2008 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, జెయుడి చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ లోని లాహోర్ యాంటీ టెర్రరిస్టు కోర్టు (ఎటిసి) ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో నమోదైన రెండు కేసుల్లో ఐదున్నరేళ్ల చొప్పున సయాద్ కు శిక్ష పడింది. అయితే, రెండు శిక్షలనూ ఏక కాలంలో అమలు చేయాలని తీర్పు చెప్పడంతో సయీద్ కు ఊరట లభించింది.
2020-02-12ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈ నెల 23న భారత్ బంద్ నిర్వహించాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఆజాద్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను కోర్టును గౌరవిస్తా. కానీ, కోర్టు ఈ కేసులో తప్పు చేసింది.. ప్రభుత్వం ఇవ్వకపోతే రిజర్వేషన్లు కోరలేమని కోర్టు చెప్పింది. మమ్మల్ని ప్రభుత్వ దయకు వదిలేసింది. దీన్ని అంగీకరించబోం. ఇవి మా ప్రాథమిక హక్కులు. ఎలా తీసుకోవాలో మాకు తెలుసు’’ అని ఉద్ఘాటించారు.
2020-02-12ఖమ్మం జిల్లాలో బుధవారం ఓ హృదయం విదారక దృశ్యం కంటతడి పెట్టించింది. ఓ గర్భిణిని చిద్రం చేసిన లారీ... ఆమె గర్భంలోని శిశువును రోడ్డుపైకి ఈడ్చిన ఘోరమైన దృశ్యం అది. పెనుబల్లి ఆసుపత్రిలో పరీక్ష చేయించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న దంపతుల ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీకొంది. నిండు గర్భిణిని లారీ తొక్కేసింది. దీంతో శిశువు బయటపడిపోయింది. తల్లి శవానికి కొద్ది మీటర్ల దూరంలో పడిన శిశువు కూడా మరణించింది.
2020-02-12పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినవారిని ఉద్ధేశించి.. కాల్చి చంపాలన్న నినాదం ఇచ్చిన బిజెపి నేత కపిల్ మిశ్రా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. మిశ్రా ఢిల్లీలోని ‘మోడల్ టౌన్’ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. మంగళవారం వెల్లడైన ఫలితాలు ఆయనకు షాకిచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి అఖిలేష్ పతి త్రిపాఠి చేతిలో మిశ్రా 11,237 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ‘‘దానర్ధం.. ప్రజలకు చేరువ అవ్వడంలో మేము ఎక్కడో విఫలమయ్యాం’’ అని ఓటమి తర్వాత మిశ్రా వ్యాఖ్యానించాడు.
2020-02-12మార్చి 15 లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేవారు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తామని, గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష పడేలా చర్యలు ఉంటాయని మంత్రి చెప్పారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి 8న ప్రారంభించి మార్చి 3లోగా ముగిస్తామని ప్రభుత్వం గత నెలలో హైకోర్టుకు నివేదించింది.
2020-02-12శాసనసభ బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా పరిపాలనను అమరావతి నుంచి విశాఖపట్నానికి మార్చే అవకాశం ఉందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పరిపాలన ఎక్కడినుంచి సాగించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయాధికారమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం మంత్రివర్గ సమావేశం తర్వాత పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వివిధ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి అభిప్రాయపడ్డారు.
2020-02-12రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సమయం కేటాయించిన ప్రధాని, వివిధ అంశాలపై విన్నపాలను సావధానంగా విన్నట్లు సమాచారం. విభజన హామీల అమలు, పోలవరం పెండింగ్ నిధుల విడుదలకు విన్నవించిన జగన్.. రాష్ట్రంలో శాసన మండలి రద్దు, రాజధాని తరలింపు వంటి రాజకీయ అంశాలపైనా కేంద్రం మద్ధతు కోరినట్లు చెబుతున్నారు.
2020-02-12నూతన ఎమ్మెల్యే నరేష్ యాదవ్ గుడి నుంచి తిరిగి ఓపెన్ టాప్ కారులో వస్తున్నప్పుడు... గుర్తు తెలియని దుండగులు మరో కారులోనుంచి కాల్పులు జరిపినట్టు ‘ఆప్’ సోషల్ మీడియా ఇన్చార్జ్ అంకిత్ లాల్ తెలిపారు. ఆ సమయంలో పోలీసులు స్పాట్ లోనే ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, దుండగులు ఏడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. తాను ఉన్న కారుపైనే దాడి చేశారని ఎమ్మెల్యే యాదవ్ చెప్పారు.
2020-02-12గెలిచిన ఉత్సాహంలో ఓపెన్ టాప్ కారులో ఇంటికి వెళ్తున్న ఢిల్లీ ‘ఆప్’ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్ పైన నిన్న అర్దరాత్రి కాల్పులు జరిగాయి. అయితే, ఎమ్మెల్యే లక్ష్యంగా కాల్పులు జరగలేదని ఢిల్లీ సౌత్ వెస్ట్ అదనపు డిసిపి ప్రతాప్ సింగ్ చెబుతున్నారు. కాల్పులలో చనిపోయిన ‘ఆప్’ కార్యకర్త అశోక్ మాన్ దుండగుడి అసలు లక్ష్యమని ఆయన తేల్చేశారు. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఆధారంగా దాడి చేసింది ఒక్క వ్యక్తేనని తేలినట్టు చెప్పారు. కాన్వాయ్ లో ఉన్న ‘ఆప్’ నేతల కథనం ఇందుకు భిన్నంగా ఉంది.
2020-02-12రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్ర లేదని హోం శాఖ మంగళవారం స్పష్టం చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది. ఒక రాష్ట్ర రాజధానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం కుండబద్ధలు కొట్టింది. కేశినేని వేసిన ఐదు ప్రశ్నలకు సూటిగా రెండు వాక్యాల్లోనే సమాధానం చెప్పింది. జార్ఖండ్, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ రాజధానుల ఎంపిక వివరాలను కేశినేని కోరగా, ఆ అంశంపై కేంద్రం బదులివ్వలేదు.
2020-02-12