కేంద్ర ప్రభుత్వం కోల్ కత లోని విక్టోరియా మెమోరియల్ వద్ద నిర్వహించిన ‘పరాక్రమ దివస్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. మమత ప్రసంగం సమయంలో కొందరు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడంతో, ఆమె అవమానంగా భావించి నిరసన తెలిపారు. ఆహ్వానించి అవమానించొద్దంటూ.. ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని మమత గుర్తు చేశారు. అవమానానికి నిరసనంగా తాను ఈ కార్యక్రమంలో మాట్లాడబోనంటూ వేదిక దిగిపోయారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపైనే ఉన్నారు.
2021-01-23నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర మంత్రులు జరిపిన 11వ విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. చట్టాల అమలును తాత్కాలికంగా వాయిదా వేసి సవివరంగా చర్చిద్దామన్న ప్రభుత ప్రతిపాదనను తిరస్కరిస్తూ తమ వైఖరిని రైతులు శుక్రవారం పునరుద్ఘాటించారు. రైతుల స్థిర నిర్ణయం వెనుక బాహ్య శక్తుల ప్రమేయం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మళ్ళీ ఎప్పుడు కలవాలో నిర్ణయం తీసుకోకుండానే ఈ సమావేశాన్ని ముగించారు.
2021-01-22హైకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఎస్ఇసి స్పష్టం చేశారు. దీంతో తొలి దశ పోలింగ్ కు సంబంధించి శనివారమే నోటిఫికేషన్ వెలువడనుంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాలుగు దశల్లో ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో జరగనుంది. రెండో దశ నోటిఫికేషన్ 27న, మూడో దశకు సంబంధించి 31న, నాలుగో దశకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న వెలువడతాయి.
2021-01-21రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్.ఇ.సి) ఇచ్చిన షెడ్యూలును కొట్టివేస్తూ సింగిల్ జడ్జి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఎస్.ఇ.సి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పీలుపై గురువారం తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి తీర్పు ప్రాథమిక న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉందని, కరోనా వ్యాక్సిన్ పేరిట ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం సహేతుకం కాదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
2021-01-21దేశంలోపల అనాగరిక యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. దేశీయ ఉగ్రవాదాన్ని, శ్వేత జాత్యహంకారాన్ని ఓడిస్తానని ప్రతిజ్ఞ చేసిన బైడెన్, తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తానని ఉద్ఘాటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రసంగించారు. ఈరోజు తొలి మహిళ జాతీయ కార్యాలయ పదవికి ప్రమాణం చేస్తోందని, అందువల్ల మార్పులు రావని తనకు చెప్పవద్దని బైడెన్ పేర్కొన్నారు. ఐక్యత లేకపోతే శాంతి ఉండదని, ప్రపంచ వ్యాప్తంగా మిత్రులను పునరుద్ధరించుకుంటామని పేర్కొన్నారు.
2021-01-21అమెరికా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత-అమెరికా సంబంధాల బలోపేతానికి జో బైడెన్ తో కలసి పని చేస్తానని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. బైడెన్ పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించిన మోదీ, ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కోవడానికి, ప్రపంచ శాంతి-భద్రతల మెరుగుదలకు ఐక్యంగా ధృఢంగా ఉంటామని ట్వీటారు. ఇండియా- అమెరికా భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి బైడెన్ తో కలసి పని చేస్తామని మోదీ పేర్కొన్నారు.
2021-01-20కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రైతుల ఆందోళనకు దారి తీసిన అన్ని అంశాలపైనా ఈ కాలంలో చర్చించవచ్చని పేర్కొంది. చట్టాల రద్దుకోసం ఉద్యమించిన రైతు సంఘాలతో 10వ విడత చర్చల సందర్భంగా బుధవారం ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనిపై తాము మాట్లాడుకొని ఈ నెల 22న తిరిగి చర్చలకు వస్తామని రైతు నేతలు బదులిచ్చారు. మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్, 41 రైతు సంఘాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు.
2021-01-20ఇప్పటిదాకా అమెరికా విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన మైక్ పాంపియో సహా 28 మంది అమెరికన్ ప్రముఖులపై చైనా బుధవారం ఆంక్షలు విధించింది. వారు, వారి కుటుంబాలు, సన్నిహితులు చైనాలో ప్రవేశించడాన్ని, వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. నిషేధానికి గురైనవారిలో రాబర్ట్ ఒ బ్రియెన్, పీటర్ నవారో, స్టీవ్ బానన్ ఉన్నారు. తమ సార్వభౌమత్వాన్ని, భద్రతను తీవ్రంగా ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు చైనా పేర్కొంది. జో బైడెన్ ప్రమాణం చేసిన రోజే ట్రంప్ యంత్రాంగంలోని ప్రముఖులపై చైనా చర్యలు తీసుకోవడం గమనార్హం.
2021-01-20అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షునిగా డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ మద్ధతుదారుల ముట్టడితో దద్ధరిల్లిన ప్రతినిధుల సభ భవనం కేపిటోల్ ఎదుట అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘జో’తో పాటు నూతన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణం చేశారు. పదవీ కాలం ముగిసిన డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన హయాంలో ఉపాధ్యక్షునిగా పనిచేసిన మైక్ పెన్స్ మాత్రం భార్యాసమేతంగా నూతన అధ్యక్షుని పదవీ స్వీకార ప్రమాణానికి హాజరయ్యారు.
2021-01-20కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకోసం పోరాడుతున్న రైతు నేతల్లో ఒకరైన బల్ దేవ్ సింగ్ సిర్సాతో పాటు 40 మందికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) సమన్లు జారీ చేసింది. సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జె) సంస్థకు సంబంధించిన ఒక కేసులో ఆదివారం ఉదయం హాజరు కావాలని తనకు ఎన్ఐఎ రాసిన లేఖను పంజాబీ నటుడు దీప్ సిద్ధు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘‘నేను దర్యాప్తు చేస్తున్న కేసులోని వాస్తవాలు, పరిస్థితులు మీకు తెలిసినట్టు కనిపిస్తోంది..’’ అని ఇన్స్పెక్టర్ ధీరజ్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు.
2021-01-16