అమెరికాలో కనీసం 6 ఆమెజాన్ గిడ్డంగులలో పని చేస్తున్న ఉద్యోగులకు ‘కరోనా వైరస్’ సోకినట్టు వార్తా కథనాలు వచ్చాయి. న్యూయార్క్, కెంటుకీలోని షెపర్డ్స్ విల్లె, ఫ్లోరిడాలోని జాక్సన్విల్లే, టెక్సాస్ లోని కాటి, మిచిగాన్ లోని బ్రౌన్స్టౌన్ తో పాటు ఓక్లహోమా నగరంలోనూ అమెజాన్ ఉద్యోగులకు వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఆయా గోడౌన్లను శుద్ధి చేయడానికి మూసివేశారు. వైరస్ సోకినవారితో దగ్గరిగా మెలిగినవారిని క్వారంటైన్ లో ఉంచారు. లక్షల మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో విఫలమైందనే ఆరోపణ వినవస్తోంది. ఇది కస్టమర్లకు కూడా ఆందోళనకరంగా పరిణమించింది.
2020-03-25‘కరోనా వైరస్’ సంబంధమైన సమస్యలతో కేలిఫోర్నియా రాష్ట్రంలో ఓ మైనర్ చనిపోయినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ న్యూసోమ్ నిర్ధారించారు. వైరస్ ఎవరిపైనైనా ప్రభావం చూపుతుందనడానికి ఇదొక ఉదాహరణ. వృద్ధులను మాత్రమే వైరస్ చంపుతుందన్నది మూఢ నమ్మకంగా ఇప్పటికే తేలిపోయింది. కేలిఫోర్నియాలో మంగళవారం మధ్యాహ్నం వరకు 2,102 వైరస్ పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో సగం పేషెంట్లు 18 నుంచి 49 సంవవత్సరాల వయసు వారే. అందువల్ల యువత కూడా ఇళ్ళకే పరిమితం కావాలని గవర్నర్ న్యూసోమ్ సూచించారు.
2020-03-25‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం ‘లాక్ డౌన్’ ప్రకటించారు. అవసరమే! అయితే, నిర్బంధం సమయంలో ప్రజలు పడే ఇబ్బందుల పట్ల ఆయన మౌనం వహించారు. దేశవ్యాప్తంగా మరో 20 రోజుల పాటు ప్రజలు ఎదుర్కోబోతున్న ఇబ్బందులకు ఒకానొక సాక్ష్యం ఈ చిత్రం. అవసరంలో ఉన్నవారికి నిన్న (మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించక ముందు) బెంగళూరు పోలీసులు పీన్య ప్రాంతంలో ఆహారం పంపిణీ చేస్తున్న దృశ్యం ఇది. ఇలా ఎవరో ఒకరు లేదా కొందరు చేస్తే దేశమంతా అవసరం తీరదు. ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా చేయవలసిన పని ఇది. అధికార ప్రయోగంతో పాటు ఆరోగ్య సంరక్షణా చర్యలు, ఆపన్నులకు సాయం తక్షణ కర్తవ్యాలు.
2020-03-25‘కరోనా వైరస్’ హఠాత్తుగా ప్రపంచం మీద విరుచుకుపడితే.. దాని వెన్నంటి ఇతర వ్యాధులూ వస్తున్నాయి. ఇండియాలో స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండగా చైనాలో ప్రమాదకర హంటా వైరస్ సోకి ఓ వ్యక్తి మంగళవారం మరణించాడు. యున్నాన్ ప్రావిన్సుకు చెందిన ఆ వ్యక్తి షాండాంగ్ ప్రావిన్సులో పని ప్రదేశానికి తిరిగి వెళ్తుండగా బస్సులోనే మరణించాడు. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 32 మందికీ పరీక్షలు నిర్వహించారు. హంటా వైరస్ లు ప్రధానంగా ఎలుకల నుంచి సంక్రమించి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. ఎలుకల మలమూత్రాలు, లాలాజలం తాకినప్పుడు వైరస్ సంక్రమించే అవకాశం ఉంది.
2020-03-24‘కరోనా’ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించడానికి దేశమంతా ‘లాక్ డౌన్’ విధిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ఎవరూ ఇల్లు వదలి బయటకు రావద్దని హుకుం జారీ చేశారు. 21 రోజుల పాటు (ఏప్రిల్ 14వరకు) ఈ నిషేధం కొనసాగుతుందని, ఇది నిర్బంధ కర్ఫ్యూ వంటిందని, జనతా కర్ఫ్యూ కాదని మోడీ చెప్పారు. మంగళవారం రాత్రి 8.00 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా చాలా భయంకరమైన మహమ్మారి అని, ఒక్కరి నుంచి మొదలై లక్షల మందికి వ్యాపించిందని చెప్పారు. ఇంటినుంచి బయటకు అడుగుపెట్టడం అంటే.. కరోనాను ఇంటికి తెచ్చుకోవడమేనని మోడీ వ్యాఖ్యానించారు.
2020-03-24విదేశాలనుంచి వచ్చినవారు ‘క్వారంటైన్’లో ఉండకపోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారంటైన్ల నుంచి తప్పించుకుంటున్నవారిని సమాజానికి శత్రువులుగా అభివర్ణించారు. విదేశాల నుంచి వచ్చిన అందరి పాస్ పోర్టులూ సీజ్ చేయాలని ఆదేశించానని, ఎక్కువ చేస్తే పాస్ పోర్టులను సస్పెండ్ చేయిస్తామని హెచ్చరించారు. సమాజానికి శత్రువులుగా పరిణమించినవారు సమాజం కల్పించిన సదుపాయాలను పొందడానికి అనర్హులని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిర్మల్ లో క్వారంటైన్ నుంచి ఒకే వ్యక్తి మూడుసార్లు తప్పించుకున్నాడని చెప్పారు.
2020-03-24జనతా కర్ఫ్యూ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కర్ఫ్యూ విధించింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయట కనిపించడానికి వీల్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి 7.40 గంటలకు మీడియాతో మాట్లాడిన కేసీఆర్, ఇప్పటికే కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. నిత్యావసరాల దుకాణాలన్నీ సాయంత్రం 6 గంటలకే మూసేయాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లైసెన్సులు రద్దవుతాయని హెచ్చరించారు. ఇక బ్రతిమాలే పరిస్థితి లేదని, ‘కనిపిస్తే కాల్చివేత’ వరకు తెచ్చుకోవద్దని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
2020-03-24జూలై 24 నుంచి జరగాల్సిన 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలను వాయిదా వేయడానికి ఐఒసి చీఫ్, జపాన్ ప్రధాని అంగీకారానికి వచ్చారు. ‘కరోనా వైరస్’ అసాధారణంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాయిదాకోసం ఒత్తిళ్ళు పెరిగాయి. మంగళవారం జపాన్ ప్రధాని షింజో అబె, ఐఒసి అధ్యక్షుడు థామస్ బాచ్ ఫోన్లో ఈ విషయమై చర్చించుకొని.. వచ్చే ఏడాదికి వాయిదా వేసేందుకు నిర్ణయించారు. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడలు చరిత్రలో తొలిసారి వాయిదా పడుతున్నాయి. 1916లో తొలి ప్రపంచ యుద్ధం, 1940, 1944లలో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్ క్రీడలు రద్దయ్యాయి. వాయిదా వేయడం ఇదే తొలిసారి.
2020-03-24‘కరోనా’ వ్యాప్తితో టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా అనివార్యంగా కనిపిస్తోంది. జపాన్ ప్రధాని షింజో అబె మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ తో ఫోన్లో మాట్లాడారు. వాయిదా వేసేట్లయితే 12 నెలల్లోపలే తిరిగి నిర్వహించేలా షెడ్యూలు రూపొందించాలని షింజో అబె ఒలింపిక్ కమిటీకి సూచించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించలేమని నిన్న (మార్చి 23న) ఓ పార్లమెంటరీ సమావేశంలో జపాన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. మొన్నటిదాకా నిర్వహించి తీరతామన్న జపాన్ ప్రభుత్వం, తొలిసారిగా నిన్ననే వాయిదా సంకేతాలను ఇచ్చింది.
2020-03-24‘కరోనా వైరస్’ వ్యాప్తి నిరోధ ప్రయత్నాలకు, అవసరమైన ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుపమ నాదెళ్ళ రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. అనుపమ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ భార్య. మాజీ ఐఎఎస్ కె.ఆర్. వేణుగోపాల్ కుమార్తె. అనుపమ తరపున ఆమె తండ్రి వేణుగోపాల్ మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలసి రూ. 2 కోట్లకు చెక్కును అందజేశారు.
2020-03-24