నిన్న ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ సోమవారం గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఎన్నికల వాయిదాకు గల కారణాలను ఆయనకు వివరించారు. ‘కరోనా వైరస్’ను కేంద్ర ప్రభుత్వం ‘విపత్తు’గా ప్రకటించడాన్ని, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నిషేదాజ్ఞలను వివరించారు. ఆదివారం సిఎం జగన్ గవర్నరును కలసి ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నరు ఎన్నికల కమిషనర్ ను పిలిపించారు. ఎన్నికల కమిషనర్ తో పాటు పోలీసు ఐజీ సత్యనారాయణ కూడా గవర్నరును కలిశారు.
2020-03-16‘కరోనా వైరస్’ వ్యాప్తి నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కోరబోతున్నట్టు సమాచారం. 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఇసి సిద్ధమైంది. సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. అక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష బిజెపి కూడా ఎన్నికల వాయిదా కోరుతున్నాయి. ఏపీలో అందుకు విరుద్ధంగా... కరోనా వైరస్ ప్రాణాంతకం కాదంటూ సిఎం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారాలను ప్రశ్నించడం గమనార్హం.
2020-03-15ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను తాను నియమించలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను బిశ్వాల్ పేరు సిఫారసు చేస్తే.. అప్పటి గవర్నర్ నరసింహన్ రమేష్ కుమార్ పేరు సూచించారని చంద్రబాబు వెల్లడించారు. రమేష్ కుమార్ 7 సంవత్సరాలు గవర్నర్ దగ్గర పని చేశారని, అంత సుదీర్ఘంగా మరెవరూ పని చేయలేదనే కారణంతో నరసింహన్ సూచించారని, తనకు ఇష్టం లేకపోయినా ఆమోదించానని చంద్రబాబు చెప్పారు. అలాంటి నియామకానికి తనపై ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని సిఎంపై మండిపడ్డారు.
2020-03-15సిఎం అయితే సర్వాధికారాలు ఉంటాయా? అని జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘నీకు సర్వాధికారాలున్నాయా? ఎక్కడినుంచి వచ్చాయి? ముఖ్యమంత్రికి రాజ్యాంగమే అధికారాలు ఇచ్చింది. రాజ్యాంగానికి మించిన అధికారం నీకుందా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర అధికారులను మార్చినప్పుడు నువ్వేమన్నావు.. ఇప్పుడేం మాట్లాడుతున్నావు?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘నీ ఎన్నిక కూడా ఎన్నికల కమిషనే నిర్వహించింది. 151 మంది ఎన్నికను ప్రకటించిందీ ఎన్నికల అధికారులే’’ అని చంద్రబాబు సిఎంకు గుర్తు చేశారు.
2020-03-15‘కరోనా వైరస్’ భయానకమేమీ కాదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ కారణంగా ఎన్నికలు వాయిదా వేయడం అన్నది ఒక సాకు మాత్రమేనని ఆయన ఆక్షేపించారు. 60 ఏళ్ల పైగా వయసు ఉన్నవారు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిపైనే ‘కరోనా’ ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన కేసుల్లో 81.9 శాతం మందికి ఇంట్లోనే చికిత్స చేస్తున్నారని, 13 శాతం మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 4.7 శాతం కేసులను మాత్రమే ఐసియులో పెట్టారని జగన్ చెప్పారు.
2020-03-15రాష్ట్రంలో అధికారం తనదా లేక ఎన్నికల కమిషనర్ దా? అని ప్రశ్నించారు సిఎం జగన్. ‘స్థానిక’ ఎన్నికలను వాయిదా వేస్తూ.. అక్రమాలు జరిగినచోట్ల అధికారులను బదిలీ చేస్తూ ఎస్ఇసి చేసిన ప్రకటనపై జగన్ మండిపడ్డారు. ప్రజలు ఓట్లేసి 175 అసెంబ్లీ సీట్లలో 151 ఇస్తే తాను సిఎం అయ్యానన్న జగన్ ‘‘ఎన్నికలు వాయిదా వేసి నువ్వే సిఎం లాగా కలెక్టర్లు, ఎస్పీలను మారుస్తావు. ఇళ్ళ పట్టాలు ఇవ్వొద్దని సర్క్యులర్ ఇస్తావు. డెమోక్రసీలో ప్రజలు ఓట్లేయడం ఎందుకు? సిఎంలు, ఎమ్మెల్యేలు కావడం ఎందుకు?’’ అని ఎస్ఇసిని ప్రశ్నించారు. ఈ మధ్య అందరూ ‘‘విచక్షణాధికారం’’ అనే పదాన్ని నేర్చుకున్నారని సిఎం ఎద్దేవా చేశారు.
2020-03-15ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆయన ఇష్టం వచ్చినట్టు తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అధికారిని ఎన్నికల కమిషనర్ గా నియమించాడని వ్యాఖ్యానించారు. ‘కరోనా’ సాకుతో ఓవైపు ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తూ..మరోవైపు గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను మారుస్తున్నట్టు సిఎంలాగా ఆదేశాలిచ్చాడని ఆక్షేపించారు. ఈ అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ‘ఎవడో’ రాసి ఇచ్చిన ఆర్డర్లను ఆయన ఈరోజు చదివాడని సిఎం వ్యాఖ్యానించారు.
2020-03-15స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల తర్వాత యధాతథంగా కొనసాగిస్తామన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాయిదా చాలదని... నామినేషన్ల ప్రక్రియను మళ్లీ చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వాయిదాను స్వాగతిస్తూనే... మొత్తం ప్రక్రియను మళ్లీ చేపట్టాలని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు కోరారు. అధికార వైసీపీ దౌర్జన్యాలతో ప్రతిపక్షాల నామినేషన్లను అడ్డుకుందని, ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేదని పవన్ పేర్కొన్నారు. పోలీసులే బెదిరించి నామినేషన్లను ఉపసంహరింపజేశారని విమర్శించారు.
2020-03-15స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా.. ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు శ్రీకాళహస్తి, పలమనేరు డి.ఎస్.పి.లు, మరికొందరిని బదిలీ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ఆదేశాలిచ్చారు. వారి స్థానంలో వేరొకరిని నియమించడానికి పేర్లు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి చేసిన కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చినందుకు సిఐని సస్పెండ్ చేసి వేరొకరిని ఆ స్థానంలో నియమించాలని ఆదేశించారు.
2020-03-15రాష్ట్రంలో హడావిడిగా చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ‘కరోనా వైరస్’ కారణంగా వాయిదా పడింది. ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. వాటిలో ఏకగ్రీవాలతో సహా ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ యధాతథంగా 6 వారాల తర్వాత లేదంటే ‘కరోనా వైరస్’ తగ్గిన తర్వాత కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ప్రకటించిన షెడ్యూలును నిలిపివేస్తున్నట్టు చెప్పారు. కర్నాటక, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలకు ‘కరోనా’ వ్యాపించినందున పోలింగ్ నిర్వహించడం ప్రజారోగ్యానికి హానికరమని ఎస్.ఇ.సి. తన నోటిఫికేషన్లో పేర్కొంది.
2020-03-15