‘కరోనా కేసులు’ ఇండియా కంటే తక్కువ నమోదైన రష్యాలో ఒక్కరూ చనిపోలేదు. కానీ, అక్కడి ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడంకోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మిస్తోంది. చైనా అంత కాదు గాని, వేగంగానే నిర్మాణం సాగుతోంది. మార్చి 10న ఆసుపత్రి నిర్మాణంపై మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకటన చేయగా.. ఇప్పుడు ఫౌండేషన్ల దశ దాటింది. 70 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 500 మంది పేషెంట్లకు అత్యాధునిక వసతులతో చికిత్స కోసం 30 భవనాలను నిర్మిస్తున్నారు. చిన్న పిల్లల కోసం ఓ యూనిట్ ఉంటుంది. ఇప్పటికే వైరస్ సోకిన కొంతమంది పేషెంట్లకు కూడా ఇటీవల నిర్మించిన మరో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
2020-03-22జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆమె ఇంట్లోనే ‘సెల్ఫ్ క్వారంటైన్’ లోకి వెళ్లారు. ఆమెను కలసినవారిలో ఓ డాక్టరుకు ‘కరోనా పాజిటివ్’ తేలడంతో అధ్యక్షురాలికి స్వీయ నిర్బంధం తప్పలేదు. ఈ విషయాన్ని మెర్కెల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ సీబెర్ట్ నిర్ధారించారు. శుక్రవారం తనను కలసిన డాక్టరుకు తర్వాత ‘కరోనా’ నిర్ధారణ అయినట్టు అధికారులు అధ్యక్షురాలికి సమాచారమిచ్చారు. స్వీయ నిర్బంధ కాలంలో అధ్యక్షురాలు ఇంటి నుంచే పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. జర్మనీలో ఆదివారం ఆంక్షలను తీవ్రతరం చేసింది. అయితే, పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయకుండా.. ఇద్దరికి మించి కలవడాన్ని నిషేధించింది.
2020-03-22‘కరోనా’ పెద్ద ప్రమాదకారి కాదనే వాదన నుంచి ‘లాక్ డౌన్’ వరకు వచ్చారు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి. మంచిదే..! అయితే, ‘కరోనా’ తీవ్రతను కొట్టిపారేసిన రోజు ఏ లెక్కలు చెప్పారో ‘లాక్ డౌన్’ రోజూ అవే చెప్పారు. వైరస్ సోకినవారిలో 80.9% మందికి ఇంట్లోనే నయమవుతోందని, కేవలం 4.7% మాత్రమే ఐసియులలో చేరితే..మరణాల రేటు 2% ఉందని చెప్పుకొచ్చారు. మరి వాస్తవం ఏమిటి? ఇటలీలో నిన్నటికి 53,578 మందికి వైరస్ సోకితే 4,825 మంది చనిపోయారు. అంటే, 9% ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లో 7.79%, స్పెయిన్ లో 6.02%, చైనాలో 4% మరణించారు. ప్రపంచ సగటు తీసుకుంటే మరణాల రేటు 4.3%.
2020-03-22‘కరోనా వైరస్’ కట్టడికోసం లాక్ డౌన్ ప్రకటించిన కేసీఆర్, ప్రైవేటు కంపెనీలకు ఓ హెచ్చరిక చేశారు. ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితుల్లో.. ఈ వారానికి కూడా వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోత ఉండదని, అలాగే ప్రైవేటు కంపెనీలు, సంస్థలు కూడా వేతనాన్ని చెల్లించాలని ఆదేశించారు. ఇది కంపెనీల సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఆసుపత్రులలో అత్యవసరం కాని సర్జరీలను వాయిదా వేయాలని, వైన్ షాపులను కూడా బంద్ చేయాలని ఆదేశించారు.
2020-03-22ఏపీలో ఇప్పటివరకు 6 ‘కరోనా’ కేసులు మాత్రమే నమోదయ్యాయని, అందులో ఒక బాధితుడు (నెల్లూరు) వ్యాధి నయమై ఇంటికి కూడా వెళ్లాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో పరిస్థితి మెరుగ్గా ఉండటానికి కారణం.. 2.5 లక్షల గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయడమేనని జగన్ చెప్పారు. సుమారు 11,670 మంది విదేశాల నుంచి వచ్చినట్టు ట్రాక్ చేశామని, వారిపై నిఘా పెట్టామని సిఎం పేర్కొన్నారు. భయపడాల్సిన అవసరం లేదంటూనే.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ వ్యాప్తి ఏ స్థితికి వెళ్తుందోనన్న భయాన్ని జగన్ వ్యక్తం చేశారు.
2020-03-22రేషన్ కార్డులపై బియ్యానికి తోడు ఒక కేజీ పప్పు కూడా ఈ నెల ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రేషన్ బియ్యాన్ని, పప్పును 29న అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ప్రస్తుతం మనిషికి 6 కేజీల బియ్యాన్ని ఇస్తున్నారు. ఇవి కాకుండా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి రూ. 1000 చొప్పున ఏప్రిల్ 4న వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని సిఎం చెప్పారు. ‘‘ఈ మొత్తం ఎక్కువ అని చెప్పను. కానీ, ఈ మాత్రం చేయడానికే రూ. 1500 కోట్లు ఖర్చవుతోంది. పరిస్థితులు గమనిస్తున్నారు కాబట్టి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
2020-03-22ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ‘లాక్ డౌన్’ ప్రకటించారు. ప్రజా రవాణా మొత్తాన్ని నిలిపివేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ప్రభుత్వ శాఖలను రొటేషన్ పద్ధతిలో తక్కువమందితోనే నడపాలని ఆదేశించారు. అత్యవసరం కాని షాపులు మార్చి 31 వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. మరీ అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు విన్నవించారు. తప్పనిసరి సేవలకోసం ఆటోలు తీయవలసి వస్తే.. ఇద్దరికంటే ఎక్కువమందిని ఎక్కించుకోవద్దని సూచించారు. విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజుల పాటు తప్పనిసరిగా ‘హోం క్వారంటైన్’లో ఉండాలని నిర్దేశించారు.
2020-03-22ఈ నెల 31 వరకు తెలంగాణ ‘లాక్ డౌన్’ ప్రకటించిన సిఎం కేసీఆర్, ప్రజలకు అవసరమైన నిత్యావసరాలకోసం ఒక ప్యాకేజీని ప్రకటించారు. రాష్ట్రంలోని 87.59 లక్షల కుటుంబాల్లో ఒక్కో మనిషికి 12 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఇతర సరుకులు కొనుగోలు చేయడంకోసం కుటుంబానికి రూ. 1500 చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారు. 3.36 లక్షల టన్నుల బియ్యానికి రూ. 1103 కోట్లు, సరుకులకోసం మరో రూ. 1314 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
2020-03-22ఈ నెల 31 వరకు తెలంగాణ ‘లాక్ డౌన్’ను ప్రకటించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ప్రభుత్వ శాఖల్లో వైద్యం, విద్యుత్ వంటి అత్యవసర విభాగాలలో అందరూ విధులకు హాజరు కావాలని, మిగిలిన శాఖల్లో 20 శాతం చొప్పున రొటేషన్ విధానం పాటిస్తామని చెప్పారు. ప్రజారవాణా మొత్తం నిలిపివేస్తున్నామని, ఆటోలతో సహా ప్రైవేటు వాహనాలు సైతం రోడ్లపైకి రాకూడదని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని, అత్యవసర సరుకులకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. పరీక్షా పత్రాలు దిద్దడంతో సహా విద్యా కార్యకలాపాలేవీ 31వరకు సాగవని చెప్పారు.
2020-03-22‘కరోనా వైరస్’పై పోరాటంలో భాగమైనవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం 5 గంటలకు ఎవరి ఇంటి వద్ద వారు చప్పట్లు కొట్టాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును చాలామంది బాగానే పాటించారు. అయితే, తెలంగాణ సిఎం కేసీఆర్ సకుటుంబ సపరివార సమేతంగా తన క్యాంపు కార్యాలయంలో చేరి చప్పట్లు కొట్టించారు. అంత కాకపోయినా కొద్ది తక్కువ గుంపుతో ఏపీ సీఎం జగన్ కూడా సామూహిక చప్పట్లే చరిచారు. సాయంత్రంవరకు ఇద్దరు సిఎంలూ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో శంఖం ఊదుతూ గంట మోగించిన తీరు ఎబ్బెట్టుగా ఉంది.
2020-03-22