జమ్మూ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లు, సాయుధ బలగాలకు అధునాతన సామాగ్రి అందించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు వార్తా సంస్థలు తెలిపాయి. రేపు మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించనున్నారు.
2021-06-29మోడెర్నా కంపెనీ ఉత్పత్తి చేసిన కరోనా టీకాను దిగుమతి చేసుకునేందుకు సిప్లా కంపెనీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి లభించింది. ఈ టీకాను అత్యవసర ప్రాతిపదికన వినియోగించడానికి అనుమతించారు. అమెరికా దిగ్గజ సంస్థ మోడెర్నా తరపున ‘సిప్లా’ అనుమతి కోరిన వెంటనే లభించడం గమనార్హం. దేశంలో ఇప్పటికే ఆక్స్ఫర్డ్ రూపొందించి సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి కోవాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ టీకాలు వినియోగమవుతున్నాయి.
2021-06-29ఫోనులో దిశ యాప్ ఉంటే ఓ అన్న తోడుగా ఉన్నట్టేనని ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దిశ యాప్ డౌన్ లోడ్స్ పెంచడానికి మంగళవారం విజయవాడ సమీపంలోని గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఇప్పటికి 17 లక్షల మంది యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని, ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఉండాలని పేర్కొన్నారు. మహిళల భద్రతపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్న జగన్, దిశ చట్టం తీసుకొచ్చి రాష్ట్రంలో 18 ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామని, త్వరలో ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
2021-06-29 Read Moreమంచి పొరుగుతనపు స్నేహపూర్వక సహకార ఒప్పందాన్ని కొనసాగించాలని చైనా, రష్యా నిర్ణయించాయి. సోమవారం ఇరు దేశాల అధ్యక్షులు జి జిన్ పింగ్, వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ అంశంపై చర్చించుకుని ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఒప్పందానికి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడుతూ, శాశ్వత మిత్రత్వం అనే ఆలోచనను ఈ ఒప్పందం పాదుకొల్పిందని, రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు, శాంతి-అభివృద్ధిలకు అనుగుణంగా ఉందని కొనియాడారు.
2021-06-28 Read Moreవ్యాక్సినేషన్లో చైనా దూసుకుపోతోంది. ఇప్పటివరకు చైనా ప్రజానీకానికి 118 కోట్ల డోసులు అందాయి. ఇండియాలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యకు ఇది 361 శాతం. ఇక్కడ రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, చైనాను మినహాయించి డేటా విడుదల చేస్తోంది. సోమవారం ప్రధాని మోదీ ట్విట్టర్లో పెట్టిన గ్రాఫ్ ప్రకారం అమెరికాలో 32.33 కోట్ల వ్యాక్సిన్లు వేయగా, ఇండియా 32.36 కోట్ల డోసులతో ఆ దేశాన్ని అధిగమించింది. రోజుకు 2 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేస్తున్న చైనాతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది.
2021-06-28కరోనా సెకండ్ వేవ్ వల్ల కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ. ‘‘6,28,993 కోట్ల ప్యాకేజీ’’ని ప్రకటించింది. అందులో రుణ గ్యారెంటీ పథకాలే ప్రధానంగా ఉన్నాయి. ఇంతకు ముందే ప్రకటించిన బియ్యం పంపిణీ కొనసాగింపు, ఎరువుల సబ్సిడీ పెంపు వ్యయాలను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా చూపించారు. అయితే, ఈ ప్యాకేజీతో ప్రత్యక్షంగా ఒనగూరే ప్రయోజనాలు, ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు పరిమితమని ఆర్థికవేత్తలు అంటున్నారు. మరిన్ని ఉద్దీపన చర్యలు అవసరమని గట్టిగా చెబుతున్నారు.
2021-06-28‘కరోనా’ సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో ఇప్పటికీ పాజిటివిటీ రేటు అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి (ఆరోగ్య పరిశోధన) డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పటిదాకా 40,845 నమోదు కాగా, ఆ మహమ్మారితో 3,129 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. డెల్టా ప్లస్ రకం వైరస్ తో వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుందనడానికి ఇంతవరకు శాస్త్రీయ సమాచారం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ పేర్కొన్నారు.
2021-06-28 Read Moreపశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ థంకర్ పైన ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. థంకర్ ఓ అవినీతిపరుడని, 1996 హవాలా జైన్ కేసులో నమోదైన చార్జి షీటులో అతని పేరు ఉందని ఆరోపించారు. అప్పట్లో జర్నలిస్టుగా ఉన్న ఓ వ్యక్తి తనకు ఈ సమాచారం పంపారని మమత చెప్పారు. ఇలాంటి వ్యక్తిని గవర్నరుగా ఎలా కొనసాగిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మమత, వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. థంకర్ ఇటీవల ఉత్తర బెంగాల్ లో జరిపిన పర్యటన వెనుక బెంగాల్ విభజన కుట్ర ఉందన్నారు.
2021-06-28 Read Moreవ్యవస్థీకృత జాతి వివక్షను ధ్వంసం చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ మెచెలి బాచెలెట్ పిలుపునిచ్చారు. వ్యవస్థీకృతమైన వివక్షకు సంస్థాగతమైన స్పందన తప్పదని స్పష్టం చేశారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ను శ్వేతజాతి పోలీసు అధికారి క్రూరంగా గొంతుపై తొక్కి చంపిన ఉదంతం నేపథ్యంలో జరిగిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఆమె సోమవారం విడుదల చేశారు. అమెరికా, యూరప్ ఖండాల్లో 250 మంది ఆఫ్రికన్లు మరణించగా, అందులో కనీసం 190 మంది పోలీసు వ్యవస్థల చేతుల్లోనే బలయ్యారని చెప్పారు.
2021-06-28 Read Moreప్రజలకు వ్యాక్సిన్లు వేయడంలో ఇండియా తాజాగా అమెరికాను మించిపోయినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత వ్యాక్సిన్ కార్యక్రమం ఊపందుకున్నదంటూ మోదీ ఒక చార్టును ట్విట్టర్లో పంచుకున్నారు. దాని ప్రకారం ఇప్పటిదాకా అమెరికాలో 32.53 కోట్ల వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వగా, ఇండియాలో ఆ సంఖ్య 32.36 కోట్లు దాటింది. మోదీ ఇంకా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యుకె వంటి తక్కువ జనాభా ఉన్న ధనిక దేశాలను కూడా పోల్చారు. అందరికీ, ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు.
2021-06-28