రాష్ట్రంలో 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 30 లక్షలకు పైగా ఉన్న విద్యార్ధులు నిత్యం పాఠశాలలకు రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాక్షించారు. అందుకోసం కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తాగునీరు, ఫర్నిచర్, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఫ్యాన్లు, సరిహద్దు గోడల వంటి సదుపాయాలు కల్పించాలని పాఠశాల విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో.. మధ్యాహ్న భోజన పథకంతోపాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపైనా సమీక్ష నిర్వహించారు.
2019-05-31కేంద్ర సాయుధ బలగాల పిల్లలకు స్కాలర్ షిప్ ఇచ్చే పథకాన్ని.. మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రాల పోలీసుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్ణయించారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్ నుంచి నెలవారీగా ఇచ్చే మొత్తాన్ని బాలురకు రూ. 2,000 నుంచి రూ. 2,500కు, బాలికలకు రూ. 2,250 నుంచి రూ. 3,000కు పెంచాలని నిర్ణయించారు. ఈ పథకంలో మార్పులకు ఆమోదించడమే తన ప్రభుత్వ మొదటి నిర్ణయమని మోదీ ప్రకటించారు.
2019-05-31ఏపీలో మధ్యాహ్న భోజన పథకంలో భాగమైన ఏజన్సీలకు నెలకు రూ. 1000 చొప్పున ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 3,000కు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అక్షయపాత్ర సరఫరా చేసే భోజనాన్ని విద్యార్ధులకు వడ్డించేందుకు వారి సేవలను వినియోగించుకుందామని జగన్ సూచించారు. ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్న భోజన పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
2019-05-31మధ్యాహ్న భోజన పథకానికి తన తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టారు కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇకపైన మధ్యాహ్న భోజన పథకం ‘‘వైఎస్ఆర్ అక్షయపాత్ర’’ పేరుతో నడవనుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మధ్యాహ్న భోజనంపైనే తొలి సమీక్షా సమావేశాన్ని శుక్రవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యా శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని జగన్ స్పష్టం చేశారు.
2019-05-31రాష్ట్రంలోని 23 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లు సమానంగా తేలాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అరకు, నర్సాపురం లోక్ సభ స్థానాల పరిధిలోని రెండు పోలింగ్ స్టేషన్లలో మాత్రం 503 ఓట్ల తేడా కనిపించిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ సియు, వీవీ ప్యాట్.. రెండూ పని చేయకపోవడంవల్ల లెక్కింపు సాధ్యం కాలేదని, మెజారిటీలు భారీగా ఉన్న కారణంగా ఈసీ సూచనమేరకు ఫలితాలు ప్రకటించామని వివరించారు.
2019-05-31పార్లమెంటు పూర్తి బడ్జెట్ సమావేశాలు జూన్ 17 నుంచి జూలై 26వ తేదీవరకు జరిగే అవకాశం ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ను గత ఫిబ్రవరి 1వ తేదీన అప్పటి ఇన్ఛార్జి మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టగా... పూర్తి బడ్జెట్ ను జూలై 5న కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని సమాచారం. నరేంద్రమోదీ నాయకత్వంలో రెండో ప్రభుత్వం కొలువుదీరగానే శుక్రవారం తొలి కేబినెట్ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల తేదీలపై ఈ సమావేశంలో చర్చించారు.
2019-05-31ఇంతకు ముందు ప్రభుత్వం వెల్లడించడానికి, అంగీకరించడానికి నిరాకరించిన నిరుద్యోగ సమాచారం శుక్రవారం అధికారికంగానే వెల్లడైంది. దాని ప్రకారం 2017-18 నిరుద్యోగం రేటు 6.1 శాతంగా ఉంది. గత 45 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 7.8 శాతం యువత నిరుద్యోగులే. మోదీ 2.0 మొదటి మంత్రివర్గ సమావేశం జరిగిన రోజే కార్మిక శాఖ డేటా విడుదలైంది. నిరుద్యోగం రేటు గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం.. పురుషుల్లో 6.2 శాతం ఉండగా, మహిళల్లో 5.7 శాతం నిరుద్యోగులు.
2019-05-31 Read Moreకొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే కీలక స్థానాల్లో గత ప్రభుత్వం నియమించిన అధికారుల తొలగింపు శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగా ప్రొటోకాల్ విభాగపు డైరెక్టర్ ఎం. అశోక్ బాబు డిప్యుటేషన్ ను కుదించి మాతృ విభాగమైన కేంద్ర రక్షణ శాఖకు తిప్పి పంపుతున్నారు. ఈమేరకు జీవో ఆర్.టి. నెంబర్ 1202ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అశోక్ బాబును డిప్యుటేషన్ పై రెండేళ్ళ కాలానికి 2015 మే 13న నియమించింది. తర్వాత మరో రెండేళ్ళు (2020 మే 12వరకు) డిప్యుటేషన్ పొడిగించారు.
2019-05-31వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశమైన ఇండియా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటులో గత ఆర్థిక సంవత్సరం వెనుకబడింది. శుక్రవారం విడుదలైన సమాచారం ప్రకారం..గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇండియా జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.8 శాతం. ఇది చైనా (6.4శాతం) కంటే తక్కువ. చైనా జీడీపీ వృద్ధి రేటు మందగించిన తర్వాత ‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశం’’గా ఇండియాకు ఖ్యాతి దక్కింది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నేపథ్యంలో వృద్ధి రేటు ఒడిదుడుకులకు లోనైంది.
2019-05-31కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూన్ 8వ తేదీన సచివాలయానికి రానున్నారు. జగన్ ప్రవేశానికి 8వ తేదీ ఉదయం 8.39 గంటలకు ముహూర్తం ఖరారైంది. అప్పటిదాకా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను జగన్ సాగిస్తారు. శుక్రవారమే సమీక్షలకు శ్రీకారం చుట్టారు. జగన్ వెళ్లేలోగా సచివాలయానికి వాస్తుపరంగా మార్పులు చేయనున్నారు. సిఎం ఛాంబర్ ను కూడా తీర్చిదిద్దనున్నారు.
2019-05-31