వాయు కాలుష్యంలోని ధూళి కణాలపైన ‘కరోనా’ వైరస్ ఉంటుందని తాజాగా ఇటలీ పరిశోధకులు గుర్తించారు. తద్వారా వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించి.. ఎక్కువమందికి సోకుతుందా? అన్న అంశంపై పరిశోధన జరుగుతోంది. బెర్గామో ప్రావిన్సులోని పారిశ్రామిక వాడలో వాయు కాలుష్యం నుంచి నమూనాలను సేకరించారు. అనేక నమూనాల్లో కోవిడ్19కు ప్రత్యేకమైన జన్యువులను కనుగొన్నారు. ఈ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలో ఉంది. వైరస్ ధూళి కణాలపై మనగలుగుతుందా.. వ్యాధిని కలిగించేంత పరిమాణంలో ఉంటుందా? అన్నది తేలాలి. సో.. గాలి ద్వారా వైరస్ వ్యాపించదన్న ధీమా మంచిది కాదు.
2020-04-25‘కరోనా’ వైరస్ న్యూయార్క్ రాష్ట్రానికి వ్యాపించింది చైనా నుంచి కాదని, యూరప్ నుంచి అని గవర్నర్ ఆండ్రూ క్యూమో చెప్పారు. న్యూయార్క్ లోకి ప్రవేశించిన వైరస్ రకాలపై జరిగిన పరిశోధనను క్యూమో ఉటంకించారు. న్యూయార్క్ కేసులకు ఇటలీ మూల స్థానంగా ఆయన పేర్కొన్నారు. మార్చి 1న మొదటి కేసు నిర్ధారణ అయ్యేనాటికే 10 వేల మందికి వైరస్ సోకి ఉంటుందని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ అంచనాను క్యూమో ప్రస్తావించారు. ప్రయాణాలపై నిషేధాన్ని డొనాల్డ్ ట్రంప్ చాలా ఆలస్యంగా విధించారన్న క్యూమో, ‘‘చైనా నుంచి ప్రయాణాలను నిషేధించడం ద్వారా మేము ముందు తలుపును మూసేసాం. కానీ, వెనుక తలుపును తెరిచే ఉంచాం. అప్పటికే వైరస్ చైనాను దాటింది’
2020-04-25అగ్రరాజ్యం అమెరికాను ‘కరోనా’ వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారికి ఆ దేశంలో 49,963 మంది మరణించారు. మొత్తం 8,69,172 మందికి వైరస్ సోకింది. మరణాల రేటు రోజురోజుకూ పెరిగి తాజాగా 5.75 శాతానికి చేరింది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 16,388 మంది వైరస్ ధాటికి కన్ను మూశారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. న్యూయార్క్ లోని బ్రాంగ్జ్ జూలో మనుషుల నుంచి క్రూర మృగాలకూ వైరస్ సోకిన ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో మరణాల సంఖ్య.. రెండో స్థానంలో ఉన్న ఇటలీ (25,549) కంటే దాదాపు రెట్టింపు ఉండటం గమనార్హం.
2020-04-24‘కరోనా’ బారిన పడి దేశవ్యాప్తంగా 718 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. అందులో 55% (395) మరణాలు కేవలం రెండు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. అవే పశ్చిమ భారతంలోని మహారాష్ట్ర (283), గుజరాత్ (112). దేశవ్యాప్తంగా నమోదైన ‘కరోనా’ కేసుల(23,077)లో మహారాష్ట్ర వాటా 27.86%, గుజరాత్ వాటా 11.37% కాగా.. మరణాల్లో మహారాష్ట్ర వాటా 39.41%, గుజరాత్ వాటా 15.6%. వైరస్ సోకినవారిలో మరణిస్తున్నవారు మహారాష్ట్రలో 4.4% కాగా గుజరాత్ లో 4.27%. జాతీయ సగటు కంటే ఎక్కువ. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 778 కొత్త కేసులు నమోదయ్యాయి. ఓ మంత్రికి కూడా వైరస్ సోకడం అక్కడి తీవ్రతకు నిదర్శనం.
2020-04-24గత నెలలో పెంచిన కరువు భత్యం (డిఎ) చెల్లింపులను వాయిదా వేయడం కాదు.. ఏకంగా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం!. ప్రస్తుతం ఉన్న 17 శాతం రేటునే 2021 జూలై1 వరకు అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. 2020 జనవరి నుంచి బకాయి ఉన్న మొత్తాన్ని కూడా రద్దు చేసింది. కేంద్ర ఉద్యోగులకు డి.ఎ.ను 21 శాతానికి పెంచుతూ గత నెలలో మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘కరోనా’ ప్రభావంతో ఆదాయం తగ్గడంతో.. డిఎ పెంపుదలను 2021 జూలై తర్వాతే అమలు చేయాలని తాజాగా నిర్ణయించారు. 49 లక్షల ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లపై ఈ ప్రభావం పడుతోంది.
2020-04-23ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ)కు నిధులను నిలిపివేస్తున్నట్టు అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన నేపథ్యంలో.. చైనా అదనపు గ్రాంటును మంజూరు చేసింది. ఇంతకు ముందు కేటాయించిన గ్రాంటుకు అదనంగా 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 230 కోట్లు) తాజాగా ప్రకటించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ గురువారం విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఇంతకు ముందు చైనా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 154 కోట్లు) సమకూర్చింది.
2020-04-23ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ‘కరోనా’ కేసులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. గురువారం కొత్తగా 80 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 893కి పెరిగింది. ముగ్గురి మృతితో ఆ సంఖ్య 27కి పెరిగింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 24 గంటల్లో 31 కేసులు అదనంగా నమోదయ్యాయి. గుంటూరులో 18, చిత్తూరులో 14, అనంతపురంలో 6, తూర్పుగోదావరిలో 6 చొప్పున కేసులు పెరిగాయి. కర్నూలులో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. గుంటూరులో కోలుకున్న ఇద్దరికి మళ్ళీ పాజిటివ్ నమోదు కావడం ఆందోళనకరం.
2020-04-23గుజరాత్ వద్ద చిక్కుకుపోయిన 5000 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులను సముద్రమార్గం ద్వారా పంపడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుజరాత్ సిఎం విజయ్ రూపానీతో ఫోన్లో ఈ విషయం మాట్లాడారు. ఈ సంభాషణ అనంతరం.. సముద్రమార్గం ద్వారా మత్స్యకారులను రప్పించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎం జగన్ ఆదేశించారు.
2020-04-23‘ఆసియా అతిపెద్ద సంపన్నుడు’ టైటిల్ మరోసారి ముఖేష్ అంబానీ సొంతమైంది. ‘ఫేస్ బుక్’ కంపెనీ రిలయన్స్ జియో వేదికల్లో 9.99 శాతం వాటా కొనుగోలు చేశాక.. ‘బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్’లో అంబానీ సంపద అకస్మాత్తుగా $4.7 బిలియన్లు పెరిగింది. మొత్తం $49.2 బిలియన్ల సంపదతో అంబానీ చైనా సంపన్నుడు జాక్ మా ($46 బిలియన్లు)ను మించిపోయారు. అంతకు ముందు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అంబానీ సంపద 28 శాతం తగ్గింది. ఫేస్ బుక్ ఒప్పందంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 90 వేల కోట్లు పెరిగింది.
2020-04-23న్యూయార్క్ రాష్ట్రంలోని బ్రాంగ్జ్ జూ లో ‘నాడియా’ అనే పులికి కొద్ది కాలం క్రితం ‘కరోనా’ వైరస్ సోకింది. అదే జూలో ఇప్పుడు మరో నాలుగు పులులు, మూడు సింహాలకు వైరస్ నిర్ధారణ అయినట్టు ‘నేషనల్ జియోగ్రాఫిక్’ రిపోర్టు చేసింది. ‘నాడియా’ జబ్బు పడినప్పుడే మిగిలిన మృగాల్లోనూ కొన్ని లక్షణాలు కనిపించాయి. దాదాపు మూడు వారాల తర్వాత వాటికీ ‘కరోనా’ నిర్ధారణ అయింది. ‘నాడియా’లో ‘కరోనా’ లక్షణాలు కనిపించేనాటికే ‘జూ’ను మూసేసి 11 రోజులైంది. అయితే, జంతువులకు జూ కీపర్ ద్వారా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. వైరస్ సోకిన జంతువులన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయని సమాచారం.
2020-04-23