కేంద్ర వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులు మీడియా పాత్రపైనా మండిపడుతున్నారు. జాతీయ మీడియాగా చెప్పుకునే కొన్ని ఆంగ్ల, హిందీ ఛానళ్లు రైతు ఉద్యమాన్ని కవర్ చేస్తున్న తీరుపై సామాజిక మాథ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ సర్కారు భజన మీడియాగా పేరు పొందిన రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, జీ న్యూస్, ఆజ్ తక్ వంటి సంస్థలను ‘గోడీ మీడియా’గా అభివర్ణిస్తూ రైతులు ఉద్యమ స్థలంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఆయా ఛానళ్ల విలేకరులతో మాట్లాడటంలేదు. ట్విట్టర్లో #kisanvirodhimedia వంటి హ్యాష్ ట్యాగ్ లు వైరల్ అవుతున్నాయి.
2020-12-03అమెరికాలో మరోసారి కరోనా మరణ మృదంగం మోగుతోంది. బుధవారం ఏకంగా 3,157 మరణాలు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ ట్రాకర్ ప్రకారం రోజువారీ మరణాల నమోదులో ఇదే అత్యధికం. ఇంతకు ముందు ఏప్రిల్ 15న నమోదైన 2,609 మరణాల కంటే ఇది 20 శాతం అధికం. రోజువారీ వైరస్ పాజిటివ్ కేసులు 2 లక్షలు దాటడం ఇది రెండోసారి. గత శుక్రవారం 2,05,557 లక్షల కేసులు నమోదు కాగా, ఈ బుధవారం అంతకంటే కొద్దిగా తక్కువగా 2,00,070 కేసులు నమోదయ్యాయి. ‘థ్యాంక్స్ గివింగ్’ సెలవుల తర్వాత కరోనా మరోసారి విజృంభించింది.
2020-12-03ఇండియాలో కరోనా వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య 95 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ తాజా సమాచారం ప్రకారం.. బుధవారానికి పాజిటివ్ కేసుల సంఖ్య 95,34,964కు, మృతుల సంఖ్య 1,38,648కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 6,46,15,624 మంది కరోనా బారిన పడగా 14,95,311 మంది చనిపోయారు. అత్యధికంగా 1,39,25,354 కేసులు.. 2,73,847 మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇండియాది రెండో స్థానం. ఇండియాతో సహా అనేక దేశాల్లో 2, 3 దశల్లో కరోపా వ్యాపిస్తున్నందున కేసులు, మరణాల సంఖ్య మరింతగా పెరగనుంది.
2020-12-03ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికివాళ్లని కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి బిసి పాటిల్ వ్యాఖ్యానించారు. గురువారం కొడగు జిల్లా పొన్నంపేటలో రైతులను ఉద్ధేశించి మాట్లాడుతూ, ‘‘ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికివారు. కేవలం ఒక పిరికివాడు మాత్రమే తన భార్య, పిల్లలను సంరక్షించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మనం (నీళ్లలో) పడిపోతే, ఈదాలి.. గెలవాలి’’ అని పాటిల్ ఉద్ఘాటించారు. వ్యవసాయ వ్యాపారం ఎంత లాభదాయకమో వెదురు రైతులకు వివరించిన మంత్రి, కొంతమంది ఇది అర్ధం చేసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.
2020-12-03దేశంలోకెల్లా అత్యధికంగా మహిళా జడ్జిలను కలిగిన మద్రాసు హైకోర్టు ఆ రికార్డును నిలబెట్టుకుంది. గురువారం ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది జడ్జిలలో నలుగురు మహిళలే కావడం విశేషం. వీరితో కలిపి మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 13కి పెరిగింది. ఈ హైకోర్టుకు మంజూరైన జడ్జి పోస్టులు 75కి గాను గురువారంతో 64 భర్తీ అయ్యాయి. మహిళా జడ్జిల వాటా 20 శాతానికి కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇది గొప్పగా లేకపోయినా దేశంలోని ఇతర హైకోర్టులలో ఈమాత్రం కూడా లేరన్నది చేదు నిజం. గురువారం ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఓ జంట ఉండటం మరో విశేషం.
2020-12-03‘లవ్ జిహాద్’ పేరిట మత మార్పిడులపై ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చేసిన చట్టాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ చట్టాల రాజ్యాంగబద్ధతను ఢిల్లీ అడ్వకేట్లు విశాల్ థాకరే, అభయ్ సింగ్ యాదవ్, ప్రణ్వేష్ సవాలు చేశారు. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికే భంగకరంగా ఉన్నందున ఆ చట్టాలు చెల్లుబాటు కావని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులలో మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాల హక్కులు కూడా భాగమని వారు ఉద్ఘాటించారు.
2020-12-03క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులను జీవిత కాలం పాటు నిషేధించాలన్న విన్నపాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈమేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. బిజెపికే చెందిన అడ్వకేట్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ 2017లో దాఖలు చేసిన పిటిషన్ కు స్పందనగా కేంద్ర ప్రభుత్వం తాజా అఫిడవిట్ సమర్పించింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలలో పని చేసే ఎవరికైనా క్రిమినల్ కేసుల్లో శిక్ష పడితే వారిని జీవిత కాలానికి నిషేధించాలని అశ్వినీకుమార్ తన విన్నపంలో కోరారు.
2020-12-03వ్యవసాయ చట్టాలు, ఇతర సమస్యలపై చర్చల కోసం వెళ్లిన రైతులు కేంద్ర మంత్రులతో కలసి భోజనం చేయడానికి నిరాకరించారు. తమ ఆహారం తాము తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో కూడా మంత్రులు ఆఫర్ చేసిన టీ తాగడానికి రైతు ప్రతినిధులు నిరాకరించారు. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన తీవ్రతరం చేశారు. వారిని మంత్రులు చర్చలకు పిలవడం ఈ వారంలో ఇది రెండోసారి.
2020-12-03‘‘తమిళనాడు రాతను మార్చే సమయం వచ్చింది. రాజకీయ మార్పు అనివార్యం. ఇప్పుడు అత్యంత అవసరం కూడా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ రాదు’’- తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ డైలాగ్ ఇది. గురువారం చెన్నైలోని పోయస్ గార్డెన్ నివాసంలో ఆయన తన రాజకీయ రంగప్రవేశంపై ఓ ప్రకటన చేశారు. పార్టీ పని ఇప్పటికే ప్రారంభమైందనన్న రజినీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ‘‘నా జీవితాన్ని తమిళ ప్రజలకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. నేను రాజకీయాల్లోకి వచ్చాక గెలిచినా ఓడినా అదంతా ప్రజలకే చెందుతుంది.’’ అని ఉద్ఘాటించారు.
2020-12-03డిసెంబర్ 31న పార్టీని ప్రకటించి, జనవరిలో ప్రారంభించనున్నట్టు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం వెల్లడించారు. ఈ ప్రకటనతో సంవత్సరాల గుంజాటనకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టినట్టే. తన రాజకీయ రంగ ప్రవేశంపై 2017 నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటన చేసిన రజినీకాంత్, అప్పటి నుంచి ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు సరిగ్గా 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించబోతున్నారు.
2020-12-03