ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. గురువారం అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. శరత్ చంద్రా రెడ్డిని, ఓ మద్యం కంపెనీకి చెందిన బినయ్ బాబును అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా వారి అరెస్టు జరిగినట్టు సమాచారం. అరెస్టులకు ముందు వారిద్దరికీ సంబంధించిన భవనాల్లో ED సోదాలు నిర్వహించింది. అరెస్టయిన ఇద్దరినీ వైద్య పరీక్షల అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
2022-11-10రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరవ కిస్తీ కింద రూ. 879 కోట్ల గ్రాంటు విడుదలైంది. దీంతో కలిపి ఈ ఏడాది ఇప్పటిదాకా రెవెన్యూ లోటు గ్రాంటు కింద రాష్ట్రానికి వచ్చిన మొత్తం రూ. 5,274 కోట్లు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ. 6,793 కోట్లు అందగా, దక్షిణాదిన మరో లోటు రాష్ట్రమైన కేరళకు రూ. 6,587 కోట్లు విడుదలయ్యాయి. ఆరవ వాయిదా కింద కేరళకు రూ. 1098 కోట్లు విడుదలయ్యాయి.
2022-09-06ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటులో ఆరవ నెలవారీ వాయిదా తాజాగా విడుదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం 14 రాష్ట్రాలకు రూ. 7,183 కోట్లు విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను బదలాయించిన తర్వాత కూడా రూ. 86,201 కోట్ల మేరకు రెవెన్యూ లోటు గ్రాంటును ఇవ్వాల్సి ఉంటుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు రూ. 43,100 కోట్లు విడుదలయ్యాయి.
2022-09-06భారత దేశం - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న 54 నదులు, వాటి చుట్టూ అల్లుకున్న జానపద గాథలు ఇరు దేశాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మంగళవారం మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుషియారా నదీ జలాల పంపిణీపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇండియా వైపు దక్షిణ అస్సాం ప్రాంతానికి, బంగ్లాదేశ్ వైపు సిల్హెట్ ప్రాంతానికి ప్రయోజనం కలగనుంది.
2022-09-06ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన ప్రకారం... దేశంలోని 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి 100 సంవత్సరాలు పడుతుందని ఢిల్లీ సిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దేశంలోని 14,500 పాఠశాలలను ఆధునీకరించనున్నట్టు ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. ప్రతీ విద్యార్థీ అగ్రశ్రేణి విద్యను ఉచితంగా పొందనిదే దేశం పురోగమించదని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు.
2022-09-06భారత్ తమ మిత్ర దేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఉద్ఘాటించారు. భారత పర్యటన కోసం వచ్చిన హసీనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రప్రతి భవన్ లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని మాట్లాడుతూ.. ఎప్పుడు ఇండియాకు వచ్చినా తనకు సంతోషం కలుగుతుందని, బంగ్లా విమోచన యుద్ధంలో ఇండియా పాత్రను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటామని చెప్పారు. రక్షణ, వాణిజ్యం, నదీ జలాల పంపకం వంటి అనేక అంశాలలో పరస్పర సహకారంపై మోదీ, హసీనా చర్చలు జరపనున్నారు.
2022-09-06తెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. సుమారు ఆరు నెలల తర్వాత సమావేశం కాబోతున్న అసెంబ్లీ, మండలి కేవలం మూడు రోజుల పాటు (6, 12, 13 తేదీల్లో) పని చేయనున్నాయి. మొదటి రోజు సంతాప తీర్మానాల తర్వాత శాసనసభ వాయిదా పడుతుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పి. జనార్ధన్ రెడ్డి లకు సభ నివాళులు అర్పించనుంది. శాసన మండలిలో తొలిరోజు వరద నష్టాలపై స్వల్పకాలిక చర్చ ఉంది.
2022-09-06ప్రధాన మంత్రి కావాలనే ఆకాంక్ష గానీ ఆశయం గానీ తనకు లేవని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత నితీష్ మొదటిసారిగా రాహుల్ గాంధీని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ... ప్రధాని పదవి ఆకాంక్షపై ఊహాగానాలకు తెర దించారు.
2022-09-05ప్రస్తుతం యుద్ధక్షేత్రంగా మారిన ఉక్రెయిన్ 2012, 2021 మధ్య మిలిటరీ వ్యయాన్ని భారీగా (142 శాతం) పెంచి రికార్డులకెక్కింది. 2021లో ఆ దేశం మిలిటరీపై $5.9 బిలియన్లు ఖర్చు చేసింది. ఇది ఉక్రెయిన్ 2021 అంచనా జీడీపీలో 3.26 శాతం. 2012లో ఆ దేశ మిలిటరీ వ్యయం జీడీపీలో కేవలం 1.6 శాతం. NATOను నమ్మి పొరుగున ఉన్న మిలిటరీ సూపర్ పవర్ తో శక్తికి మించి తలపడి అసాధారణంగా మిలిటరీ వ్యయాన్ని పెంచిన ఉక్రెయిన్, ఇప్పుడు విధ్వంసాన్ని చవి చూస్తోంది.
2022-04-25ప్రపంచ మిలిటరీ వ్యయంలో భారత దేశం మూడో స్థానంలో కొనసాగింది. 2021లో ఇండియా మిలిటరీపై 76.6 బిలియన్ డాలర్లు (రూ. 5,87,292 కోట్లు) ఖర్చు చేసిందని, ఇది 2020తో పోలిస్తే 0.9 శాతం ఎక్కువని స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. $801 బిలియన్ల వ్యయంతో అమెరికా ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా, చైనా $293 బిలియన్లు ఖర్చు చేసినట్టుగా ‘సిప్రి’ అంచనా వేసింది.
2022-04-25