మహారాష్ట్ర అసెంబ్లీలో 16మందికి కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ సోకినట్టు నిర్థారణ అయింది. వారిలో అసెంబ్లీలో పని చేసే సిబ్బంది, పోలీసులు ఉన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభ్యులతో పాటు 2,300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 35 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. వారిలో 16 మందికి ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకినట్టు బుధవారం నిర్థారించారు. అయితే, ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని, కొందరిలో ఏ లక్షణాలూ కనిపించలేదని ఓ డాక్టర్ చెప్పారు.
2021-12-29ఆంధ్రప్రదేశ్ మందు బాబులకు బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రంలో కోటి మంది మందు తాగుతున్నారని, వారంతా వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేసి గెలిపిస్తే చీప్ లిక్కర్ ను రూ. 70కే సరఫరా చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చారు. అంతే కాదు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే రూ. 50కే ఇస్తామని కూడా ఆయన ఉద్ఘాటించారు. జగన్ ప్రభుత్వంపై ‘ప్రజా ఆగ్రహ సభ’ పేరిట విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వీర్రాజు ఈ హామీ ఇచ్చారు.
2021-12-28ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) పథకానికి సంబంధించి 10వ వాయిదా డబ్బు జనవరి 1న విడుదల కానుంది. 10 కోట్లకు పైగా లబ్దిదారులకు (రైతు కుటుంబాలకు) రూ. 20,000 కోట్లకు పైగా మొత్తాన్ని పిఎం నరేంద్ర మోదీ బదిలీ చేస్తారని ఆయన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకంలో అర్హులైన రైతులకు కేంద్రం ఏటా రూ. 6000 మొత్తాన్ని మూడు వాయిదాల్లో విడుదల చేస్తోంది. గత 9 విడతల్లో ఇప్పటివరకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.
2021-12-29జనవరి 6న యుఎఇ వెళ్ళాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని విదేశీ పర్యటన వాయిదా పడింది. ఇండియాలో రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యుఎఇలో సోమవారం 1,732 కేసులు నమోదయ్యాయి. అరబ్ ఎమిరేట్స్ లో భాగమైన అబుదాబి.. దేశంలోకి ప్రవేశంపై ఆంక్షలు విధించింది.
2021-12-29ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో జనవరి 10 నుంచి 12 వరకు జరగనున్న Vibrant Gujarat పెట్టుబడుల సదస్సుకు రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ హాజరు కానున్నారు. ఆ దేశ తూర్పు, ఆర్కిటిక్ ప్రాంతాల అభివృద్ధి విభాగం మంత్రి అలెక్సి చెకున్కోవ్, ఫార్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన నలుగురు గవర్నర్లు కూడా ఇండియా రానున్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచీ నిర్వహిస్తున్న Vibrant Gujarat సదస్సుకు ప్రధానిగా కూడా మోదీ అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.
2021-12-29జనాభాలో తొలి స్థానంలో ఉన్న చైనా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయంలోనూ మిగిలిన పెద్ద దేశాలకంటే చాలా ముందుంది. దేశంలోని 127.4 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయినట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. అంటే, 85.64 శాతం జనాభాకు వ్యాక్సిన్ కోర్సు పూర్తయింది. అదే సమయంలో ఇండియాలో 58.59 కోట్ల మందికి (42.5% జనాభాకు) రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు 60.9 శాతం.
2021-12-29సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రోజుల పాటు జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో చివరి రోజైన బుధవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మాజీ ఎంఎల్ఎ గఫూర్, సీనియర్ నేతలు వై. వెంకటేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు, వి. ఉమామహేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, డి. రమాదేవి, మంతెన సీతారాం, వి. కృష్ణయ్య, దడాల సుబ్బారావు, బి. తులసీదాస్ సహా 50 మంది నూతన కమిటీలో ఉన్నారు.
2021-12-29వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ను కలిశారు. నర్సాపురంలో తాను భగవత్ ను కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు. భగవత్ మార్గదర్శక వాక్కులు వినే గొప్ప అవకాశం లభించిందని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు. మోహన్ భగవత్ పశ్చిమ గోదావరి జిల్లాలో ‘గోదావరి సంగమం’ పేరిట జరిగిన ఆర్ఎస్ఎస్ సభలకు హాజరయ్యారు. ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో రైలులో ఎంపీ కలిశారు.
2021-12-27జనవరి 3నుంచి కరోనా టీకా వేయించుకునే 15-18 సంవత్సరాల వయసు పిల్లలకు అందుబాటులో ఉండేది ఒకే ఒక్క వ్యాక్సిన్. అది భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అత్యవసర వినియోగ జాబితాలోని కోవాగ్జిన్ మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉంటుంది. పెద్దలకు ఇప్పటివరకు ఇచ్చిన వ్యాక్సిన్లలో ప్రధానంగా ‘కోవిషీల్డ్’, ‘కోవాగ్జిన్’ ఉన్న విషయం తెలిసిందే. అధిక భాగం పెద్దలకు కోవిషీల్డ్ ఇచ్చారు.
2021-12-27నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలలో తెలంగాణ పురోగమనంతో 4వ ర్యాంకు నుంచి 3కు ఎగబాకింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగింది. "హెల్తీ స్టేట్స్- ప్రోగ్రెసివ్ ఇండియా" పేరిట రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య సూచీల నివేదిక(2019-20)ని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ స్కోరు (69.95)ను తెలంగాణ (69.96) అతి స్వల్ప తేడాతో అధిగమించింది. 3, 4 రౌండ్ల మధ్య తెలంగాణ స్కోరు 4.22 పాయింట్లు పెరగడమే ఇందుకు కారణం.
2021-12-27