‘కరోనా’ ప్రభావంతో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు జూలైలోనూ తగ్గాయి. జూలైలో రూ. 87,422 కోట్లు వసూలయ్యాయి. ఇవి గత ఏడాది జూలై కంటే 14.6 శాతం తక్కువ. ఈ ఏడాది జూన్ మాసంలో వసూలైన రూ. 90,917 కోట్ల కంటే తగ్గడం గమనార్హం. వరుసగా ఐదో నెల లక్ష కోట్ల కంటే తక్కువ పన్ను వసూళ్ళు నమోదయ్యాయి. ‘లాక్ డౌన్’ కారణంగా ఏప్రిల్ మాసంలో కేవలం రూ. 32,172 కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ. 62,151 కోట్లు వచ్చాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే, జూలై మాసాల్లో లక్ష కోట్లకు పైగా వసూలయ్యాయి.
2020-08-01ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (59) ‘కరోనా’తో శనివారం మరణించారు. ఆయన కొద్ది రోజులుగా విజయవాడలో చికిత్స పొందుతున్నారు. ఫొటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించిన మాణిక్యాలరావు.. బిజెపి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో తాడేపల్లిగూడెం నుంచి శాసనసభకు ఎన్నికై టిడిపి- బిజెపి కూటమి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలగిన బిజెపి మంత్రులిద్దరిలో మాణిక్యాలరావు ఒకరు.
2020-08-01విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో శనివారం భారీ క్రేన్ కూలిపోయి 11 మంది మరణించారు. ఈ క్రేన్ ను షిప్ యార్డు ఇటీవలే కొనుగోలు చేసింది. లోడు వేసి పరీక్షిస్తున్న సందర్భంలో క్రేన్ కూలిపోయినట్టు సమాచారం. మృతులలో షిప్ యార్డు సిబ్బంది, కాంట్రాక్టు సంస్థ సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ షిప్ యార్డులో నౌకల నిర్మాణం, రిపేర్లు, సబ్ మెరైన్ల నిర్మాణం వంటి పనులు జరుగుతాయి. ఎల్.జి. పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 11 మంది మరణించిన నాటి నుంచి విశాఖను వరుస ప్రమాదాలు వెన్నాడుతున్నాయి.
2020-08-01‘కరోనా’ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపింది. జూన్ నెలలో 8 ప్రధాన పారిశ్రామిక రంగాల్లో వృద్ధి రేటు 15 శాతం క్షీణించింది. 2019 జూన్ మాసంలో కేవలం 1.2 శాతం వృద్ధి చెందిన ఈ రంగాలు.. ఈసారి కరోనా కారణంగా కుదేలయ్యాయి. ఉక్కు పరిశ్రమ ఏకంగా 33.8 శాతం క్షీణించింది. బొగ్గు ఉత్పత్తి 15.5 శాతం, సహజవాయు ఉత్పత్తి 12 శాతం, విద్యుదుత్పత్తి 11 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 8.9 శాతం, సిమెంట్ 6.9 శాతం, క్రూడాయిల్ 6 శాతం తగ్గాయి. దీంతో మొత్తంగా 2020 రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 24.6 శాతం క్షీణత నమోదైంది. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో ఈ 8 రంగాల వాటా 40.27 శాతం.
2020-08-01అగ్రరాజ్యం అమెరికాను ‘కరోనా’ వణికిస్తోంది. ఆ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. 2020 రెండో త్రైమాసికంలో అమెరికా స్థూల దేశీయోత్పత్తి ఏకంగా 32.9 శాతం దిగజారింది. ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక ఆర్థిక పతనం. 1958లో అమెరికా ఆర్థిక వ్యవస్థలో నమోదైన 10 శాతం నెగెటివ్ గ్రోత్ కు మూడు రెట్లు పతనం కావడం ‘కరోనా’ తీవ్రతకు దర్పణం పడుతోంది. 2008 నాలుగో త్రైమాసికం (ఆర్థిక మాంద్యం)లో నమోదైన మైనస్ 8.4 కంటే ఇప్పుడు దాదాపు నాలుగు రెట్లు దిగజారడం గమనార్హం. 2020 మొదటి త్రైమాసికంలో కూడా అమెరికా జీడీపీ 5 శాతం తగ్గింది.
2020-07-30నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్.ఇ.సి)గా పునర్నియమించాలన్న ఏపీ హైకోర్టు తీర్పును అమలు చేయడానికి గవర్నర్ జోక్యం చేసుకోవలసి రావడం అవాంఛనీయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ధిక్కార చర్యలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చింది. ‘‘హైకోర్టు తీర్పు తర్వాత రమేష్ కుమార్ ను ఎస్.ఇ.సి.గా నియమించడానికి గవర్నర్ జోక్యం చేసుకోవలసి వచ్చింది.! అక్కడ (ప్రభుత్వానికి వ్యతిరేకంగా) కోర్టు ధిక్కార చర్యలు ఉన్నాయి. ఏమిటిది?’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వం తరపు న్యాయవాదులను ప్రశ్నించారు.
2020-07-24ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు అనూహ్యమైన వేగంతో పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. బుధవారం ఉదయం నుంచి గడచిన 24 గంటల్లో ఏకంగా 7,998 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు 333కి పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1391, గుంటూరులో 1184, అనంతపురంలో 1016, కర్నూలులో 904, పశ్చిమ గోదావరిలో 748, విశాఖపట్నంలో 684, నెల్లూరులో 438 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ‘కరోనా’ మరణాలు 884కి పెరిగాయి.
2020-07-23ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘కరోనా’ విశ్వరూపం కనిపిస్తోంది. మంగళవారం ఒక్క రోజే రాష్ట్రంలో 6045 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వీరితో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 64,713కి పెరిగింది. మంగళవారం అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1049 కేసులు, తూర్పుగోదావరిలో 891, గుంటూరులో 842, కర్నూలులో 678, పశ్చిమ గోదావరిలో 672 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 15 మంది మరణించారు. గత ఐదు రోజుల్లో ఏపీలో అధికారికంగా నమోదైన కేసులు 24,067. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 823 మంది ‘కరోనా’తో మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
2020-07-22ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన ‘కోర్టు ధిక్కార’ నేరాన్ని మోపింది సుప్రీంకోర్టు. ఆయన ట్విట్టర్లో పోస్టు చేసిన విమర్శలు సుప్రీంకోర్టు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నది అభియోగం. ట్విట్టర్ పైనా కోర్టు ధిక్కార అభియోగాలను మోపారు. ఈ వ్యవహారంపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం వాదనలు విననుంది. గత ఆరేళ్లలో ఇండియాలో జరిగిన ప్రజాస్వామ్య హననాన్ని భవిష్యత్తులో చరిత్రకారులు పరిశీలించేప్పుడు.. ఆ విధ్వసంలో సుప్రీంకోర్టు పాత్రను, మరీ ముఖ్యంగా గత నలుగురు ప్రధాన న్యాయమూర్తుల పాత్రను గుర్తిస్తారని గత నెలలో ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.
2020-07-21ఇండియా ఆర్థిక వ్యవస్థలో మరో ప్రమాద ఘంటిక మోగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి అప్పులు రూ. 170 లక్షల కోట్లకు పెరగబోతున్నాయని ఎస్.బి.ఐ. రీసెర్చ్ అంచనా వేసింది. గత ఏడాది ఈ మొత్తం రూ. 146.9 లక్షల కోట్లు. ఏడాదిలో రూ. 23 లక్షల కోట్లకు పైగా అదనపు అప్పులు కావడం, జీడీపీలో అప్పులు అమాంతం 72.2% నుంచి 87.6%కి పెరగనుండటం ఆందోళనకర పరిణామం. దీంతో రుణ పరపతి రేటింగ్ తగ్గవచ్చని ఎస్.బి.ఐ. రీసెర్చ్ సోమవారం ఓ రిపోర్టులో పేర్కొంది. 2011-12లో ఇండియా అప్పులు- జీడీపీ నిష్ఫత్తి 67.4 శాతం ఉండగా, 8 సంవత్సరాలలో (2019-20కి) 4.8 పర్సంటేజ్ పాయింట్లు పెరిగింది. కానీ, ఈ ఒక్క సంవత్సరం ఏకంగా 15.4 పర్సంటేజ్ పాయింట్లు పెరగనుంది.
2020-07-21