‘కరోనా వైరస్’ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పైనా తీవ్ర ప్రభావాన్నే చూపింది. మార్చి 15-17 తేదీల్లో బెంగళూరులో తలపెట్టిన అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్)ను ఆర్ఎస్ఎస్ రద్దు చేసుకున్నట్టు తాజా సమాచారం. అత్యున్నత నిర్ణాయక సభ అయిన ఎబిపిఎస్ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు ఏటా జరుగుతుంది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, కర్నాటకలో ఒకరు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రతినిధినీ పరీక్షించాకే సభకు అనుమతించాలని తొలుత భావించారు. కొద్ది గంటల ముందు రద్దు నిర్ణయం తీసుకున్నారు.
2020-03-14‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఫెడరల్ ప్రభుత్వ పూర్తి అధికారాలను ఉపయోగించడానికి ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్టు శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. వచ్చే ఎనిమిది వారాలు చాలా కీలకమైనవన్న ట్రంప్, ‘కరోనా’పై పోరాటానికి వీలుగా 50 బిలియన్ డాలర్ల నిధుల వినియోగానికి నియంత్రణలను తొలగించారు. అమెరికాలో ‘కరోనా’ కేసుల సంఖ్య 3 వేలకు చేరగా 50 మంది మరణించారు.
2020-03-14మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (64) ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. సామాజిక సేవకు అధిక సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని కంపెనీ శుక్రవారం (శాన్ ఫ్రాన్సిస్కో సమయం) ప్రకటించింది. బిల్ గేట్స్ 2000 సంవత్సరంలోనే సీఈవో పోస్టు నుంచి వైదొలిగి స్టీవ్ బామర్ కు బాధ్యతలు అప్పగించారు. 2014లో సత్య నాదెళ్ళ సీఈవో అయిన సమయంలో బోర్డు డైరెక్టర్ల ఛైర్మన్ బాధ్యతల నుంచీ తప్పుకున్నారు. 13 సంవత్సరాల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రారంభించిన బిల్, ‘మైక్రోసాఫ్ట్’తో ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడిగా ఎదిగారు.
2020-03-14కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఎ, డిఆర్ లను నాలుగు శాతం పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అధక్షతన సమావేశమైన మంత్రివర్గం, 2020 జనవరి 1 నుంచి రావలసిన డిఎపై నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు డిఎ, పెన్షనర్లకు డిఆర్ ఇదివరకు 17 శాతం ఉండగా ఇప్పుడు మరో నాలుగు శాతం పెరుగుతోంది. దీనివల్ల ఖజానాపై ఏడాదికి రూ. 12,510 కోట్ల మేరకు భారం పడుతుందని అంచనా. 48.34 లక్షల ఉద్యోగులు, 65.26 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం తెలిపింది.
2020-03-13కరోనా భయం సుప్రీంకోర్టునూ వెన్నాడింది. అత్యవసర స్వభావం ఉన్న కేసులనే విచారణకు చేపట్టాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. శుక్రవారం సుప్రీంకోర్టు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. సోమవారం (మార్చి 16న) కేవలం ఆరు ధర్మాసనాలు పని చేయనున్నాయి. వాటిలో 1. అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా, 2. ఉదయ్ ఉమేష్ లలిత్, వినీత్ శరన్, 3. ఎఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, 4. డివై చంద్రచూడ్, హేమంత్ గుప్తా, 5. ఎల్. నాగేశ్వరావు, ఎస్. రవీంద్ర భట్, 6. సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా ఉన్నారు. సవరించిన కారణాల జాబితాను 14న వెల్లడిస్తారు.
2020-03-13 Read Moreబ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు ‘కరోనా వైరస్’ సోకినట్టు ఓ సంచలన వార్త కొద్ది గంటలుగా ప్రపంచమంతా వ్యాపించింది. అయితే, పరీక్షలలో బొల్సొనారోకు ‘కరోనా నెగెటివ్’ ఫలితం వచ్చినట్టు స్పష్టమైంది. కొద్ది రోజుల క్రితమే బొల్సొనారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత బొల్సొనారో మీడియా కార్యదర్శికి ‘కరోనా’ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వార్త రావడంతో చాలామంది నిజమేనని భావించారు. బ్రెజిల్ అధ్యక్షుడితో చేయి చేయి కలిపి దగ్గరగా మాట్లాడిన ట్రంప్ విషయంలో కంగారు మొదలైంది.
2020-03-13అధికార పార్టీ నేతల అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలి చర్య తీసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఒక రోజు (మార్చి 15న) ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈ నెల 8న పెద్దారెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీలో చీరలు పంచిపెట్టినట్టు ఫిర్యాదులు వచ్చాయి. పట్టణంలోని శ్రీరాములుపేటలో క్షేత్ర స్థాయి విచారణ తర్వాత ఒక రోజు నిషేధాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.
2020-03-13ఇండియాలో ‘కరోనా వైరస్’తో మరో మరణం శుక్రవారం సంభవించింది. ఢిల్లీలో 69 సంవత్సరాల మహిళ కరోనాతో మరణించినట్టు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు కూడా తాజాగా నిర్ధారించారు. శుక్రవారం దేశంలో ‘కరోనా’ కేసుల సంఖ్య 81కి చేరింది. మంగళవారం మరణించిన కర్నాటకకు చెందిన 76 ఏళ్ళ వ్యక్తికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
2020-03-13‘కరోనా’ ప్రభావంతో మూతపడుతున్న సంస్థల జాబితాలో ఏకంగా కెనడా పార్లమెంటు చేరింది. మార్చి విరామం తర్వాత కనీసం 5 వారాల పాటు పార్లమెంటును సస్పెండ్ చేయనున్నారు. పార్లమెంటు సస్పెన్షన్లో ఉన్న కాలంలో అవసరమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తూ ఓ అంగీకారానికి వచ్చినట్టు ప్రధాన ప్రతిపక్ష విప్ మార్క్ స్ట్రాల్ చెప్పారు. దేశ ప్రథమ మహిళ సోఫీ గ్రెగోయిర్ ట్రూడోకు ‘కరోనా’ సోకిన నేపథ్యంలో.. ప్రధాని కూడా రెండు వారాల పాటు జనంలో కలవకూడదని నిర్ణయించుకున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 140కి పెరిగింది.
2020-03-13 Read More‘కరోనా వైరస్’పై పోరాటానికి ‘సార్క్’ దేశాలు బలమైన వ్యూహన్ని రూపొందించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుదామని ప్రతిపాదించారు. పెద్ద మొత్తంలో జనాభా ఉన్న దక్షిణాసియాలో ప్రజారోగ్యానికి భరోసా ఇచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదలకూడదని మోడీ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘సార్క్’ దేశాలు ఉమ్మడిగా ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలవాలని, ఆరోగ్యకరమైన భూగోళానికి దోహదం చేయాలని మోడీ అభిప్రాయపడ్డారు.
2020-03-13