కుటుంబ పార్టీలు బలహీనవర్గాలను, దళిత, ఆదివాసీ, మైనారిటీలను ఎదగనివ్వవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయా వర్గాలను పట్టించుకోలేదంటూ... బిజెపి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసిందని, తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని ఉద్ఘాటించారు. బి.ఆర్.ఎస్. బీసీ విరోధి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. సొంత బిడ్డల కోసమే పని చేస్తాయన్నారు. మంగళవారం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. బిజెపిలో 85 మంది బీసీ ఎంపిలు, 365 మంది బీసీ శాసనసభ్యులు ఉన్నారని మోదీ చెప్పారు.
2023-11-07ఏపీలో రైతు భరోసా పథకం కింద ఐదో ఏడాది ఇవ్వాల్సిన మొత్తంలో రూ. 4000ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేసారు. మొత్తం 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2,204.77 కోట్లను జమ చేస్తున్నట్లు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సభలో సి.ఎం. లాంఛనంగా ప్రకటించారు. చంద్రబాబు పాలన అంటే కుంభకోణాలు తప్ప చెప్పటానికి ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? అని జగన్ ప్రశ్నించారు.
2023-11-07ప్రజల తరఫున పోరాడుతున్న అందరిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై 60 వేలకు పైగా కేసులు బనాయించారని పేర్కొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం రాజ్ భవన్ లో గవర్నరును కలిసింది. రాష్ట్రంలో ప్రజలపై కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో గవర్నరుకు వివరించామని లోకేష్ విలేకరులకు తెలిపారు.
2023-11-07బీహార్ తరహాలో కులాలవారీగా జనాభా వివరాలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ నెల 20 తర్వాత సమగ్ర కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి చెప్పారు. అణగారిన వర్గాలకు మరింత భద్రత కల్పించే ఉద్ధేశంతో... సమాజంలో ఉన్న ఆర్థిక-సామాజిక స్థితి, విద్య, ఉపాధి, జనాభా సమతుల్యత వంటి అంశాలతో కులగణన జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
2023-11-03ఇజ్రాయిల్ వైమానిక దళం శుక్రవారం గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి చేసింది. ఆసుపత్రి ప్రవేశ ప్రాంతంలో బాంబులు కురిపించడంతో కొన్ని పదుల మంది ప్రాణాలు కోల్పోయారు. నిరంతర దాడుల్లో గాయపడి అల్-షిఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఇతర దేశాలకు పంపేందుకు గాను, అంబులెన్సుల కాన్వాయ్ ఈజిప్టు సరిహద్దుకు బయలుదేరిన సమయంలో బాంబుదాడి జరిగిందని పాలస్తీనా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చెల్లాచెదురుగా పడిన శవాలు, ధ్వంసమైన అంబులెన్సులతో ఆసుపత్రి ప్రాంగణం భయానకంగా మారింది.
2023-11-03తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ విరమించుకుంది. కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్టు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం ప్రకటించారు. ‘‘మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదు’’ అని పార్టీ కార్యకర్తలకు ఆమె సందేశమిచ్చారు. పాలేరు నుంచి తాను పోటీ చేయాలనుకున్నానని, అయితే 2013లో తాను పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం కలసి తిరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారని గుర్తు చేస్తూ... ‘‘నన్నేం చేయమంటారు? పొంగులేటిని ఓడించమంటారా.. నన్ను ఓడిపొమ్మంటారా?’’ అని పాలేరు ప్రజలను ఆమె ప్రశ్నించారు.
2023-11-03తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ విజయయాత్ర ప్రారంభమవుతుందని... చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీని కూడా గెలుచుకుంటామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పాలమూరు ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.ను, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడిద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిని నిర్ణయించే అవకాశం బి.జె.పి.కి రాదని పేర్కొన్నారు.
2023-11-01ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. బుధవారం సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘‘మోదీకి ఒక పిచ్చి ఉన్నది. అంతా ప్రైవేటీకరణే...! రైల్వేలు, విమానాశ్రయాలూ ప్రైవేటుకే. అదే పిచ్చిలో కరెంటు రంగం కూడా ప్రైవేటీకరణకు పెట్టారు.’’ అని విమర్శించారు. తాము ప్రభుత్వ రంగంలో విద్యుత్ ప్రాజెక్టులు చేపడుతుంటే మోదీ కోపగించుకున్నాడని, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టకపోతే నిధులు రావని హెచ్చరించాడని కె.సి.ఆర్. ఆరోపించారు. ‘‘మీటర్లు పెట్టమంటే నేను చచ్చినా పెట్టనన్నా... నేను బతికుండగా మీటర్లు రానివ్వనన్నా’’ అని చెప్పారు.
2023-11-01ఉత్తర భారత దేశంలో దళితులపై దాడులు జరగని రోజు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. బుధవారం సత్తుపల్లి ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో విపరీతంగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ‘‘ఇది ప్రజాస్వామ్య దేశమా... అరాచకమా?’’ అని కె.సి.ఆర్. ప్రశ్నించారు. దళితుల వెనుకబాటును ఉద్యమ సమయంలోనే గుర్తించి చైతన్య వేదిక ఏర్పాటు చేశానని, అదే స్ఫూర్తితో ఇప్పుడు దళిత బంధు పథకాన్ని ప్రారంభించానని సిఎం చెప్పారు.
2023-11-01తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 9వ తేదీన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారని ఆయన తనయుడు, మంత్రి కె.టి. రామారావు వెల్లడించారు. బుధవారం కామారెడ్డిలో జరిగిన ఎన్నికల సభలో కె.టి.ఆర్. మాట్లాడారు. బిజెపికి ఓట్లు వేసి వృధా చేసుకోవద్దని ప్రజలకు విన్నవించారు. బిజెపి వాళ్ళు డబ్బు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం కారు గుర్తుపైనే వేయాలని సూచించారు. ‘‘గుజరాత్ దొంగ పైసలు ఇస్తే బ్రహ్మాండంగా గుంజుకోండి. అవి మనలను దోచుకొని తెచ్చుకున్న పైసలే’’ అని కె.టి.ఆర్. వ్యాఖ్యానించారు.
2023-11-01