గత చంద్రబాబు మంత్రివర్గంలో సీనియర్ మోస్ట్ యనమల రామకృష్ణుడిని దేశంలోనే అత్యంత అసమర్ద ఆర్థిక మంత్రిగా అభివర్ణించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘‘దేశంలోనే అత్యంత అసమర్థ ఆర్థిక మంత్రిగా యనమల గారు రికార్డులకెక్కారు. అధిక వడ్డీ ఆశ చూపి దొరికిన చోటల్లా అప్పు చేసి బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీ కంటే దారుణంగా ఆర్థిక నిర్వహణ సాగింది ఆయన హయాంలో. అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులు చెబుతున్నారు’’ అని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
2019-10-21అమెరికా ‘‘స్పేస్ ఫోర్స్’’ త్వరలో వాస్తవరూపం దాల్చబోతోందని ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. సోమవారం వాషింగ్టన్ లో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ (ఐఎసి) 2019’లో మైక్ పెన్స్ మాట్లాడారు. అంతకు ముందు ఆయన అంతరిక్ష పరిశోధనపై మాట్లాడారు. ఒక తరానికి పైగా మానవ అంతరిక్ష పరిశోధన అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కుంటుపడిందని పెన్స్ వ్యాఖ్యానించారు. ట్రంప్ నాయకత్వంలో దార్శనికతతో మానవాళిని విస్తారమైన అంతరిక్షంలోకి నడిపిస్తామని చెప్పుకొచ్చారు.
2019-10-22అవసరమైతే టర్కీపై మిలిటరీ చర్య తీసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘పూర్తి సన్నద్ధత’’తో ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. సోమవారం ఆయన సి.ఎన్.బి.సి.తో మాట్లాడుతూ ఆయన ఈ సంచలనం రేపారు. ‘‘యుద్ధం కంటే శాంతికి మేము ప్రాధాన్యత ఇస్తాం. అయితే, మిలిటరీ చర్యే అవసరమైన పరిస్థితి వస్తే అధ్యక్షుడు ట్రంప్ ఆ చర్యకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని మీరు తెలుసుకోవాలి’’ అని పాంపియో చెప్పారు.
2019-10-22గ్రామ వాలంటీర్ల పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వేలకోట్లు దోచిపెడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘‘4 లక్షల మందికి రూ. 8000 అంటే మొత్తం రూ. 8,400 కోట్లు. ఎవడబ్బ సొమ్మని మీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు?’’ అని శ్రీకాకుళం పార్టీ సమావేశంలో సిఎంను ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నాపత్రం టైపు చేసిన అమ్మాయికే ర్యాంకు వస్తుందని, ఒకే ఇంట్లో ర్యాంకులు వస్తాయని ఎద్దేవా చేశారు.
2019-10-21మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి మట్టం పెరగడంతో తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని వదిలారు. శ్రీరాంసాగర్ నుంచి దిగువకు నీరు వదలడం మూడేళ్ళలో ఇదే మొదటిసారి. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అముదుర, గైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్టులు నిండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు భారీగా వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా ఆదివారం రాత్రికి రిజర్వాయర్ నిండింది. దీంతో తొలుత 8 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
2019-10-21తెలంగాణలోని హుజుర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 50 శాతానికి పైగా ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుస్తారని ‘ఆరా’ సంస్థ అంచనా వేయగా, 53 శాతం ఓట్లతో గెలుస్తారని ‘మిషన్ చాణక్య’ తెలిపింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీడీపీ అభ్యర్ధిగా చావా కిరణ్మయి, బీజేపీ అభ్యర్ధిగా కోట రామారావు పోటీ చేశారు. 24న ఫలితాలు వెలువడనున్నాయి.
2019-10-21తమ పార్టీ నేతలు దాడులకు గురవుతుంటే చర్యలు తీసుకోవలసిన డీజీపీ, తామే మీడియా షో చేస్తున్నామని వ్యాఖ్యానించడం ఏమిటని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ‘‘పోలీసు అమరవీరుల దినోత్సవాన మాట్లాడకూడదనుకున్నా. కానీ, ఆయన (డీజీపీ) ఏం మాట్లాడాడు? మనది మీడియా షో అంటాడు. ఇంతమంది చనిపోయి, బాధలు పడుతుంటే మళ్లీ మాపైనే దాడులు చేస్తారా? పత్రికలపై కేసులు పెట్టమంటారా? సోషల్ మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
2019-10-21ఇ.వి.ఎం.ల వాడకంపై ఎన్నో అనుమానాలు, విమర్శలు, వ్యతిరేకత మధ్య మహారాష్ట్రలో ఓ బీఎస్పీ నేత అనూహ్య రీతిలో నిరసన తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సోమవారం థానేలో తన ఓటు హక్కును వినియోగించుకునే పేరిట పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించిన బీఎస్పీ నేత సునీల్ ఖాంబే, అక్కడ ఉన్న ఇ.వి.ఎం. సెట్ పైన ఇంకు చల్లారు. వెంటనే ‘‘ఈవీఎం ముర్దాబాద్’’, ‘‘ఈవీఎం నహీ చలేగా’’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
2019-10-21ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు మంగళవారం 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. సుమారు 2 లక్షల బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. విలీన విధానంతోపాటు డిపాజిట్ల రేట్లు తగ్గింపు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఇఎఫ్ఐ) సమ్మెకు పిలుపునిచ్చాయి.
2019-10-21చంద్రబాబు సంస్కారహీనుడు కావడంవల్లనే లోకేష్ మతిలేని మనిషిలా తయారయ్యాడని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. లోకేష్ మతి లేనివాడనే మంగళగిరి ప్రజలు ఓడించి ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మోపిదేవి, టీడీపీ సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు అసందర్భ ప్రేలాపనలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని మోపిదేవి ధ్వమజెత్తారు.
2019-10-21