లాటిన్ అమెరికా గర్వించదగ్గ మహా క్రీడాకారుడు డిగో మారడోనా మరణించారు. 60 ఏళ్ల మారడోనాకు మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు ఈ నెల మొదట్లో సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతంగా ముగిసినా.. కొద్ది వారాల్లోనే మారడోనా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చివరికి గుండె-శ్వాస సంబంధ సమస్యతో బుధవారం మరణించారు. అర్జెంటీనాకు చెందిన మారడోనా ఫుట్ బాల్ చరిత్రలోనే మేటి క్రీడాకారుడిగా ఖ్యాతి గడించారు. 1960లో జన్మించిన మారడోనా 1986లో అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలిపి చరిత్ర సృష్టించారు.
2020-11-25కోవిడ్ వ్యాక్సిన్ ఏదైనా.. ఇతర మందుల తరహాలోనే కొంతమందిలో దుష్ప్రభావాలకు దారి తీయవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందస్తు హెచ్చరిక చేశారు. దేశానికి కావలసిన వ్యాక్సిన్ ఎంపిక విషయంలో ప్రభుత్వం సైన్స్ ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆక్ఫ్సర్డ్ - అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన దుష్ఫరిణామాలు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారన్న విషయంలో స్పష్టత లేదు.
2020-11-24తమ సబ్సిడరీ కంపెనీ ‘జియో ప్లాట్ ఫామ్స్’కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ నుంచి రూ. 33,737 కోట్లు వచ్చినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. ‘జియో ప్లాట్ ఫామ్స్’లో 7.73 శాతం వాటా కింద వచ్చిన ఈ మొత్తమే ఇండియాలో గూగుల్ పెట్టిన అతిపెద్ద పెట్టుబడి. కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తర్వాత లావాదేవీలు జరిగాయి. అందుబాటు ధరల్లో 4జి, 5జి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను అభివృద్ధి చేయడం ఈ సంస్థల ఉమ్మడి ప్రణాళికగా ఉంది. ఈ పెట్టుబడి కారణంగా మంగళవారం ఆర్ఐఎల్ షేరు ధర 0.7 శాతం పెరిగి రూ. 1,965.10 వద్ద ముగిసింది.
2020-11-24‘లవ్ జిహాద్’ను నిరోధించడానికంటూ రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్సుకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని నేరంగా పరిగణిస్తూ అందుకు 10 సంవత్సరాల జైలు శిక్షను ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. మోసం, బలవంతం, అబద్ధాలతో జరుగుతున్న మత మార్పిడులు గుండెల్ని పిండేస్తున్నాయని యూపీ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
2020-11-24దేశవ్యాప్తంగా ముస్లిం ఓటు బ్యాంకును చీలుస్తూ బిజెపికి సహాయపడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీకి బెంగాల్ సిఎం మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా 17 మంది ముఖ్య నాయకులను తృణమూల్ కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. బీహార్ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచి మిగిలిన చోట్ల కూడా ఓట్లు చీల్చి ఎన్డీయే ప్రభుత్వ పునరుద్ధరణకు పరోక్షంగా దోహదపడింది ఎంఐఎం. ఇప్పుడు 27 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్ పైన దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నేతల గోడదూకుడు గట్టి దెబ్బే.
2020-11-24చైనా వ్యతిరేక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం మరో 43 మొబైల్ అప్లికేషన్లను నిలిపివేసింది. అందులో చైనా వ్యాపార దిగ్గజం అలీబాబాకు చెందిన అలి ఎక్స్ ప్రెస్, అలీబాబా వర్క్ బెంచ్, అలీ క్యాషియర్ వంటి అప్లికేషన్లు ఉన్నాయి. కేంద్ర హోం శాఖకు అనుబంధమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసిసిసిసి) అందించిన సమాచారం ఆధారంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులిచ్చింది. గతంలో జూన్ 29న 59 అప్లికేషన్లను, సెప్టెంబర్ 2న మరో 118 అప్లికేషన్లను నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చారు.
2020-11-24బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాల పరంపరను ఇండియా మంగళవారం ప్రారంభించింది. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్. శబ్ద వేగానికి 2.8 రెట్లు వేగంగా ప్రయాణించగలదు. 290 కిలోమీటర్ల పరిధితో రూపొందిన క్షిపణిని ప్రస్తుతం ఇండియా పరీక్షించింది. సమీప భవిష్యత్తులో 400 కి.మీ. పరిధికి విస్తరించే ప్రయత్నంలో ఉంది. తర్వాత 1,500 కి.మీ. పరిధితో భూమి, నీరు, ఆకాశం నుంచి ప్రయోగించేలా ఈ క్షిపణి సామర్ధ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2020-11-24ఆసియా దిగ్గజాలతో కూడిన అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆర్.సి.ఇ.పి.లో చేరడానికి నిరాకరించిన ఇండియా.. ఇప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్లతో ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. ఆయా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టి.ఎ)పై మరుగునపడిన సంప్రదింపుల ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టబోతున్నట్టు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. 10 ‘ఆసియాన్’ దేశాలతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సభ్యులుగా ఏర్పాటైన ఆర్.సి.ఇ.పి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్.టి.ఎ.గా గణతికెక్కింది.
2020-11-21ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్ ప్రభావం నేపథ్యంలో.. భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గణనీయంగా తగ్గించింది. 2020-25 మధ్య ఇండియా సగటున 6.5 శాతం వృద్ధి చెందుతుందని ఇంతకు ముందు అంచనా వేసిన ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ బృందం, ఇప్పుడా అంచనాను 4.5 శాతానికి కుదించింది. కోవిడ్ అనంతర ప్రభావాలు అత్యంత అధ్వానంగా ఉండే దేశాల్లో భారతదేశం ఒకటని, కరోనాకు ముందు వేసిన అంచనా కంటే తలసరి జీడీపీ 12 శాతం తగ్గుతుందని ఈ సంస్థ పేర్కొంది.
2020-11-19అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్ ప్రముఖులకు చోటు లభించనున్నట్టు సమాచారం. అమెరికా మాజీ సర్జెన్ జనరల్, ప్రస్తుతం బైడెన్ బృందంలో కోవిడ్19 సలహాదారుగా వ్యవహరిస్తున్న వివేక్ మూర్తిని ఆరోగ్య మంత్రిగా, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అరుణ్ మజుందార్ ను ఇంధన శాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ రాసింది. మెకానికల్ ఇంజనీర్ అయిన మంజుందార్ ఇంధన వ్యవహారాలలో బైడెన్ కు సలహాదారుగా ఉన్నారు.
2020-11-18