడం అవసరమా? ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వేసిన ప్రశ్న ఇది. చైనా మహాకుడ్యాన్ని నిర్మించడానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే చైనా పాలకులు మాత్రం ప్రజలను కాపాడటానికే ఆ గోడను నిర్మించినట్టు చెప్పారని కమల్ వ్యాఖ్యానించారు.
2020-12-13కేంద్ర ప్రభుత్వంపై రైతుల పోరాటం ఉధృతమవుతోంది. రైతు సంఘాల నాయకులు 14వ తేదీ నుంచి నిరాహార దీక్షకు దిగనున్నారు. ఆదివారం ఢిల్లీ-జైపూర్ రహదారిని దిగ్బంధించనున్నట్టు వెల్లడించారు. ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ లోని షాజహాన్ పూర్ నుంచి వేలమంది రైతులు జైపూర్ - ఢిల్లీ రహదారి పైన రేపు ఉదయం 11 గంటలకు కవాతును ప్రారంభిస్తారని నేతలు ప్రకటించారు. ఉత్తర భారత రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన ప్రారంభించి శనివారానికి 17 రోజులైంది.
2020-12-12ఎల్.ఎ.సి. వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పూర్తి బాధ్యత ఇండియాదేనని చైనా గురువారం వ్యాఖ్యానించింది. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించి చైనా భారీగా సేనలను మోహరించిందని నిన్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఆరోపించిన నేపథ్యంలో, ఈ రోజు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ స్పందించారు. రెండు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలను చైనా కచ్చితంగా ఆచరిస్తోందని, ప్రాంతీయ శాంతి- సుస్థిరతలను కాపాడటానికి.. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్న విధానానికి కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు.
2020-12-10బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వాహన శ్రేణిపై దాడి ఘటనలో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నరు జగదీప్ ధంఖర్ ను కోరారు. దాడిని ‘‘ప్రాయోజిత హింస’’గా అమిత్ షా అభివర్ణించారు. దాడి తృణమూల్ పనేనని బిజెపి ఆరోపించగా, అది బిజెపి ‘‘ఉద్దేశపూర్వక కవ్వింపు’’ అని తృణమూల్ ఎదురుదాడికి దిగింది. బెంగాల్ లో ఈ గూండా రాజ్యం అంతం కావాలని నడ్డా వ్యాఖ్యానించగా.. ఇదంతా నాటకమని, హిట్లర్ కూడా ఇలాగే ఎదిగాడని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
2020-12-10బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా వాహన శ్రేణిపై కోల్‌కతాకు దగ్గర్లో కొందరు దుండగులు ఇటుకలు, రాళ్ళతో దాడి చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఉన్నందువల్ల నడ్డాకు ఏమీ కాలేదు. మరో వాహనంలోని పార్టీ నేతలు గాయపడినట్టు ఆయన చెప్పారు. వారంతా గురువారం మధ్యాహ్నం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బరుకు వెళ్తూ తృణముల్ నేతల నిరసన కార్యక్రమం మధ్య నుంచి ప్రయాణించారు. ఆసమయంలోనే కొందరు కాన్వాయ్ వెంటపడ్డారు. డైమండ్ హార్బర్ లోక్ సభ నియోజకవర్గానికి సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2020-12-10నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో 2022 నాటికి కొత్త పార్లమెంటు నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రణాళిక. అయితే, మొత్తం ఈ ప్రాజెక్టుపై వెలువడిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. ఇప్పటికి పార్లమెంటు భవన శంకుస్థాపనకు మాత్రమే కోర్టు అనుమతించింది. నిర్మాణాలను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మోదీ శృంగేరి మఠంనుంచి వచ్చిన పూజారులతో ‘భూమి పూజ’ క్రతువును పూర్తి చేశారు.
2020-12-10కస్టడీ మరణాల్లో పేదలవే అధికం (71.58 శాతం) అని నేషనల్ క్యాంపెయిన్ అగనెస్ట్ టార్చర్ అనే ఢిల్లీ సంస్థ ప్రకటించింది. 1996-97 నుంచి 2017-18 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికలను విశ్లేషించి, గురువారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వెల్లడించింది. 2017-18 వరకు 11 సంవత్సరాలలో ఎన్.హెచ్.ఆర్.సి. ప్రస్తావించిన 95 కస్టడీ మరణాల్లో 68 మంది బాధితులు పేద కుటుంబాలవారని తేలింది. ముగ్గురు (3.019 శాతం) మధ్యతరగతి వారని, 24 మంది (25.26 శాతం) ఆర్థిక స్థితి తెలియదని పేర్కొంది. నిస్సందేహంగా వారిలో మెజారిటీ పేదలే ఉంటారు.
2020-12-10