ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెళ్ళికోసం మతం మారడాన్ని నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ జారీ అయిన గంటల్లోనే తొలి కేసు నమోదైంది. షరీఫ్ నగర్ గ్రామానికి చెందిన తికారామ్ ఫిర్యాదు మేరకు బరేలీ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన కుమార్తెతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి మతం మారాలని ఒత్తిడి చేస్తున్నట్టు తికారామ్ ఫిర్యాదు చేశారు. ‘ఉత్తర్ ప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రెలిజియన్ ఆర్డినెన్స్ 2020’ని ఈ నెల 27న గవర్నర్ ఆనందీబెన్ పాటిల్ ఆమోదించారు. అదే రోజు తికారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2020-11-29ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై ఆదివారం ఆయన నివాసం వద్దనే దాడి జరిగింది. మంత్రి సొంత పట్టణం మచిలీపట్నానికే చెందిన తాపీ మేస్త్రీ బడుగు నాగేశ్వరరావు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. భవన నిర్మాణాలకు ఉపయోగించే తాపీతో మంత్రిని పొడవడానికి ప్రయత్నించగా బెల్టు బకిల్ కు తగిలింది. రెండోసారి పొడవడానికి ప్రయత్నించినప్పుడు మంత్రి గన్ మెన్, ఇతరులు అడ్డుకున్నారు. మంత్రి గాయపడలేదు. దాడి సమయంలో నాగేశ్వరరావు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
2020-11-29పోలవరం విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగడం లేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అన్యాయం జరుగుతుంటే అడగకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? అని ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. ‘‘టీడీపీ చెబుతున్నట్టుగా సీబీఐ కేసులకు దీనికీ ఏమైనా లింకు ఉందా? ఆ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు. పోలవరానికి ఇకపై ఇచ్చేది ఏడు వేల కోట్లేనని రాష్ట్రానికి అవమానకరమైన రీతిలో కేంద్రం లేఖ రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
2020-11-28మునిసిపల్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘యూపీకి తికాణా లేదు.. ఇక్కడికొచ్చి నీతులు చెబుతాడట. ఆయనొచ్చి హైదరాబాద్ లో ఊరేగుతున్నాడు.’’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడేనాటికి తలసరి ఆదాయంలో దేశంలో 13వ స్థానంలో ఉన్నామని, ఇప్పుడు 5వ స్థానానికి పెరిగామని, అలాంటి తమకు 28వ స్థానంలో ఉన్న యూపీ ముఖ్యమంత్రి వచ్చి చెప్పడమేమిటని కేసీఆర్ ప్రశ్నించారు.
2020-11-28వరద సాయం కోసం నిధులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. కర్నాటకకు, ఇతర రాష్ట్రాలకు అడిగిన వెంటనే నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘‘ప్రధానమంత్రిని 1300 కోట్లు ఇవ్వమని అడిగాను. 13 పైసలు కూడా ఇవ్వలేదు.. ఏం మేము భారతీయులం కామా? భారత దేశంలో లేమా’’ అని నిలదీశారు. వరద సాయం చేయలేదు కానీ, బిజెపి నేతలు ఇప్పుడు వరదలా హైదరాబాద్ కు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
2020-11-28ప్రపంచాన్ని మార్చిన మార్క్సిజం, ఫ్రెడెరిక్ ఎంగెల్స్- కారల్ మార్క్స్ స్నేహ ఫలితమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఉద్ఘాటించారు. ప్రజలకోసం కారల్ మార్క్స్ తో ఎంగెల్స్ స్నేహం చేశారని, వారిద్దరిదీ అమర స్నేహమని కొనియాడారు. మార్క్సిస్టు మహోపాధ్యాయుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఫ్రెడెరిక్ ఎంగెల్స్ 200వ జయంతి సందర్భంగా అంతర్జాల సభలో రాఘవులు మాట్లాడారు. కొన్ని విషయాలను మార్క్స్ కంటే ముందే ఎంగెల్స్ ప్రతిపాదిస్తే, మార్క్స్ వాటిని లోతుగా అధ్యయనం చేసి అభివృద్ధి చేశారని రాఘవులు చెప్పారు.
2020-11-28ఏపీలో 30.6 లక్షల మందికి డిసెంబర్ 25న (క్రిస్మస్ రోజు) ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 23 వేల కోట్ల విలువైన 66,518 ఎకరాలను సేకరించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం లబ్దిదారులకు డి-ఫాం పట్టాలు పంపిణీ చేస్తామని, కోర్టులో వివాదం పరిష్కారమయ్యాక కన్వేయన్స్ డీడ్ ఇస్తామని, 28.3 లక్షల మందికి ప్రభుత్వమే మూడేళ్లలోపు ఇళ్లు కట్టిస్తుందని కేబినెట్ అనంతరం మంత్రులు చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది.
2020-11-27సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి హైదరాబాద్ ఏమైనా చైనాలో ఉందా.. పాకిస్తాన్లో ఉందా? అని తెలంగాణ మంత్రి కెటి రామారావు బిజెపి నేతలను ప్రశ్నించారు. ఒక మతాన్ని భూతంలా చూపించి మిగిలినవారిని రెచ్చగొట్టే పని చేస్తున్నారంటూ.. కేవలం నాలుగు ఓట్ల కోసం హైదరాబాద్ ను దెబ్బ తీయవద్దని హితవు పలికారు. మత కలహాలతో కర్ఫ్యూలు విధిస్తే.. హైదరాబాద్ కు గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ వంటి సంస్థలు వస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. డిసైసివ్ నాయకత్వం కావాలా.. డివైసివ్ నాయకత్వమా? తేల్చుకోవాలన్నారు.
2020-11-27భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూలై- సెప్టెంబర్ కాలంలో 7.5 శాతం క్షీణించింది. దీంతో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయింది. ఏప్రిల్- జూన్ కాలంలో ఏకంగా 23.9 శాతం పతనమైన జీడీపీ తర్వాత కొంత కోలుకుంది. జీడీపీ త్రైమాసిక రికార్డులు (1996లో) ప్రారంభమయ్యాక భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండుసార్లు తిరోగమించడం ఇదే తొలిసారి. రెండో త్రైమాసికం వృద్ధి రేటు ఇంతకు ముందు ఊహించిన మొత్తం (-8.8%) కంటే కొద్దిగా మెరుగ్గు నమోదైనా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి 8.7% క్షీణత ఖాయమని అంచనా.
2020-11-27కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన పంజాబ్ రైతులను మధ్యలోనే అడ్డుకునేందుకు హర్యానాలోని బిజెపి కూటమి ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను వినియోగించింది. సరిహద్దులో ఉన్న ఒక ఇరుకు బ్రిడ్జిపైన హర్యానా పోలీసులు రైతులను అడ్డుకున్నారు. వారు ప్రయోగించిన వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ షెల్స్ రైతులను చెదరగొట్టలేకపోయాయి. బలప్రయోగం చేసిన పోలీసులపై మండిపడ్డ రైతులు ఇటుకల్ని విసిరారు. బ్రిడ్జిపైన ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కింద పడేశారు.
2020-11-26