సైన్యంలోని త్రివిధ దళాలకు కలిపి ఒక అధిపతిని నియమించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య మెరుగైన సమన్వయం కోసం ముగ్గురు అధిపతులకు పైన ‘‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్)’’ ఉంటారు. ‘‘ఫోర్ స్టార్ జనరల్’’ ర్యాంకుతో సరికొత్త పోస్టుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ చీఫ్... కొత్తగా ఏర్పాటు చేయబోయే మిలిటరీ వ్యవహారాల శాఖ (డిఎంఎ)కు కూడా అధిపతిగా వ్యవహరిస్తారు. డి.ఎం.ఎ. రక్షణ శాఖలో అంతర్భాగం.
2019-12-24దేశంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్యకు దర్పణం పట్టే ఘటన ఇది. మంగళవారం ఒరిస్సా రేవు పట్టణం పారదీప్ లోని జె.ఎస్.డబ్ల్యు. కంపెనీ కార్యాలయంలోకి చొరబడిన నిరుద్యోగ ఇంజనీర్లు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కంపెనీ మాట నిలబెట్టుకోలేదని ఇంజనీర్లు ధ్వజమెత్తారు. బిజు పట్నాయక్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం సభ్యులు ఈ నిరసన చేపట్టారు. తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి కంపెనీ మాట తప్పిందని ఫిర్యాదు చేశారు.
2019-12-24‘‘పౌరసత్వ’’ నిరసనల సెగ పశ్చిమ బెంగాల్ గవర్నర్ ను తాకింది. మంగళవారం జాదవ్ పూర్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ జగదీప్ ధంఖర్ ను విద్యార్ధులు ఘెరావ్ చేశారు. స్నాతకోత్సవ వేదిక వద్దకు వెళ్ళకుండా అడ్డుకోవడంతో గవర్నర్ కారులోనే గంటన్నర సేపు ఉండిపోయారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను సమర్థించిన గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ పట్టా తీసుకోబోమని కొంతమంది విద్యార్ధులు ముందే ప్రకటించారు.
2019-12-24పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనల మధ్య కేంద్ర మంత్రివర్గం జాతీయ జనాభా రిజిస్ట్రీ (ఎన్.పి.ఆర్) సవరణ ప్రక్రియకు ఆమోదం తెలిపింది. మరి ఎన్.పి.ఆర్.లో ఏముంది? పౌరులు ఈసారి కుటుంబ సమాచారంతోపాటు తల్లిదండ్రుల పుట్టుక వివరాలనూ సమర్పించాల్సి ఉంటుంది. తల్లి, తండ్రి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పుట్టారన్న సమాచారం ఇవ్వాలి. 2010లో చేపట్టిన జనాభా రిజిస్ట్రీ ప్రక్రియలో 15 అంశాలపై సమాచారం సేకరించగా ఈసారి 21 అంశాలపై సేకరిస్తారు.
2019-12-242021 జనాభా లెక్కల సేకరణకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,941 కోట్లు కేటాయించింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో... జాతీయ జనాభా రిజిస్ట్రీ (ఎన్.పి.ఆర్) సవరణ, 2021 జనాభా లెక్కల సేకరణ కోసం బడ్జెట్ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. జాతీయ పౌర రిజిస్ట్రీ కోసం ఎలాంటి పత్రాలూ అడగడం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంత్రివర్గ సమావేశం అనంతరం చెప్పారు.
2019-12-24ప్రజల్లో భయాందోళనల మధ్య.. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్)ను సవరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి) లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. జాతీయ జనాభా రిజిస్టర్ సవరణ ప్రక్రియ కోసం రూ. 8,754 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఎన్.ఆర్.సి.ని దేశం మొత్తం అమలు చేయడానికి ఎన్.పి.ఆర్. భూమిక కానుంది.
2019-12-24తన ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)కి వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పౌరసత్వ సవరణ బిల్లు (సిఎబి)కి కొద్ది రోజుల క్రితమే పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ మద్ధతు తెలిపింది. ఆ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో... ఎన్.ఆర్.సి.ని మాత్రం అమలు చేయబోమని వైసీపీ ప్రకటించింది.
2019-12-23‘‘మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి శత్రువులు పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. కానీ, వారు చేయలేకపోయిన పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలో చేపట్టిన సత్యాగ్రహ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ‘‘ద్వేషం మాటున దాక్కోకండి మోడీ జీ.. మీరు ఉపాధి ఎందుకు కల్పించలేదో యువతకు చెప్పండి. ఆర్థిక వ్యవస్థను ఎందుకు నాశనం చేశారో దుకాణదారులకు, చిన్న పారిశ్రామికవేత్తలకు చెప్పండి’’ అని డిమాండ్ చేశారు.
2019-12-23జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. జెఎంఎం-కాంగ్రెస్-ఆర్.జె.డి. కూటమి సాధారణ మెజారిటీ దిశగా పయనిస్తోంది. అసెంబ్లీలోని 81 సీట్లకు గాను 41 సీట్లు సాధించవలసి ఉంటుంది. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం... ఈ కూటమి ఖచ్చితంగా 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బిజెపి 29, జె.వి.ఎం 3, ఎ.జె.ఎస్.యు. 3, ఇతరులు 5 స్థానాల్లో ముందంజ వేశారు. కూటమి పార్టీల్లో జెఎంఎం 24, కాంగ్రెస్ 12, ఆర్.జె.డి. 5 స్థానాల్లో ముందున్నాయి.
2019-12-23దేశంలో డిటెన్షన్ సెంటర్లు లేనే లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నొక్కి వక్కాణించిన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘మోడీ చెప్పిన అబద్ధాలపై భారతీయులు సింపుల్ గూగుల్ సెర్చ్ కూడా చేయలేరని ఆయన నమ్మకమా? డిటెన్షన్ సెంటర్లు ఉన్నది ముమ్మాటికీ వాస్తవం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు అవి పెరుగుతూనే ఉంటాయి’’ అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో విమర్శించింది. డిటెన్షన్ సెంటర్లకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ షేర్ చేసింది.
2019-12-22