విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఉచిత విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తూ.. దేశంలోని వలస కార్మికులనుంచి రైల్వే శాఖ చార్జీలు వసూలు చేయడంపై వెల్లువెత్తిన విమర్శలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వలస కార్మికుల ఛార్జీలో 85 శాతం రైల్వే శాఖ భరిస్తుందని, మిగిలిన 15 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని సోమవారం ఓ ప్రకటన చేసింది. విదేశాల నుంచి వచ్చేవారు విమాన ఛార్జీలను భరించాల్సి ఉంటుందంటూ మరో యు- టర్న్ తీసుకుంది. వలస కార్మికుల ఛార్జీలను కాంగ్రెస్ భరిస్తుందంటూ ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ప్రకటనతో బిజెపి కలవరపడింది.
2020-05-04‘3 వారాల ఉపశమన’ ఉత్తర్వులను రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్ణబ్ గోస్వామి దుర్వినియోగం చేస్తున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. తన టీవీ షోలలో దర్యాప్తు అధికారులను హేళన చేస్తూ బెదిరిస్తున్నారని, వికృత చేష్టలతో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సుప్రీంలో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది. తన పాత్రికేయ పరివారాన్ని పోలీసు స్టేషన్ కు పంపి.. చెప్పినట్టు చేయాలని ఆదేశిస్తున్నారని, అహంభావంతో నిండిన అతని ప్రవర్తన పోలీసు వ్యవస్థనే చులకన చేసేలా ఉందని నివేదించింది. అలాంటి చర్యలు మానుకోవలసిందిగా ఆదేశించాలని కోర్టుకు విన్నవించింది.
2020-05-04‘లాక్ డౌన్’ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులనుంచి రైల్వే శాఖ ఛార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా తప్పు పట్టారు. వలస కార్మికుల ప్రయాణ ఛార్జీలను కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని సోమవారం ప్రకటించారు. విదేశాల్లో చిక్కుకున్నవారికి ఉచిత విమానయానం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వానికి గుర్తుకొచ్చిన బాధ్యత, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల విషయంలో ఎందుకు లేదని సోనియా ప్రశ్నించారు. రైల్వే శాఖ ‘పిఎం కేర్స్’ నిధికి రూ. 150 కోట్లు ఇచ్చిందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ఒక్క ఈవెంట్ కు రూ. 100 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు.
2020-05-04కేరళలో ‘కరోనా’ రేఖ భూమార్గం పట్టింది. సోమవారం కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు. అదే సమయంలో 61 మంది కోలుకోవడంతో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 34కు తగ్గింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన 499 పాజిటివ్ కేసుల్లో ముగ్గురు మాత్రమే మరణించగా 462 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ బారినుంచి బయటపడినవారు 92.58 శాతం కాగా ఇంకా చికిత్స పొందుతున్నవారు కేవలం 6.81 శాతం. దేశంలో తొలి ‘కరోనా’ కేసు నమోదైంది కేరళలోనే అయినా.. అతి తక్కువ మరణాలతో అత్యంత సమర్ధవంతంగా కట్టడి చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
2020-05-04మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఏపీలో సోమవారం ఉదయం నుంచే ఊరూరా పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. దుకాణాలు తెరిచినందుకు సంతోషంతో మందు బాబులు బాణా సంచా కాల్చడం, చిందులు వేయడం వంటి దృశ్యాలు అక్కడక్కడా కనిపించాయి. కొన్ని చోట్ల మనిషికీ మనిషికీ మధ్య దూరం పాటించగా, చాలా చోట్ల ఆ కనీస జాగ్రత్త కూడా తీసుకోలేదు. రెడ్ జోన్లను మినహాయించి అన్నిచోట్లా మద్యం అమ్మకాలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం మద్యం రేట్లను భారీగా పెంచినా అలవాటుపడిన ప్రాణాలు ఏమాత్రం ఆగలేదు.
2020-05-04మత విద్వేషాన్ని రెచ్చగొట్టారన్న ఆరోపణలతో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్ణబ్ గోస్వామిపై ముంబైలో కేసు నమోదైంది. బాంద్రా స్టేషన్ వద్ద ఏప్రిల్ 14న వలస కార్మికులు చేపట్టిన నిరసనకు ఆర్ణబ్ మతం రంగు పులిమారని ఫిర్యాదుదారు అబుబకర్ షేక్ ఫిర్యాదు చేశారు. ఆ ఘటనతో సంబంధం లేని మసీదును లక్ష్యంగా చేసుకొని ముస్లింలపై ద్వేషాన్ని పెంచడానికి గోస్వామి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కార్మికులు గుమికూడితే.. మతానికి ఆపాదించారని విమర్శించారు. కేసు నమోదైందని, ఆ రోజు టీవీ ఫుటేజీని సేకరించామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
2020-05-03దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 8 లక్షల కోట్ల ఉద్ధీపన ప్యాకేజీ అవసరమని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అంచనా వేశారు. ముందే దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను ‘కరోనా’ మరింత దిగజార్చిందని స్వామి అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన ఉత్పత్తి నష్టం, కోల్పోయిన వేతనాలు, మరో ఏడాదిన్నర పాటు ఈ ప్రభావం ఉంటుందన్న అంచనాతో తాను ఈ లెక్క వేసినట్టు పేర్కొన్నారు. 2020 జూన్ 1 నుంచి 8 లక్షల కోట్ల ప్యాకేజీ అమలు చేయడం అవసరమని ‘ద సండే గార్డియన్’కు రాసిన వ్యాసంలో స్వామి అభిప్రాయపడ్డారు.
2020-05-03 Read Moreజమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూప్ సూద్, పోలీసు ఎస్ఐ షకీల్ ఖాజి, సైనికులు రాజేష్, దినేష్ మరణించారు. రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలోని హంద్వారా ప్రాంతంలో ఓ ఇంట్లోని పౌరులను ఉగ్రవాదులు నిర్బంధించినట్టు వచ్చిన సమాచారంతో... ఆర్మీ, జె&కె పోలీసులు సంయుక్త ఆపరేషన్ ను ప్రారంభించారు. పౌరులను విడిపించడానికి ఐదుగురితో కూడిన సంయుక్త బృందం టార్గెట్ ఏరియాలోకి ప్రవేశించింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పౌరులను కాపాడినట్టు అధికారులు ప్రకటించింది.
2020-05-03ఉభయ కొరియాల సరిహద్దులోని నిస్సైనిక ప్రదేశం (డిఎంజెడ్)లో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఉత్తరకొరియా వైపు నుంచి తమ గార్డులు ఉన్న పోస్టుపై కాల్పులు జరిగాయని, ప్రతిగా తమ సిబ్బంది రెండు రౌండ్లు కాల్చారని దక్షిణకొరియా సైనికాధికారులు చెప్పారు. దక్షిణకొరియా పోస్టులో ఉన్న గార్డు గాయపడినట్టు ‘యోన్హాప్’ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని ఆ దేశ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.
2020-05-03‘కరోనా’పై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది గౌరవార్ధం అమెరికా సైన్యం యుద్ధ విమానాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో విన్యాసాలు చేపట్టింది. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వరకు ప్రధాన నగరాల్లో ముఖ్యమైన ప్రదేశాలు, ఆసుపత్రులపై విహరించిన యుద్ధ విమానాలు.. వైద్య సిబ్బందికి వందనం సమర్పించాయి. తాజాగా వాషింగ్టన్ నగరంలో శ్వేతసౌథం దగ్గరగా విహరిస్తున్న అమెరికా నేవీ ‘బ్లూ ఏంజెల్స్’, ఎయిర్ ఫోర్స్ ‘థండర్ బర్డ్స్’ను ఈ చిత్రంలో చూడొచ్చు. #AmericaStrong #InThisTogether సందేశాలను మోస్తూ యుద్ధ విమానాలు దేశమంతా విహరించాయి.
2020-05-03