నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నేపాల్ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమిస్తూ రెండు రోజుల్లో అమలు కావాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సభ పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ఇది రెండోసారి. కెపి శర్మ ఓలి నేతృత్వంలోని మంత్రివర్గం 2020 డిసెంబర్ 20న తొలిసారి ప్రతినిధుల సభను రద్దు చేసింది. ఆ సభను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు 2021 ఫిబ్రవరి 22న తీర్పు ఇచ్చింది. ఓలి కేబినెట్ మరోసారి మే 22న సభ రద్దు నిర్ణయం తీసుకుంది.
2021-07-12ఆర్థిక కార్పొరేషన్ల ఏర్పాటులో కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడంలోని హేతుబద్ధతను కర్నాటక హైకోర్టు ప్రశ్నించింది. నిర్ధిష్ట కులాలు/మతాల ప్రయోజనం కోసం కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు విన్నది. ‘‘ఈ కులాలను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రాధాన్యతకు ప్రాతిపదిక ఏమిటి? ఓ కులం లేదా మతం ఎంపిక కోసం ఏదైనా విధానం ఉందా’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
2021-07-12కరోనా థర్డ్ వేవ్ అత్యంత సమీపంలోనే ఉందని భారత వైద్యుల సంఘం (ఐఎంఎ) హెచ్చరించింది. కరోనాపై అస్త్రసన్యాసం చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం ఒక ప్రకటనలో విన్నవించింది. అధికార యంత్రాంగం ఉదాసీనత పట్ల ఐఎంఎ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో చాలా చోట్ల ప్రభుత్వం, ప్రజలు మహమ్మారి ప్రమాదం లేనట్టుగా... కోవిడ్ నిబంధనలను పాటించకుండా మూక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆక్షేపించింది. టూరిస్టు బొనాంజా, తీర్థయాత్ర, మతపరమైన ఉత్సవాలు మరికొద్ది నెలలు ఆగగలవని పేర్కొంది.
2021-07-12పాఠశాల ఆవరణల్లో గ్రామ సచివాలయాలను నిర్మించవద్దన్న తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై మండిపడింది. పంచాయతీరాజ్, విద్యా శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాటికోసం కొన్నిచోట్ల పాఠశాల స్థలాల్లో భవనాలను నిర్మిస్తోంది. అలా చేయవద్దని గత ఏడాది జూన్ 11న హైకోర్టు స్పష్టం చేసినా నిర్మాణాలు ఆగలేదని నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి.
2021-07-12గ్రామ పంచాయతీల అధికారాలను హరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. సర్పంచ్, సెక్రటరీ అధికారాలను గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్ఒ)కి అప్పగిస్తూ ప్రభుత్వం మార్చి నెలలో ఒక జీవోను జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తోకలవారిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పంచాయతీల పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
2021-07-12చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) సభ్యుడిని కావాలనుకుంటున్నట్టు హాంకాంగ్ యాక్షన్ చిత్రాల సూపర్ స్టార్ జాకీచాన్ ఇటీవల ఓ సినీ సింపోజియంలో చెప్పారు. ‘‘నేను సిపిసి గొప్పతనాన్ని వీక్షించగలుగుతున్నాను. ఏం చెబుతుందో అది చేసి చూపుతుంది’’ అని జాకీచాన్ ప్రశంసించారు. చైనా ఫిల్మ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ కూడా అయిన చాకీచాన్ మాటకు ప్రాధాన్యత ఏర్పడింది. హాంకాంగ్ ఎలైట్ లో సిపిసి పట్ల మారుతున్న వైఖరికి ఇది నిదర్శనమని కొందరు విశ్లేషిస్తున్నారు.
2021-07-11బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తన కంపెనీ ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష విమానం ‘యూనిటీ 22’లో కొద్దిసేపు అంతరిక్ష విహారం చేశారు. ప్రైవేటు జెట్ సైజులో ఉన్న ఈ అంతరిక్ష విమానంలో ఆదివారం సాయంత్రం భూ ఉపకక్ష్య లోకి వెళ్లినవారిలో తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. విమానం శబ్దవేగానికి మూడు రెట్ల వేగాన్ని అందుకొని 53.5 మైళ్ల ఎత్తుకు చేరిందని కంపెనీ ప్రకటించింది. అక్కడ అంతా మూడు నిమిషాల పాటు భారరహిత స్థితిని ఆస్వాదించారు. ఇద్దరు పైలట్లు విమానాన్ని నడపగా బ్రాన్సన్, శిరీష సహా నలుగురు ప్రయాణించారు.
2021-07-11‘‘మంత్రివర్గంలో లాయర్లు, డాక్టర్లు, పీజీలు, పి.హెచ్.డి.లు ఉన్నారు’’ కేంద్ర ప్రభుత్వం ఘనంగా చాటుకుంటున్న విషయం ఇది. ఈ మంత్రివర్గపు మరో ముఖాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఆవిష్కరించింది. కేంద్ర మంత్రివర్గంలోని 78 మందిలో 33 మంది (42%) పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 24 మంది (31%) పైన హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఉండటం గమనార్హం. అమిత్ షా, గిరిరాజ్ సింగ్, శోభా కరంద్లాజే, నిత్యానంద రాయ్, ప్రహ్లాద్ జోషిలపైన మత సామరస్యానికి భంగం కలిగించారనే అభియోగాలున్నాయి.
2021-07-10ఆస్ట్రేలియా ఇంటా బయటా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు, యుద్ధ నేరాలకు పాల్పడిందని చైనా మండిపడింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 47వ సదస్సు సందర్భంగా చైనా దౌత్యవేత్త జియాంగ్ దువాన్ మాట్లాడారు. విదేశాల్లో మిలిటరీ ఆపరేషన్ల సందర్భంగా ఆస్ట్రేలియా సైనికులు అమాయకులను చంపారని, దేశంలోపల ఆఫ్రికన్లు, ఆసియన్లు, మైనారిటీలు, మూలవాసుల పైన సుదీర్ఘ వ్యవస్థీకృత జాతి వివక్ష పాటిస్తున్నారని, ఆఫ్ షోర్ డిటెన్షన్ సెంటర్లలో శరణార్ధులను సుదీర్ఘ కాలం నిర్భంధిస్తున్నారని వివరించారు.
2021-07-09కొత్తగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన జ్యోతిరాదిత్య సింధియా చేయబోయే మొదటి పని ఏమిటి? విమానాశ్రయాలకు పేర్లు పెట్టడం, ఉన్న పేర్లు మార్చడంపై ఒక జాతీయ విధానాన్ని రూపొందించడం! ఇది ఆయన నిర్దేశించుకున్న లేదా ప్రధాని మోదీ నిర్దేశించిన పని కాదు. శుక్రవారం బాంబే హైకోర్టు ఈమేరకు నిర్దేశించింది. ఇప్పటికే ముసాయిదా రూపొందించే పని జరుగుతుంటే, వెంటనే అది పూర్తి చేయాలని, కొత్త విమాన యాన శాఖ మంత్రికి ఇదే మొదటి పని కావాలని హైకోర్టు స్పష్టం చేసింది.
2021-07-09