గత ఐదేళ్లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు 18,345 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్ సభలో వెల్లడించింది. 2015-19 కాలంలో అత్యధికంగా బంగ్లాదేశీయులు 15,012 మందికి భారత పౌరసత్వం లభించింది. ఆఫ్ఘనిస్తానీయులు 665 మందికి, పాకిస్తానీయులు 2,668 మందికి ఇండియా పౌరసత్వం ఇచ్చింది. బంగ్లాదేశీయుల్లో 14,864 మంది...2015 సరిహద్దు ఒప్పందంలో భాగంగా మనకు సంక్రమించిన భూభాగాల్లో నివసించేవారే తప్ప వలసదారులు కారు.
2020-02-12స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్.పి.జి) ఒకే ఒక్కరికి భద్రత కల్పిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం లోక్ సభకు తెలిపారు. 56 మంది ప్రముఖులకు సి.ఆర్.పి.ఎఫ్. భద్రత కల్పిస్తోందని పేర్కొన్నారు. అయితే, ఎవరి పేర్లనూ మంత్రి వెల్లడించలేదు. ప్రస్తుత ప్రధానికి, ఆయన సొంత కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్.పి.జి. భద్రత కల్పించేలా ఇటీవల చట్టానికి సవరణలు చేశారు. దాని ప్రకారం ప్రధాని మాజీ అయ్యాక ఐదేళ్ల వరకు ఎస్.పి.జి. భద్రత ఉంటుంది. సోనియా, మన్మోహన్ కుటుంబాలకు ఎస్.పి.జి.ని తొలగించారు.
2020-02-12ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆప్’ ఘన విజయం సాధించిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ పై హత్యాయత్నం జరిగింది. యాదవ్ మంగళవారం రాత్రి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు కాన్వాయ్ పైన కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక ‘ఆప్’ కార్యకర్త మరణించగా మరో కార్యకర్తకు బుల్లెట్ గాయం అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని మెహ్రౌలి నియోజకవర్గంలో యాదవ్ బిజెపి అభ్యర్ధి కుసుమ్ ఖాత్రిపై 18,161 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2020-02-12‘కరోనా వైరస్’ వ్యాప్తికి కేంద్ర బిందువైన చైనా నగరం ‘వుహాన్’కు బయటి ప్రపంచంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. హుబీ ప్రావిన్సుకు రాజధాని ‘వుహాన్’. కోటి జనాభాతో కళకళలాడే నగరం ఇప్పుడు వెలవెలబోతోంది. నిత్యం లక్షలాది మందిని గమ్య స్థానాలకు చేర్చే బుల్లెట్ రైళ్ళు ‘వుహాన్’ స్టేషన్ దాటి బయటకు వెళ్ళడంలేదు. సోమవారం వరకు చైనాలో ‘కరోనా వైరస్’తో 1016 మంది మరణిస్తే అందులో మెజారిటీ ఈ ప్రావిన్సువారే! సోమవారం మరణించిన 108 మందిలో 103 మంది ‘హుబీ’వాసులే.
2020-02-12ప్రధానమంత్రి ఆవాస యోజన (పిఎంఎవై)-గ్రామీణ పథకం కింద 2019-20లో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. ఆ మాటకొస్తే మంజూరు కూడా చేయలేదు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మంగళవారం లోక్ సభకు ఈ సమాచారం ఇచ్చింది. పిఎంఎవై-జి రెండో దశ కింద ఈ ఏడాది దేశవ్యాప్తంగా 59.90 లక్షల ఇళ్ళు నిర్మించాలన్నది లక్ష్యం కాగా 41.13 లక్షల ఇళ్ళను మంజూరు చేశారు. అందులో 7,18,213 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. ఏపీ, తెలంగాణలలో సున్నా.
2020-02-12లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాటాల అమ్మకం జరిగితే...అది చారిత్రక తప్పిదం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వి. విజయసాయిరెడ్డి చెప్పారు. మంగళవారం రాజ్యసభలో విజయసాయి ఈ అంశాన్ని ప్రస్తావించారు. కార్పొరేట్లకు పన్ను రాయితీ ఇచ్చినా పెట్టుబడులు పెరగలేదని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వ్యయం లక్షన్నర కోట్లు తగ్గించడం వల్ల పన్నుల వసూళ్ళు మందగించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి నవంబర్, డిసెంబర్ జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరారు.
2020-02-12‘కరోనా వైరస్’తో మరణించినవారి సంఖ్య చైనాలో 1016కు చేరింది. సోమవారం ఒక్క రోజే 108 మంది మరణించారు. 31 ప్రావిన్సులలో ఈ మరణాలు నమోదు కాగా, మొత్తం వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య 42,638కి చేరింది. సోమవారం అర్దరాత్రి వరకు 3,996 మందిని ఆసుపత్రులనుంచి డిశ్చార్జి చేశారు. ఇంకా 37,626 మంది ఆసుపత్రులలో ఉన్నారు. వారిలో 7,333 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ పేర్కొంది.
2020-02-11సొంత గడ్డమీద టి20 సిరీస్ లో 5-0తో ఇండియా చేతిలో ఓడిన న్యూజీలాండ్ జట్టు.. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన చివరి వన్డేలో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 296 పరుగులు సాధించింది. ఛేజింగ్ జట్టుకు ఈ స్కోరు అంత తేలికేమీ కాదు. అయితే, కసిమీద ఉన్న న్యూజీలాండ్ 5 వికెట్లకే 300 పరుగులు బాది సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఇండియా ఇలా క్లీన్ స్వీప్ కావడం గత మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.
2020-02-11ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ అభ్యర్ధుల అత్యధిక మెజారిటీ 88,158 (బురారి) కాగా, బిజెపి గెలిచిన సెగ్మెంట్లలో గరిష్ఠంగా 28,370 మాత్రమే వచ్చింది. ఘోండా నగర్ బిజెపి అభ్యర్ధి అజయ్ మహావర్ అంత ఆధిక్యాన్ని సాధించగా మిగిలిన బిజెపి విజేతలు 880 నుంచి 16,457 వరకు మెజారిటీలు సాధించారు. ఆ 7 నియోజకవర్గాలు- బాదర్పూర్ (3719), గాంధీనగర్ (6079), కరవాల్ నగర్ (8223), లక్ష్మీనగర్ (880), రోహిణి (12,648), రోహ్తాస్ నగర్ (13,241), విశ్వాస్ నగర్ (16,457).
2020-02-11ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 (సుమారు 86.29 శాతం) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. టీడీపీకి కేవలం 13.14 శాతం సీట్లు (23) దక్కాయి. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఇంతకంటే ఎక్కువ తేడా నమోదైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 88.57 శాతం సీట్లు (62) కైవశం చేసుకోగా, బిజెపి కేవలం 11.43 శాతం సీట్లకు పరిమితమైంది. 2015లో ఇంతకంటే ఘోరంగా కేవలం 4.28 శాతం సీట్ల (3)కే పరిమితమైన విషయం తెలిసిందే.
2020-02-11