బిజెపితో కలసి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూణ్ణాళ్లు కూడా ముచ్చట తీర్చుకోలేకపోయిన అజిత్ పవార్ మరోసారి ఆ కుర్చీలో కూర్చోనున్నట్టు సమాచారం. కొద్ది రోజుల్లో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నట్టు ఎన్.సి.పి. వర్గాలు తెలిపాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మంత్రివర్గంలో ఆయనకు రెండు మంత్రిత్వ శాఖలు ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. దిలీప్ వాల్సే పాటిల్ హోంమంత్రి అవుతారని సమాచారం.
2019-12-25తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఉద్యోగ విరమణ వయసు 60గా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసు 58గా ఉండేది. విభజన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ 60 ఏళ్ళ వరకు అవకాశం ఇచ్చాయి. వారితో సమానంగా తమకూ 60 చేయాలని ప్రభుత్వ కార్పొరేషన్లు కోరుతూ వచ్చాయి.
2019-12-25కొద్ది రోజుల క్రితం మంగళూరు పోలీసు కాల్పుల్లో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కర్నాటక సిఎం యెడియూరప్ప ఇప్పుడు మాట మార్చారు. హింసాత్మక ఘటనల్లో వారిద్దరూ అమాయకులని దర్యాప్తులో రుజువయ్యేవరకు పరిహారం చెల్లించబోమని బుధవారం స్పష్టం చేశారు. మంగళూరు ఘటనలపై ఓవైపు సిఐడి దర్యాప్తు, మరోవైపు మెజిస్టీరియల్ విచారణ జరుగుతోంది.
2019-12-25ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో వ్యవస్థ పని చేయడం అనేది పిచ్చి ఆలోచనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించి... వివిధ వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కన్నా తీవ్రంగా తప్పు పట్టారు. ముఖ్యమంత్రి మారగానే రాజధానిని చంకన పెట్టుకొని పోతారా? అభివృద్ధిని ఆపేస్తారా? అని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను కన్నా బుధవారం పరామర్శించారు.
2019-12-25ఎన్నికల తర్వాత టీడీపీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా ఓ కలకలానికి కేంద్ర బిందువయ్యారు. విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా, నగరానికి చెందిన ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశమై ‘‘విశాఖపట్నంలో రాజధాని’’ని స్వాగతిస్తూ తీర్మానం చేయించారు. విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
2019-12-25ఇండియాలో జీడీపీ వృద్ధిని గణించడానికి అనుసరిస్తున్న పద్ధతులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బలమైన సందేహలను వ్యక్తం చేసింది. గత సిరీస్ కు భారీ సవరణలు, తక్కువ వ్యవధిలో సిరీస్ మార్చడం, ఉత్పత్తి కార్యకలాపాల జీడీపీకి.. వ్యయానికి మధ్య అంతరాలు ఉండటం వంటి అంశాలను ఐఎంఎఫ్ ఎత్తిచూపింది. 2011-11 ప్రామాణిక సంవత్సరంగా విడుదల చేసిన పూర్వపు సిరీస్ డేటాపై దేశీయంగా కూడా పెద్ద దుమారమే చెలరేగింది.
2019-12-25వార్షిక సూర్య‘గ్రహణం’ గురువారం సంభవించనుంది. ఈ అంతరిక్ష విన్యాసాన్ని కేరళ, కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వీక్షించే అవకాశం ఉంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చే ఈ సన్నివేశం డిసెంబర్ 26 ఉదయం 8.04 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయానికి సూర్యుడి అంచును తాకే చంద్రుడు... 9.24 సమయానికి మధ్య భాగానికి వస్తాడు. 9.26కి సూర్యుడిని దాదాపు పూర్తిగా కప్పేస్తాడు. ఆ సమయంలో ఉంగరం ఆకారం కనిపిస్తుంది.
2019-12-25‘‘జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్)కు, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)కి సంబంధం లేదు’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. న్యూస్ ఏజన్సీ ఎ.ఎన్.ఐ.తో మాట్లాడుతూ... ఎన్.ఆర్.సి.పై కేంద్ర మంత్రివర్గంలో గానీ, పార్లమెంటులో గానీ చర్చ జరగలేదని, ఈ విషయమై పిఎం మోడీ చెప్పింది నిజమేనని పేర్కొన్నారు. ఎన్.ఆర్.సి.పై దేశవ్యాప్తంగా చర్చించవలసిన అవసరం లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు.
2019-12-25ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ ఇ.వి. రామస్వామి వర్ధంతి రోజైన మంగళవారం బిజెపి తమిళనాడు శాఖ సామాజిక మాథ్యమాల్లో పెట్టిన ఓ పోస్టు వివాదాస్పదమైంది. పెరియార్ తన భార్య మణియమ్మయితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘‘పిల్లలను లైంగికంగా వేధించేవారికి మరణశిక్షను సమర్ధిద్దాం. ‘పోక్సో’ నిందితులు లేని సమాజాన్ని సృష్టిద్దాం’’ అని బిజెపి పిలుపునిచ్చింది. పెరియార్ 69 సంవత్సరాల వయసులో 31 ఏళ్ళ మణియమ్మయిని వివాహం చేసుకోవడాన్ని హేళన చేయడం ఈ పోస్టు ఉద్ధేశంగా ఉంది.
2019-12-24జాకోబ్ లిండెంతల్ ఓ జర్మన్. విద్యార్ధుల మార్పిడి ఒప్పందంలో భాగంగా మద్రాస్ ఐఐటిలో పీజీ చదువుతున్నాడు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నాడు. దీంతో బీజేపీ నేతలకు మంట పుట్టింది. ఫలితం... జాకోబ్ ఉన్నపళంగా జర్మనీ వెళ్లిపోవలసి వచ్చింది. చెన్నైలోని ‘‘విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం’’ నుంచి అందిన ఆదేశాలతో జాకోబ్ సోమవారం ఆమ్స్టర్డాం విమానం ఎక్కారు. వీసా నిబంధనలను ఉల్లంఘించినందునే చర్య తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
2019-12-24