‘కరోనా’ వ్యాప్తికి, పలువురి మరణానికి కారకులయ్యారంటూ తబ్లిఘి జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధాల్వి, మరో ఆరుగురిపై ‘కల్పబుల్ హోమిసైడ్’ కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం వారిపై నమోదైన ‘ఎఫ్ఐఆర్’లో.. ఐపిసి సెక్షన్ 304 కింద తాజా అభియోగాన్ని చేర్చారు. ప్రత్యక్షంగా హత్య చేయకపోయినా నేరపూరిత నిర్లక్ష్యం, దుస్సాహసంతో మనుషుల మరణానికి కారణమైతే ‘కల్పబుల్ హోమిసైడ్’ పేరిట హత్యానేరం మోపుతారు. ఈ కేసులోనూ జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. తబ్లిఘి జమాత్ గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాలతో కొన్ని వందల మందికి ‘కరోనా’ వ్యాపించింది. అనేక మంది చనిపోయారు.
2020-04-16‘కరోనా’ పరీక్షలకోసం చైనా నుంచి తొలి దశలో 3 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు గురువారం ఇండియాకు రాబోతున్నాయి. బుధవారమే వాటి రవాణాకు గ్వాంగ్జులోని కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 7 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కోసం చైనా కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చింది. అవి ఈ నెల 8వ తేదీనే రావలసింది. అయితే, కార్గో విమానాల కొరత వల్ల ఆలస్యమవుతున్నట్టు ఇంతకు ముందు చెన్నైలోని దిగుమతిదారు చెప్పారు. ‘కరోనా’ పరీక్షలను గణనీయంగా పెంచాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మొత్తంగా 45 లక్షల టెస్టు కిట్లకోసం బిడ్లను ఆహ్వానించింది.
2020-04-16అగ్రరాజ్యం అమెరికా ‘కరోనా’ ధాటికి కకావికలమవుతోంది. తాజా సమాచారం ప్రకారం గడచిన 24 గంటల్లో ఏకంగా 2,600 మంది అమెరికన్లు వైరస్ ధాటికి మరణించారు. దీంతో అగ్రరాజ్యంలో ‘కరోనా’ మహమ్మారికి బలైన వారి సంఖ్య 28,430కి పెరిగింది. న్యూయార్క్ నగరంలో శవాల కుప్పలు పెరిగిపోతున్నాయి. ఒక్క న్యూయార్క్ కౌంటీలోనే 8,455 మందిని ‘కరోనా’ కబళించింది. ఇప్పటిదాకా అమెరికాలో 6,39,894 మందికి వైరస్ సోకింది. అందులో బుధవారమే 32 వేలకు పైగా నమోదయ్యాయి. మరణాల రేటు 4.44 శాతానికి పెరగడం, ఇంకా గ్రాఫ్ పైపైకి చూడటం అమెరికాను వణికిస్తోంది.
2020-04-16ఇండియాలో ‘కరోనా’ కేసులు 12,300 దాటాయి. 425 మంది మరణించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో కేసులు బాగా పెరిగాయి. అయితే, దేశంలోనే తొలి కేసును చూసిన కేరళ మాత్రం ‘కరోనా’ను కట్టడి చేసింది. బుధవారం ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క కొత్త కేసు నమోదైంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో 387 మందికి కరోనా సోకగా.. 218 మంది (56.33 శాతం) కోలుకున్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే దాదాపు నెల రోజులు ముందే ‘కరోనా’ కేసులు నమోదైనా ఇంతవరకు ఇద్దరే (0.51 శాతం) మరణించారు. ఈ గణాంకాలు ‘కరోనా’పై పోరాటంలో కేరళ ప్రత్యేకతను చాటి చెబుతున్నాయి.
2020-04-16‘కరోనా’ మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా గ్రూపులను ఏర్పాటు చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ సహా ఆరుగురు ఇండియన్ అమెరికన్ కార్పొరేట్ లీడర్లకు వాటిలో చోటిచ్చారు. 18 గ్రూపుల ఏర్పాటుకోసం వివిధ పరిశ్రమలు, వర్గాలనుంచి 200కు పైగా ప్రముఖులను ఎంపిక చేశారు. వారి నుంచి ఉజ్వలమైన సలహాలను ట్రంప్ ఆశిస్తున్నారు. టెక్ గ్రూపులో పిచాయ్, నాదెళ్ళలతో పాటు అరవింద్ క్రిష్ణ (ఐబిఎం), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్), తయారీ రంగం గ్రూపులో ఆన్ ముఖర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూపులో అజయ్ బంగా పేర్లున్నాయి.
2020-04-16ఈ నెల 1న గాంధీ ఆసుపత్రి డాక్టరుపై దాడి చేసిన 23 సంవత్సరాల కరోనా పేషెంట్ ను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. నిందితుడు ఇంకా చికిత్స తీసుకుంటున్నందున బుధవారం అరెస్టు చేసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టు ఎదుట నిలబెట్టినట్టు ఆయన వెల్లడించారు. నిందితుడికి రిమాండు విధించిన కోర్టు, ఆసుపత్రిలోనే కొత్తగా ఏర్పాటు చేసిన జైలు వార్డులో ఉంచాలని ఆదేశించింది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత అతన్ని జైలుకు తరలిస్తారు. వైరస్ సోకిన వ్యక్తులు లేదా అనుమానితులు నేరపూరితంగా వ్యవహరిస్తే.. వారిని ఉంచడానికే ఈ జైలు వార్డును ఏర్పాటు చేశారు.
2020-04-16బుధవారం తెలంగాణలో 6 ‘కరోనా’ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మంగళవారం నమోదైన 50 కేసులతో పోలిస్తే బాగా తగ్గడం గమనార్హం. బుధవారం 8 మంది ఆసుపత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 650కి పెరిగినా.. అందులో 118 మంది ఇప్పటివరకు కోలుకున్నారు. 18 మంది మరణించగా 514 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో సగానికి పైగా (267 మంది) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నారు. డిశ్చార్జి అయినవారిలోనూ సగానికి పైగా (70 మంది) జి.హెచ్.ఎం.సి. వాసులే. మరణించినవారిలో మూడింట రెండొంతులు (12 మంది) హైదరాబాద్ వాసులే.
2020-04-16దేశవ్యాప్తంగా 170 జిల్లాలను ‘కరోనా’ హాట్ స్పాట్ ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ‘కరోనా’ కేసులు నమోదైన 11 జిల్లాలూ ఆ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలోని 33 జిల్లాల్లో కేవలం 8 హాట్ స్పాట్ జాబితాలో చేరాయి. ఏపీ కంటే తెలంగాణలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, సుమారు సగం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. 20కి పైగా కేసులు నమోదైన జిల్లాలు మరో 5 మాత్రమే ఉన్నాయి. ఏపీలో అలా కాదు. 13 జిల్లాల్లో 11 చోట్ల ‘కరోనా’ కేసులు నమోదు కాగా.. తూర్పుగోదావరి మినహా మిగిలిన 10 జిల్లాల్లో 20 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.
2020-04-15‘కరోనా’తో ఏపీలో 9 మంది చనిపోయినట్టు మంగళవారం సాయంత్రం 5 గంటల బులెటిన్ లో ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం రాత్రి 8.00 గంటల బులెటిన్ సమయానికి ఆ సంఖ్య 14కు చేరింది. 27 గంటల్లో 5 మరణాలను, 42 కొత్త కేసులను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 525కు పెరిగింది. అందులో 20 మంది మాత్రమే ఇప్పటి వరకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ‘కరోనా’ దాడికి ఎక్కువగా గురైన జిల్లాలు గుంటూరు (122 కేసులు- 23.24 శాతం), కర్నూలు (110 కేసులు- 20.95 శాతం). మరణాలు గుంటూరు (4), కృష్ణా (4) జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 2 చొప్పున నమోదయ్యాయి.
2020-04-15కేంద్ర హోం శాఖ ‘లాక్ డౌన్ 2.0’ మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. వాటి ప్రకారం.. ఈ నెల 20 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల పున:ప్రారంభానికి, రోడ్లు- భవనాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతిస్తారు. నగరాల్లో ఐటి, ఇ కామర్స్, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన కాల్ సెంటర్లు, అంతర్రాష్ట్ర సరుకుల రవాణా కూడా 20 నుంచి నడుస్తాయి. అయితే, మనుషుల మధ్య దూరాన్ని కచ్చితంగా పాటించాలి. విమాన, రైలు, రోడ్డు ప్రయాణాలపై నిషేధం, విద్యా సంస్థలు, హోటళ్ళు, సినిమాహాళ్ళు, షాపింగ్ కాంప్లెక్సుల మూసివేత కొనసాగుతాయి.
2020-04-15