‘‘ప్రధానమంత్రి ప్రత్యేక నిధికి, ముఖ్యమంత్రి సహా నిధికి కోటి రూపాయల చొప్పున తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ విరాళం ఇచ్చారు’’.. సోమవారం అనేక వార్తా సంస్థలు ఇచ్చిన కథనం ఇది. అది గవర్నరు సొంత సొమ్మా? కాదు. రాజభవనానికి ప్రభుత్వం కేటాయించిన ప్రజా ధనమే అది. గవర్నర్ ‘విచక్షణ’ మేరకు ఖర్చు చేసే అవకాశం ఉన్న గ్రాంటు నుంచి రెండు కోట్ల రూపాయలు సహాయ నిధులకు కేటాయించారు. దాన్ని ‘విరాళం’గా పేర్కొంటూ స్వయంగా రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేయడం, పత్రికలూ అదే రాయడం అభ్యంతరకరం. కొంతమంది ఎంపీలు కూడా ప్రభుత్వం కేటాయించిన నిధులనుంచి ‘విరాళం’ ఇస్తున్నారు.
2020-03-30‘‘అందరూ కళ్లు మూసుకోండి. మీ పిల్లల కళ్ళు కూడా...’’ ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వలస కార్మికులను ఆదేశించారు ఓ ముగ్గురు వ్యక్తులు. వారు ‘కరోనా’ వైరస్ నుంచి రక్షణ కోసం ఫుల్ బాడీ సూట్లు వేసుకున్నారు. కూలీలు రోడ్డుపై గుంపుగా కూర్చున్నారు. మరు నిమిషంలో వారిపై రసాయనంతో కూడిన నీళ్ళు ధారాపాతంగా పడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో కార్మికులకు జరిగిన సామూహిక సంస్కారం ఇది. దీనిపై విమర్శలకు.. ‘‘అమానవీయంగా ప్రవర్తించడం మా అభిమతం కాదు. పెద్ద మొత్తంలో తిరిగి వస్తున్న ప్రజలను శుద్ధి చేయాల్సి ఉంది. మేము మెరుగైనదిగా భావించిన పని చేశాం’’ అని ఓ అధికారి బదులిచ్చారు.
2020-03-3021 రోజుల దిగ్బంధాన్ని పొడిగించే ఆలోచన ‘ప్రస్తుతానికి’ లేదని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14 వరకు ప్రకటించిన ‘లాక్ డౌన్’ను పొడిగించే అవకాశం ఉందన్న వార్తలపై స్పందిస్తూ ‘‘ఈ వార్తలు చూసి ఆశ్చర్యపోయా. లాక్ డౌన్ పొడిగించే ప్రణాళికేం లేదు’’ అని రాజీవ్ గౌబా చెప్పారు. లక్షల మంది వలస కార్మికులు రాష్ట్రాల సరిహద్దులు దాటి సొంత ప్రాంతాలకు తరలుతుండటమే ‘లాక్ డౌన్’ పొడిగింపు ఆలోచనకు కారణమని ఓ అధికారి చెప్పినట్టు ‘ద ప్రింట్’ పేర్కొంది. ‘లాక్ డౌన్’ 2 నెలలు ఉండాలని ‘కోవిడ్ 19’ టాస్క్ ఫోర్స్ లోని మరో అధికారి అభిప్రాయపడినట్టు కూడా ఆ వార్తా సంస్థ రాసింది.
2020-03-30ఉత్తరప్రదేశ్ షహరాన్ పూర్ లోని ఓ ఫ్యాక్టరీలో వకీల్, యాస్మిన్ దంపతులు పని చేస్తున్నారు. ప్రధానమంత్రి ‘లాక్ డౌన్’ ప్రకటించాక గదిని ఖాళీ చేయాలని యజమాని హుకుం జారీ చేశాడు. సొంత ఊరు వెళ్లడానికి డబ్బు కూడా ఇవ్వలేదు. గత్యంతరం లేక నిండు గర్బిణి తిండి లేకుండా ఎండలో నడిచింది. 100 కి.మీ. పైగా నడిచి ఓపిక లేని స్థితిలో మీరట్ లోని సోహ్రాబ్ గేటు బస్టాండ్ వద్ద ఆగింది. స్థానికులు గమనించి వారికి ఆహారం అందించారు. అక్కడి నుంచి బులంద్ షహర్ లోని వారి సొంత గ్రామం అమర్ గర్ వెళ్లడానికి కొంత డబ్బు ఇచ్చి ఆంబులెన్స్ ఏర్పాటు చేశారు. గుడ్డి దిగ్బంధంతో ఎండల్లో రోడ్డున పడిన లక్షలాది మందిలో యాస్మిన్ ఒకరు.
2020-03-30‘కరోనా వైరస్’పై ఆందోళన అసాధారణంగా, పర్యవసానాలు బహుముఖంగా ఉంటున్నాయి. జర్మనీ లోని హెస్సె రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ (54) ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నారు. వైరస్ వల్ల సంభవించే ఆర్థిక పతనాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఆయన తీవ్ర స్థాయిలో కలత చెందినట్టు ఆ రాష్ట్ర ప్రీమియర్ వోల్కర్ బౌఫియర్ చెప్పారు. శనివారం ఆయన భౌతిక కాయం ఒక రైల్వే ట్రాక్ పైన కనిపించింది. జర్మనీ ఆర్థిక రాజధాని ఫ్రాంక్ ఫర్ట్ నగరం ఈ రాష్ట్రంలోనే ఉంది. డ్యూయిష్ బ్యాంక్, కామర్జ్ బ్యాంక్ వంటి జర్మనీ దిగ్గజాలకు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుకు ఫ్రాంక్ ఫర్ట్ వేదిక.
2020-03-29‘కరోనా’పై పోరాటంలో భాగంగా అవసరమైన ప్రదేశాలకు మందులు, ఇతర వైద్య సామాగ్రిని రవాణా చేయడానికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం వినియోగించిన ఓ విమానం కూలిపోయింది. ఆదివారం సాయంత్రం మనీలా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయ్యే సమయంలోనే విమానం కూలినట్టు ప్రాథమిక సమాచారం. ఆర్.పి- సి5880 రిజిస్ట్రేషన్ తో ఉన్న వెస్ట్ విండ్ జెట్ విమానాన్ని ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ వినియోగించింది.
2020-03-29‘వుహాన్’ సముద్ర జీవుల మార్కెట్లో రొయ్యలు అమ్మే వెయ్ గుగ్జియాన్ (57) అనే మహిళను కరోనా వైరస్ ‘పేషెంట్ జీరో’గా వాల్ స్ట్రీట్ జర్నల్ గుర్తించినట్టు కథనాలు వచ్చాయి. డిసెంబర్ 10న ఆమెకు జలుబు చేయగా స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. తగ్గకపోవడంతో డిసెంబర్ 16న వుహాన్ యూనియన్ ఆసుపత్రిలో చేరారు. ఆమె అనారోగ్యం తీవ్రమైనదని, అలాంటి లక్షణాలతోనే మరికొందరు ఆ ఆసుపత్రికి వచ్చారని అక్కడి డాక్టర్లు చెప్పారు. అయితే, ఆమె ‘పేషెంట్ జీరో’ కాదని ప్రముఖ మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ అధ్యయనం చెబుతోంది. ‘కోవిడ్ 19’తో మొదటి కేసు డిసెంబర్ 1నే నమోదైందన్నది ‘లాన్సెట్’ కథనం.
2020-03-29‘కరోనా’ కట్టడికి తీసుకున్న చర్యలను ఏపీ ప్రభుత్వం క్రమంగా కఠినతరం చేస్తోంది. నిత్యావసరాల దుకాణాలు, రైతు బజార్లలో సరుకులు తీసుకునే సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో కుదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఆదేశించారు. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయా దుకాణాలకు, వాటికి వెళ్లే ప్రజలకు అనుమతి ఇస్తుండగా.. ఇకపైన పట్టణ ప్రాంతాల్లో 11 గంటల వరకే అనుమతి ఇవ్వనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా ఒంటి గంట వరకు వెళ్లవచ్చు. అధిక ధరలకు సరుకులు అమ్మితే జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి మరోసారి హెచ్చరించారు.
2020-03-29గత 24 గంటల్లో 6 రాష్ట్రాల్లో 106 ‘కరోనా’ కేసులు కొత్తగా నమోదయ్యాయని, ఆరుగురు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 979కి పెరిగిందని, 25 మంది మరణించారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. హై రిస్క్ కేసులను గుర్తిస్తున్నామని, ప్రస్తుతానికి తన వద్ద అందుకు సంబంధించిన సమాచారం లేదని అగర్వాల్ పేర్కొన్నారు. దేశంలో నిత్యావసరాల కొరత రాకుండా రైల్వే శాఖ గత ఐదు రోజుల్లో 1.25 లక్షల వ్యాగన్లలో ఆహార ధాన్యాలు, చక్కెర రవాణా చేసినట్టు ఆయన వివరించారు.
2020-03-29కఠినమైన ఆంక్షలతో సామాన్యుల కష్టాలకు కారణమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పారు. సరైన ప్రణాళిక లేకుండా దేశమంతా ‘లాక్ డౌన్’ ప్రకటించిన నేపథ్యంలో కోట్ల మంది ప్రజలు.. ముఖ్యంగా వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉపాధి కోల్పోయి ఆకలి బాధతో వందల కిలోమీటర్లు నడిచి సొంత ప్రదేశాలకు వెళ్తున్నారు. ఈ స్థితిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రధాని క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ‘ఈయనేం ప్రధాని’ అని కొంతమంది అంటారని, మరో ప్రత్యామ్నాయం లేకనే ‘దిగ్బంధం’ విధించానని మోడీ చెప్పారు. ఇది జీవన్మరణ పోరాటమని మోడీ పేర్కొన్నారు.
2020-03-29