2020 కేలండర్ సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ‘సున్నా’గా ఉంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. కొద్ది రోజుల క్రితం అంచనాల్లో.. జీడీపీ 2.5 శాతం వృద్ధి చెందుతుందని ఈ సంస్థ పేర్కొంది. 21 రోజుల దేశవ్యాప్త ‘లాక్ డౌన్’ను 19 రోజులు (మే3 వరకు) పొడిగించడం వల్ల ఆర్థిక వ్యవస్థ 234.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 18 లక్షల కోట్ల)ను నష్టపోతుందని అంచనా వేసింది. ఇది మొత్తం జీడీపీలో 8.1 శాతం. ‘లాక్ డౌన్’తో పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్ భారీగా నష్టపోతాయని బార్క్లేస్ పేర్కొంది.
2020-04-14మిర్చి ఘాటును ప్రపంచానికి చూపించిన గుంటూరును సైతం ‘కరోనా’ మహమ్మారి వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 పాజిటివ్ కేసులు దాటిన తొలి జిల్లా గుంటూరు. మంగళవారం ఉదయానికి ఈ జిల్లాలో ‘కరోనా’ కేసుల సంఖ్య 109కి పెరిగింది. రాష్ట్రం మొత్తంలో నమోదైన 473 కేసుల్లో గుంటూరు జిల్లా వాటా 23 శాతం. జిల్లాలో కరోనా సోకినవారిలో ఇద్దరు మరణించగా.. ఒక్కరు కూడా కోలుకున్న దాఖలాలు లేవు. 91 పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉండగా, మరణాల్లో కృష్ణా జిల్లా (3) మొదటి స్థానంలో ఉంది.
2020-04-14ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 500కు సమీపిస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 34 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసులు 473కి పెరిగాయి. అందులో 9 మంది మరణించగా 14 మంది మాత్రమే కోలుకున్నారు. 450 మందికి ఇంకా చికిత్స జరుగుతోంది. గుంటూరులో అత్యధికంగా రాత్రికి రాత్రి 16 కేసులు అదనంగా నమోదయ్యాయి. క్రిష్ణా జిల్లాలో ఎనిమిది మందికి, కర్నూలులో ఏడుగురికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయింది.
2020-04-14భారత ప్రభుత్వ సంస్థలు, ఇతర కంపెనీలు చైనా నుంచి కోటిన్నర వ్యక్తిగత రక్షిత పరికరాల (పిపిఇ) కిట్లు, 15 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకోనున్నట్టు కేంద్ర అధికారులు తెలిపారు. ఈ పిపిఇ కిట్లలో గౌన్లు, మాస్కులు, గాగుల్స్ తదితర పరికరాలు ఉంటాయి. ఈ ఆర్డర్ల మేరకు పూర్తిగా కిట్లను సరఫరా చేయాలని భారత ప్రభుత్వం తాజాగా చైనాను కోరింది. తమ కిట్ల నాణ్యతపై పలు యూరప్ దేశాల నుంచి విమర్శలు రావడంతో చైనా ప్రభుత్వం ఎగుమతులపై కఠినమైన నియంత్రణలు విధించింది. చైనా కొద్ది రోజుల క్రితం ఇండియాకు 1,70,000 పిపిఇ కిట్లను బహుకరించింది.
2020-04-14‘కరోనా’ కట్టడికోసం విధించిన 21 రోజుల ‘లాక్ డౌన్’ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో.. అప్పటివరకు పాసెంజర్ రైళ్ళ సస్పెన్షన్ ను కూడా పొడిగించనున్నట్టు సమాచారం. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత రైల్వే అధికారి ఒకరు ఈ విషయం చెప్పారు. అయితే, అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘జనతా కర్ఫ్యూ’ కంటే ముందే మార్చి 21న రైల్వే శాఖ పాసెంజర్ రైళ్ళను నిలిపివేసింది. తొలుత మార్చి 31 వరకు సస్పెన్షన్ ను ప్రకటించి తర్వాత ‘లాక్ డౌన్’ గడువు (ఏప్రిల్ 14) వరకు పొడిగించింది.
2020-04-14‘కరోనా’ కట్టడికోసం విధించిన 21 రోజుల ‘లాక్ డౌన్’ మంగళవారంతో ముగుస్తుండగా.. మరో 19 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మే 3వ తేదీ వరకు కొనసాగే ‘లాక్ డౌన్’లో ఈ నెల 20 తర్వాత కొన్ని మినహాయింపులు ఉంటాయని ప్రధాని సంకేతాలిచ్చారు. అప్పటిదాకా కఠినంగానే అమలవుతుందని చెప్పారు. 138 కోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం.. ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి. తొలి దశ ‘లాక్ డౌన్’లో ప్రజలు తిండి లేక ఇబ్బంది పడినా, అనేక సమస్యలు ఎదుర్కొన్నా సామూహిక శక్తిని ప్రదర్శించారని ప్రధాని ప్రశంసించారు.
2020-04-14కరోనా వైరస్ సోకినవారి సంఖ్య దేశవ్యాప్తంగా 10,000 దాటగా తెలుగు రాష్ట్రాల్లో 1000 కంటే ఎక్కువమందికి వ్యాపించింది. సోమవారం రాత్రికి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 592కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య 439కి చేరింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 1031 కేసులు నమోదు కాగా 115 మంది (తెలంగాణలో 103, ఏపీలో 12 మంది) కోలుకున్నారు. తెలంగాణలో 17 మంది, ఏపీలో 8 మంది వైరస్ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ మహానగరంలో 270కి పైగా కేసులు నమోదు కాగా 51 మంది కోలుకున్నారు. ఇంకా 216 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో గుంటూరులో అత్యధికంగా 93 మంది వైరస్ బారిన పడ్డారు.
2020-04-14‘ఇండియా’లో కరోనా వైరస్ కేసులు 10 వేలు దాటాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ట్రాకర్ ప్రకారం సోమవారం వరకు ఇండియాలో 10,453 మందికి ‘కరోనా’ సోకింది. వారిలో 358 మంది మరణించారు. సోమవారం ఒక్కరోజే 1,276 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన 763 కేసుల కంటే ఇది 67 శాతం ఎక్కువ. ఒకే రోజులో 1200కు పైగా కొత్త కేసులు నమోదు కావడం మొదటిసారి. ఆదివారం ఢిల్లీలో 356, మహారాష్ట్రలో 352 కేసులు నమోదు కావడం ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రలో 160 మంది ‘కరోనా’ కారణంగా చనిపోయారు.
2020-04-14తొలగించిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన మాజీ న్యాయమూర్తి వి. కనగరాజ్ దూకుడుమీదున్నారు. సోమవారం కమిషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి.. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించడానికైనా సర్వసన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు. ‘కరోనా’ ముంచుకొస్తున్నందున ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన రమేష్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా కుదించి ఇంటికి పంపిన విషయం తెలిసిందే. అసాధారణ పద్ధతుల్లో నియమితుడైన జస్టిస్ కనగరాజ్, ‘కరోనా’ నిర్బంధ కాలంలోనే ఎన్నికలపై మాట్లాడటం విశేషం.
2020-04-13రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి) స్థానం నుంచి రమేష్ కుమార్ ను తొలగించడంలోని హేతుబద్ధతను వివరిస్తూ ఈ నెల 16లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్ఇసి పదవీ కాలాన్ని మూడేళ్ళకు కుదిస్తూ ఆర్డినెన్సును, రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిందంటూ జీవోలను ఇవ్వడాన్ని ఆయన హైకోర్టులో సవాలు చేశారు. స్థానిక ఎన్నికల వాయిదాకు కారణమైన మెడికల్ ఎమర్జెన్సీలోనే ఆర్డినెన్సు జారీ చేయడం దురుద్దేశంతో కూడుకున్నదని రమేష్ కుమార్ వాదించారు. ఈ అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఎం. సత్యనారాయణ వాదనలు విన్నారు.
2020-04-13