ఈజిప్టులో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక భారతీయుడు సహా ఆరుగురు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వారిలో ఇండియా, మలేషియా నుంచి వెళ్లిన పర్యాటకులు ఉన్నారు. కైరో నగరానికి తూర్పున ఎర్ర సముద్రానికి సమీపంలోని రహదారిపై రెండు టూరిస్టు బస్సులు ఒక ట్రక్కును ఢీకొన్నాయి. ఇద్దరు మలేషిన్ మహిళా టూరిస్టులు, ఒక భారతీయుడు, ముగ్గురు ఈజిప్షియన్లు మరణించారు.
2019-12-28ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై చేయి చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శనివారం ఆరోపించారు. మాజీ ఐపిఎస్ అధికారి ఎస్.ఆర్. దారాపురి కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తుండగా పోలీసులు చుట్టుముట్టారని, ఒక మహిళా పోలీసు తనను గట్టిగా నొక్కారని ప్రియాంక చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలిపినందుకు మాజీ ఐపిఎస్ అధికారిని అరెస్టు చేశారు. ప్రియాంకను మోటారు బైకుపై కూడా వెళ్లనీయకపోవడంతో కాలి నడకన వెళ్లానని వివరించారు.
2019-12-28సూపర్ సోనిక్ క్షిపణులను సైన్యానికి అందించిన తొలి దేశంగా రష్యా ఈ ఏడాది రికార్డు సాధించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించిన రష్యా, 2019లో ఆయుధాలు, రక్షణ కార్యకలాపాలపై లక్షా 74 వేల కోట్ల రూపాయలు (24.2 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. అత్యాధునిక ఆయుధాలు, పరికరాలు సమకూర్చుకోవడంలో రష్యాకు 2019 ప్రత్యేక సంవత్సరంగా చెప్పుకోవాలి. కాగా, రష్యా మొత్తం రక్షణ వ్యయం 63 బిలియన్ డాలర్లు.
2019-12-28జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా పుట్టిన రోజును, కాశ్మీర్ అమరుల దినోత్సవాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ సెలవుల జాబితా నుంచి తప్పించింది కేంద్ర పాలనలోని యంత్రాంగం. స్వాతంత్రానికి పూర్వం 1931జూలై 13న రాజా హరిసింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై ఆయన సైన్యం కాల్పులు జరిపింది. అందులో మరణించినవారిని స్మరిస్తూ ఏటా ఆ రోజును అమరుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఇప్పుడా వారసత్వానికి స్వస్తి పలికారు.
2019-12-28జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి) వరకు ఆగవద్దని, జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) ప్రక్రియనే నిలిపివేయాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ పిలుపునిచ్చారు. ‘పౌర రిజిస్టర్’కు ‘జనాభా రిజస్టర్’ భూమిక అని, అందుకే అడ్డుకోవాలని సూచించారు. తమ పార్టీ ప్రభుత్వం ఉన్న కేరళలో... ఎన్.పి.ఆర్. ప్రక్రియను చేపట్టేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
2019-12-28రాష్ట్ర రాజధానిని మార్చే నైతిక హక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని సీపీఐ జాతీయ నేత కె. నారాయణ వ్యాఖ్యానించారు. రాజధానిని మార్చాలనో... 3 రాజధానులు ఏర్పాటు చేయాలనో.. అనుకుంటే పదవులకు రాజీనామా చేసి ఆ అంశం ఆధారంగా ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా చేయడానికి ఇదేమీ చిన్న విషయం కాదని, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన కీలక అంశమని నారాయణ పేర్కొన్నారు.
2019-12-28పాలన మొత్తం విశాఖపట్నం నుంచే జరగాలని ప్రభుత్వం ‘‘నిర్ణయం తీసుకోబోతోంద’’ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చెప్పారు. నిర్ణయం తీసుకున్నట్టుగా మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో ప్రకటించిన ఆయన, శనివారం మాట కొద్దిగా మార్చారు. రాజధానిపై సిఎంకు బదులు ఎంపీ ప్రకటన చేయడం వివాదమైన నేపథ్యంలో...నిన్న సమావేశమైన మంత్రివర్గం స్పష్టత ఇవ్వలేదు. పైగా ‘‘అది విజయసాయి కోరిక కావచ్చు’’ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
2019-12-28సిఎం వైఎస్ జగన్ ఏడు నెలలుగా తవ్వుతున్నది అవినీతిని కాదని, వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఆధారాలు ఉంటే బయటపెట్టమని తాము డిమాండ్ చేస్తే... పాత కాకి లెక్కలే చెబుతున్నారని విమర్శించారు. అమరావతి భూ లావాదేవీలలో అవినీతి జరిగిందని నిన్న మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన నేపథ్యంలో లోకేష్ శనివారం ‘ఫేస్ బుక్’లో స్పందించారు.
2019-12-28భారత జాతీయ కాంగ్రెస్ (ఐ.ఎన్.సి) పార్టీ నేటితో 134 వసంతాలు పూర్తి చేసుకుంది. సివిల్ సర్వీసు నుంచి తప్పుకొన్న ఆంగ్లేయుడు ఎ.ఒ. హ్యూమ్ చొరవతో 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగింది. తొలి సభ 1985 డిసెంబర్ 28 నుంచి 31వరకు బొంబాయిలో జరిగింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల ప్రాతినిధ్యంకోసం పని చేసే సంస్థగా మాత్రమే ప్రాథమిక దశలో కాంగ్రెస్ గుర్తింపు పొందింది. తర్వాత కాలంలో జన సామాన్యానికి దగ్గరై జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించింది.
2019-12-28రష్యా హైపర్ సోనిక్ మిసైల్ ‘‘అవన్ గార్డ్’’ సైనిక వినియోగంకోసం అందుబాటులోకి వచ్చింది. అణ్వాయుధ సహిత అవన్ గార్డ్ క్షిపణికి.. ధ్వని కంటే 27 రెట్లు వేగంగా ప్రయాణించే సామర్ధ్యం ఉందని రష్యా ప్రకటించింది. అంత వేగంలోనూ చురుగ్గా దిశను మార్చుకోగల నైపుణ్యం ఈ క్షిపణి సొంతం. దీన్ని అడ్డుకోవడం ప్రపంచంలోని ఏ ‘క్షిపణి రక్షణ వ్యవస్థ’కూ సాధ్యం కాదని చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గత ఏడాదే దీన్ని జాతికి అంకితం చేయగా, శుక్రవారం సైన్యం వినియోగానికి సిద్ధం చేశారు.
2019-12-28