అమెరికా అధ్యక్ష ఎన్నికల బరినుంచి బెర్నీ శాండర్స్ హఠాత్తుగా వైదొలిగారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ తరపున జో బైడెన్ అభ్యర్ధిత్వం ఖరారైనట్టే. తన ప్రచారాన్ని ముగిస్తున్నట్టు బెర్నీ కొద్దిసేపటి క్రితం స్వయంగా వెల్లడించారు. వెర్మాంట్ సెనెటర్ అయిన బెర్నీ డెమోక్రాటిక్ సోషలిస్టుగా పేరు గాంచారు. ఓ దశలో మిగిలిన డెమోక్రాటిక్ అభ్యర్ధులందరికంటే ముందున్నారు. అయితే, బెర్నీకి వ్యతిరేకంగా మిగిలిన డెమోక్రాట్ నేతలు జో బైడెన్ కు మద్ధతు ప్రకటించారు. ఇటీవలి ప్రైమరీ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. బెర్నీ నిష్క్రమణతో.. నవంబర్ 3వ తేదీన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ పోటీ ఖాయమైనట్టే.
2020-04-08మార్చి 22న ‘జనతా కర్ఫ్యూ’ విధించిన నాటి నుంచి ఇండియా మొత్తం దిగ్బంధంలో ఉంది. 135 కోట్లకు పైగా జనాభా కదలికలను సైతం నియంత్రించిన ఈ దిగ్బంధం భూగోళం చరిత్రలోనే అతిపెద్దది. వైరస్ వ్యాప్తి వేగాన్ని ఇది తగ్గిస్తోంది. అయినా.. మార్చి 21న 330గా ఉన్న ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారానికి (ఏప్రిల్ 8కి) 5,500కి పెరిగింది. పరీక్షల రేటు పెరిగితే వైరస్ కేసులు మరిన్ని బయటపడతాయి. ప్రస్తుతం లక్ష మంది జనాభాలో 10 మందికి కూడా పరీక్షలు జరగలేదు. కనీస సదుపాయాలతో కూడిన పరిశుభ్రమైన వార్డులు, వైద్య, రక్షణ సామాగ్రి లేకపోవడం అతి పెద్ద సమస్య.
2020-04-08కరోనా వైరస్ సోకినవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొట్టమొదట బలయ్యేది వారి కుటుంబాలే! ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కుటుంబాల మధ్య ‘కరోనా’ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ‘కోవిడ్-19’ పేషెంట్ వల్ల ఆయన కుటుంబంలోని 8 మంది వైరస్ బారిన పడ్డారు. ఖర్గోన్ జిల్లాలోని ఈ కుటుంబంలో 8 మందికీ వైరస్ పాజిటివ్ తేలిందని బుధవారం అధికారులు తెలిపారు. బెంగాల్ రాష్ట్రంలో ఇప్పుడు చికిత్స పొందుతున్నవారిలో మెజారిటీ కేసులు కుటుంబ బాధితులేనని నిన్న ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించారు.
2020-04-08ప్రభుత్వ రంగంలోని లేబొరేటరీలలో గానీ, ప్రభుత్వ ఆమోదంతో నడుస్తున్న ప్రైవేటు లేబొరేటరీలలో గానీ ‘కోవిడ్ 19’ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ‘వర్చువల్ కోర్టు’ విచారించింది. ‘కోవిడ్19’ పరీక్షలను ఎన్ఎబిఎల్ గుర్తింపు పొందిన లేబొరేటరీలలో లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసిఎంఆర్ ఆమోదించిన లేబొరేటరీలలో నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై బదులివ్వడానికి ప్రభుత్వానికి రెండు వారాలు సమయం ఇచ్చింది.
2020-04-08ప్రపంచంలోని అతి పెద్ద మురికివాడలలో ‘ధారావి’ ఒకటి. ముంబై మహా నగరంలోని ఈ ప్రాంతంలో జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 2.77 లక్షలు. కరోనా వైరస్ అక్కడికి రాకూడదని కోరుకోనివారు లేరు. కానీ, ముంబైలో వేగంగా విస్తరించిన ఈ మహమ్మారి ధారావినీ వదల్లేదు. తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో తొమ్మిది మందికి వైరస్ నిర్ధారణ అయింది. మొదట వైరస్ సోకిన వ్యక్తి గత వారమే మరణించారు. తాజా రెండు కేసుల్లో బాధితుల వయసు 25, 35గా చెబుతున్నారు. మరింతమందికి పరీక్షలు జరిగితే కేసుల సంఖ్య పెరగవచ్చు.
2020-04-08ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ‘కరోనా’ కష్టకాలంలో రిజర్వు బ్యాంకు స్వల్పంగా ఊరట కలిగించింది. వరుసగా 21 రోజుల వరకు, ఒక త్రైమాసికంలో 50 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్టు (ఒ.డి) సదుపాయాన్ని వినియోగించుకునేలా పరిమితులను పెంచింది. ఇప్పటిదాకా.. వరుసగా 14 రోజులకు మించి, ఒక త్రైమాసికంలో 36 రోజులకు మించి ఒ.డి.కి వెళ్లే అవకాశం లేదు. తాజా మార్పులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. 2020 సెప్టెంబరు 30 వరకు ఈ వెసులుబాటు కల్పించింది. ఒ.డి.గా తీసుకునే మొత్తంపైన అదనపు వడ్డీ ఉంటుంది.
2020-04-08గుజరాత్ నుంచి 3 కంపెనీలు హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను అమెరికాకు ఎగుమతి చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పారు. ఈ పరిణామాన్ని.. ‘ప్రపంచవ్యాప్తంగా గుజరాత్ ప్రకాశించడం’గా సిఎం అభివర్ణించారు. ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ పంపకపోతే ‘ప్రతీకార చర్యలు’ ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. కేంద్ర అనుమతించినందున ఎగుమతులకు గుజరాత్ సిద్ధంగా ఉందని విజయ్ రూపాని మంగళవారం ఓ ప్రైవేటు రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు.
2020-04-08‘కరోనా’ నిరోధానికంటూ.. ‘టిక్ టాక్’ వీడియో చూసి ‘దేశీ’ వైద్యానికి దిగిన రెండు కుటుంబాలు ఏపీలో ఆస్పత్రి పాలయ్యాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని ఆలపల్లె గ్రామంలో 10 మంది ఉమ్మెత్త పువ్వు విత్తనాలతో జ్యూస్ చేసి తాగారు. వారు అనారోగ్యానికి గురి కావడంతో పొరుగువారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత వారిని డాక్టర్లు డిశ్చార్జి చేశారు. అలాంటి వీడియోలను చూసి సొంత వైద్యానికి దిగవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య ప్రజలకు సూచించారు.
2020-04-08తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ 23 రోజుల పసిపాపకు ‘కరోనా’ సోకినట్టు మంగళవారం నిర్ధారణ అయింది. ఢిల్లీలో ‘తబ్లిఘి జమాత్’ కార్యక్రమాలకు హాజరై తిరిగి వచ్చినవారి నుంచి ఈ పాపకు వైరస్ సోకినట్టు సమాచారం. దేశంలో ‘కరోనా’ సోకినవారిలో అతి పిన్న వయస్కురాలు ఈ పాప. ‘తబ్లిఘి’ బాధితులతో కలిపి మహబూబ్ నగర్ జిల్లాలో ‘కరోనా’ బాధితుల సంఖ్య 10కి చేరింది. మంగళవారం నిర్ధారణ అయిన మూడు కేసుల్లోనూ.. ఢిల్లీ నిజాముద్దీన్ మత కార్యక్రమాల్లో పాల్గొన్నవారి నుంచే వైరస్ సంక్రమించినట్టు అధికారులు తెలిపారు.
2020-04-08‘కరోనా’ మహమ్మారి ఇండియాలో ఓ 14 నెలల పసిగుడ్డును చిదిమేసింది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ పట్టణంలో మంగళవారం ఆ పసి బాలుడు మరణించాడు. ఇండియాలో నిన్నటిదాకా ‘కరోనా’ బారిన పడిన అతి పిన్న వయస్కుడు ఈ బాలుడే. బాలుడి తల్లిదండ్రులు కార్మికులు. జామ్ నగర్ శివార్లలోని దరేద్ గ్రామంలో నివశిస్తున్నారు. ఏప్రిల్ 4 ఉదయం ఆ బాలుడిని జిజి ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. అయితే, సాయంత్రానికి బాలుడి ఆరోగ్యం విషమించడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్చారు.
2020-04-07