ఉన్నావ్ మానభంగం, బాధితురాలి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసుల్లో నిందితుడైన ఉత్తరప్రదేశ్ బీజేపీ (బహిష్కృత) ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. కిడ్నాప్, రేప్ కేసుల్లో శిక్షతోపాటు... రూ. 25 లక్షల జరిమానా విధించింది. 2017లో సామూహిక అత్యాచారం జరిగితే.. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినందున పోలీసులు చర్యలు తీసుకోలేదు. బాధితురాలు గత ఏడాది యూపీ సిఎం యోగి ఆధిత్యనాథ్ ఇంటి ఎదుట ఆత్మహత్యా ప్రయత్నం చేశాక... నిందితుడిని అరెస్టు చేశారు.
2019-12-20పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో హింస తనను తీవ్రంగా బాధించిందని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్కొన్నారు. ‘‘ఏ అంశానికైనా పరిష్కారం కనుగొనడానికి హింస ఒక మార్గం కాకూడదు. దేశ భద్రత, సంక్షేమాన్నిదృష్టిలో పెట్టుకొని భారత ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలి’’ అని రజినీ ట్వీటారు. దీనిపై ఎక్కువమంది నెటిజన్లు ప్రతికూలంగా స్పందించారు. కేంద్రం చర్యలు తప్పని ఒక్క మాటా అనలేదేమని ప్రశ్నించారు.
2019-12-20రాజధానిని అమరావతి నుంచి మార్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతు కుటుంబాల మహిళలను మనోహర్, నాగబాబు పరామర్శించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రైతులు భూములను ఇస్తే, సంకుచిత వైఖరితో వారిని బాధించడం ఏమిటని మనోహర్ ప్రశ్నించారు. గతంలో ఎవరికీ ఇవ్వనన్ని సీట్లు ప్రజలు వైసీపీకి ఇచ్చారని, బాధ్యతారాహిత్యం తగదని పేర్కొన్నారు.
2019-12-20రాజధానిని మార్చాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎదుట ఎంతమంది ప్రజలు విన్నవించారో వెల్లడించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. నాలుగు గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద రుద్దుతారా? అని ప్రశ్నించారు. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన అమరావతి రైతులకు సంఘీభావంగా వెలగపూడి ధర్నాలో పాల్గొన్న మనోహర్, అక్కడే మీడియాతో మాట్లాడారు.
2019-12-20అమెరికా ప్రతినిధుల సభ అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్ కు తన పార్టీ సహచరులు మాత్రం మూకుమ్మడిగా మద్ధతు తెలిపారు. ఒక్కరు కూడా అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయలేదు. బుధవారం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సభలో ఓటింగ్ జరిగింది. సభలో డెమోక్రాట్లకు మెజారిటీ ఉండటంతో 229-198 తేడాతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. డెమోక్రాటిక్ పార్టీ 2020 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న తుల్సి గబ్బార్డ్ మాత్రం ‘‘హాజరు’’ వేయించుకున్నారు తప్ప వ్యతిరేకించలేదు.
2019-12-19ఆంధ్రప్రదేశ్ రాజధాని, వికేంద్రీకృత అభివృద్ధిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానుంది. రాజధాని ఎక్కడ..ఏ సంస్థలు ఎక్కడ? అన్న అంశంపై నివేదికను సోమవారమే సమర్పించే అవకాశం ఉంది. కమిటీ నివేదిక రాక ముందే సిఎం జగన్ ‘మూడు రాజధానులు’ ఉండొచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే. పరిపాలన విశాఖపట్నం నుంచి సాగవచ్చని, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ ఉంటాయని జగన్ వెల్లడించారు.
2019-12-19అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీదారు అవుతాడనుకున్న జో బిడెన్, ఆయన కుమారుడు లక్ష్యంగా విచారణ జరపాలని ఉక్రెయిన్ ప్రభుత్వంపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. ఉక్రెయిన్ కు ఆర్థిక సాయాన్ని ప్రకటించి ప్రతిగా ‘జో’పై విచారణ కోసం పట్టు పట్టారు. దీంతో... అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ట్రంప్ అభిశంసనకు డెమోక్రాట్లు ప్రతిపాదించారు. ట్రంప్ పదవిలో కొనసాగుతారా.. లేదా అన్నది మాత్రం సెనెట్ లో చేపట్టే విచారణపై ఆధారపడి ఉంటుంది.
2019-12-19పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విధ్వంసానికి పాల్పడినవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారి ఆస్తులను వేలం వేసి జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటామని గురువారం చెప్పారు. యు.పి.లోని లక్నో, సంభల్ ప్రాంతాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించి వీడియోలు, సీపీ టీవీ ఫుటేజీ ఉన్నాయని, వారిపై ప్రతీకారం తప్పదని సిఎం పేర్కొన్నారు.
2019-12-19జనసేన పార్టీ లెటర్ హెడ్ పై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పేరిట కొంతమంది నకిలీ ప్రెస్ నోట్లు ప్రచారంలో పెడుతున్నారని ఆ పార్టీ పేర్కొంది. ఈ అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు జనసేన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పార్టీ ప్రకటనలు అధికారిక గ్రూపుల ద్వారానే పంపిస్తామని నేతలు తెలిపారు.
2019-12-19పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై నిరసనలు, పోలీసుల ఆంక్షలతో గురువారం దేశ రాజధాని స్తంభించింది. ఏడు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణీకులతో పాటు విమానాల సిబ్బంది కూడా ఎయిర్ పోర్టుకు చేరుకోలేకపోయారు. దీంతో 19 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 16 సర్వీసులు ఆలస్యమయ్యాయి. 20 ముఖ్యమైన విమాన సర్వీసుల సమయాన్ని మార్చినట్టు ఇండిగో సంస్థ తెలిపింది. భవిష్యత్తులో తమ సిబ్బందిని ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న హోటళ్ళలోనే ఉంచనున్నట్టు పేర్కొంది.
2019-12-19