అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని జరుగుతున్న ఉద్యమం... ప్రధానంగా ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న జీవన పోరాటం 300 రోజులు పూర్తి చేసుకుంది. పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అమరావతి భగ్గుమంది. నిర్బంధాన్ని ఎదుర్కొని రైతు కూలీలు, ప్రత్యేకించి మహిళలు నిరంతరాయంగా ఉద్యమాన్ని నడపడం అసాధారణం. ‘కరోనా’ లాక్ డౌన్ కాలంలోనూ ఉద్యమం ఆగలేదు. మార్గదర్శకాలకు అనుగుణంగా శిబిరాలను నిర్వహించారు. రాజధానిని అభివృద్ధి చేసేవరకు తమ ఉద్యమం ఆగదని మహిళలు అంటున్నారు.
2020-10-12ఆహారం కోసం జంతువులను వధించడానికి ‘హలాల్’ పద్ధతిని అనుసరించడంపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘‘జంతువధలో ‘హలాల్’ అన్నది ఓ పద్ధతి మాత్రమే. కొంతమంది ‘ఝత్కా’ పద్ధతిలో చేస్తారు. అది ఎలా సమస్య?’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. కౌల్ ప్రశ్నించారు. ‘‘రేపు మీరు ఎవరూ మాంసం తినకూడదని చెబుతారు. ఎవరు శాఖాహారులుగా ఉండాలో, ఎవరు మాంసాహారులుగా ఉండాలో మేము నిర్ణయించలేము’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
2020-10-12న్యాయమూర్తులపై అధికార వైసీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉదంతంలో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర సిఐడి చేసిన దర్యాప్తుపై ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ... కేసును డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను కోర్టు సీరియస్ గా తీసుకుంది.
2020-10-12సీబీఐ మాజీ డైరెక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వని కుమార్ బుధవారం రాత్రి సిమ్లాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 69 సంవత్సరాల అశ్వని కుమార్ కొంత కాలంగా నిస్పృహతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ జీవితాన్ని చాలించి తర్వాతి ప్రస్థానానికి బయలుదేరినట్టు అశ్వనికుమార్ తన ఆత్మహత్యా పత్రంలో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన అశ్వని కుమార్ 2006, 2008 మధ్య ఆ రాష్ట్ర డీజీపీగా పని చేశారు. తర్వాత సీబీఐ సంచాలకునిగా నియమితులయ్యారు. 2013, 2014 మధ్య నాగాలాండ్ గవర్నరుగా పని చేశారు.
2020-10-07అనుపమ్ హజ్రా. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా! తనకు ‘కరోనా’ వస్తే మమతా బెనర్జీని కౌగిలించుకుంటానని ఆ మధ్య బెదిరించిన బిజెపి నేత ఇతగాడే. ఇప్పుడు నిజంగానే అతనికి వైరస్ సోకింది. ‘కరోనా’ పరీక్ష ఫలితం రాగానే హజ్రా కోల్ కత లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ అభ్యర్ధి, సినీ నటి మిమీ చక్రవర్తిపై పోటీ చేసిన హజ్రా సుమారు మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇటీవలే బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమితుడయ్యారు.
2020-10-02సరిగ్గా నెల రోజుల్లో ఎన్నికలకు వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘కరోనా’ బారిన పడ్డారు. దేశంలో కోరనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రాథమిక దశలో అంతులేని నిర్లక్ష్యాన్ని చూపిన ట్రంప్, ఇప్పటికీ మాస్కు ధరించడానికి ఇష్టపడరు. తన పోటీదారు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ మాస్కు ధరించడాన్ని కూడా ట్రంప్ ఎద్దేవా చేశారు. 74 సంవత్సరాల ట్రంప్ ఇప్పుడు స్వయంగా వైరస్ బారిన పడ్డారు. తన భార్య మెలనియా ట్రంప్ కు కూడా అంటించారు. ‘కరోనా’ను నిర్లక్ష్యం చేసిన మరో దేశాధినేత బోల్సొనారోకు ఇంతకు ముందే వైరస్ సోకింది.
2020-10-02చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి సమస్య కమ్ముకొచ్చింది. పశ్చిమ సరిహద్దులో జమ్మూకాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్టిలరీ గన్స్ ఉపయోగించి కాల్పులు జరుపుతోంది. భారత సైన్యం అందుకు దీటుగా స్పందించింది. ఈ కాల్పులలో ముగ్గురు భారత జవాన్లు మరణించినట్టు గురువారం సైనికాధికారులు తెలిపారు. బుధవారం రాత్రి పాకిస్తాన్ ప్రారంభించిన కాల్పులు కొత్తవేమీ కావు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుండగా గత 8 నెలల్లో పాకిస్తాన్ 3,000 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని సమాచారం. గత 17 సంవత్సరాల్లో ఇదే అత్యధికం.
2020-10-01సామూహిక మానభంగానికి, వర్ణించనలవిగాని చిత్రహింసలకు బలైన ఉత్తరప్రదేశ్ దళిత యువతి కేసులో పోలీసుల నుంచి ఊహించిన ‘కథ’నమే వెలువడింది. ఆమె మర్మాంగాలపై గాయాలున్నాయి గాని, అత్యాచారం జరిగినట్టు వీర్యం నమూనాలు దొరకలేదని ఫోరెన్సిక్ నివేదికను ఉటంకిస్తూ ఓ పోలీసు అధికారి చెప్పారు. బాధితురాలి మృతదేహాన్ని తల్లితండ్రులకు అప్పగించకుండా పోలీసులే స్వయంగా అర్ధరాత్రి దహనం చేసినప్పుడే ఇలాంటి ‘కథ’నాన్ని అంతా ఊహించారు. ఆమె నాలుకను కూడా నేరస్తులు కోయలేదని, గొంతుకు చున్నీ బిగించినప్పుడు ఆమే కొరుక్కున్నదని పోలీసుల వాదన.
2020-10-01అత్యాచార బాధితురాలి ఆనవాళ్లు తెలియకుండా అర్ధరాత్రి కాల్చేసి ఘనత వహించిన యూపీ పోలీసులు తమ ఆటవిక ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు. గురువారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అడ్డుకొని చేయి చేసుకొని కింద పడతోశారు. అత్యాచారం జరిగిన హథ్రాస్ జిల్లాకు వెళ్తుండగా యమునా ఎక్స్ ప్రెస్ వే పైన ఈ వికృతం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు.
2020-10-01భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. అయితే, వెంకయ్యకు ‘కరోనా’ లక్షణాలేమీ బయటపడలేదు. సాధారణంగా నిర్వహించిన పరీక్షలో ఆయనకు ‘కరోనా’ సోకినట్టు తేలింది. వెంకయ్యను ఇంట్లోనే విడిగా ఉండమని వైద్యులు సలహా ఇచ్చారు. వెంకయ్యనాయుడు భార్య ఉషానాయుడుకు మాత్రం ‘కరోనా’ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. కరోనా సోకిన విషయాన్ని వెల్లడించడానికి కొద్ది గంటల ముందే వెంకయ్యనాయుడు ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2020-09-29