తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పని చేసింది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో విజయతీరానికి చేరగా అధికార బి.ఆర్.ఎస్. 39 సీట్ల వద్ద ఆగిపోయింది. మూడో శక్తి అనుకున్న బి.జె.పి. 8 సీట్లకు పరిమితం కాగా, ఎంఐఎం తన 7 సీట్లను నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ ఒక స్థానాన్ని పొందింది. కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు రాగా, బి.ఆర్.ఎస్. 37.35%, బి.జె.పి. 13.90% ఓట్లను సాధించాయి. బి.ఆర్.ఎస్. గత ఎన్నికలతో పోలిస్తే 9.5% ఓట్లను కోల్పోగా కాంగ్రెస్ ఓట్లు 11% పెరిగాయి. బిజెపి ఓట్లు 6.92% శాతం పెరిగితే, ఎంఐఎం ఓట్లు 2.7% నుంచి 2.21%కి తగ్గాయి.
2023-12-03తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ ఎన్నికల సభలో మాట్లాడిన మోదీ, ఈ ఎన్నికలతో బిఆర్ఎస్ ఆట ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. బిజెపి తరఫున తొలి ముఖ్యమంత్రి ఒక బి.సి. నేత అవుతారని మోదీ మరోసారి చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో కెసిఆర్ కు ట్రైలర్ చూపించామని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిఆర్ఎస్ కు వేసినట్టేనని మోదీ పేర్కొన్నారు.
2023-11-27ఉచిత పథకాలను ఈసడించుకూనే బిజెపి అగ్ర నేతలు తెలంగాణ ఎన్నికల్లో వాటినే ఆశ్రయిస్తున్నారు. శనివారం వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహిళలకు పలు ఉచితాలను ప్రకటించారు. అమ్మాయి పుట్టిన సందర్భంలో రూ. 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఉజ్జ్వల యోజన కింద ఏటా 4 ఉచిత సిలిండర్లు, మహిళా స్వయం సహాయక బృందాలకు 1% వడ్డీ రేటుపై రుణాలు షా ఇచ్చిన హామీలలో ఉన్నాయి.
2023-11-18కుటుంబ పార్టీలు బలహీనవర్గాలను, దళిత, ఆదివాసీ, మైనారిటీలను ఎదగనివ్వవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయా వర్గాలను పట్టించుకోలేదంటూ... బిజెపి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసిందని, తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని ఉద్ఘాటించారు. బి.ఆర్.ఎస్. బీసీ విరోధి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. సొంత బిడ్డల కోసమే పని చేస్తాయన్నారు. మంగళవారం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. బిజెపిలో 85 మంది బీసీ ఎంపిలు, 365 మంది బీసీ శాసనసభ్యులు ఉన్నారని మోదీ చెప్పారు.
2023-11-07తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ విరమించుకుంది. కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్టు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం ప్రకటించారు. ‘‘మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదు’’ అని పార్టీ కార్యకర్తలకు ఆమె సందేశమిచ్చారు. పాలేరు నుంచి తాను పోటీ చేయాలనుకున్నానని, అయితే 2013లో తాను పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం కలసి తిరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారని గుర్తు చేస్తూ... ‘‘నన్నేం చేయమంటారు? పొంగులేటిని ఓడించమంటారా.. నన్ను ఓడిపొమ్మంటారా?’’ అని పాలేరు ప్రజలను ఆమె ప్రశ్నించారు.
2023-11-03తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ విజయయాత్ర ప్రారంభమవుతుందని... చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీని కూడా గెలుచుకుంటామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పాలమూరు ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.ను, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడిద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిని నిర్ణయించే అవకాశం బి.జె.పి.కి రాదని పేర్కొన్నారు.
2023-11-01ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. బుధవారం సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘‘మోదీకి ఒక పిచ్చి ఉన్నది. అంతా ప్రైవేటీకరణే...! రైల్వేలు, విమానాశ్రయాలూ ప్రైవేటుకే. అదే పిచ్చిలో కరెంటు రంగం కూడా ప్రైవేటీకరణకు పెట్టారు.’’ అని విమర్శించారు. తాము ప్రభుత్వ రంగంలో విద్యుత్ ప్రాజెక్టులు చేపడుతుంటే మోదీ కోపగించుకున్నాడని, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టకపోతే నిధులు రావని హెచ్చరించాడని కె.సి.ఆర్. ఆరోపించారు. ‘‘మీటర్లు పెట్టమంటే నేను చచ్చినా పెట్టనన్నా... నేను బతికుండగా మీటర్లు రానివ్వనన్నా’’ అని చెప్పారు.
2023-11-01ఉత్తర భారత దేశంలో దళితులపై దాడులు జరగని రోజు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. బుధవారం సత్తుపల్లి ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో విపరీతంగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ‘‘ఇది ప్రజాస్వామ్య దేశమా... అరాచకమా?’’ అని కె.సి.ఆర్. ప్రశ్నించారు. దళితుల వెనుకబాటును ఉద్యమ సమయంలోనే గుర్తించి చైతన్య వేదిక ఏర్పాటు చేశానని, అదే స్ఫూర్తితో ఇప్పుడు దళిత బంధు పథకాన్ని ప్రారంభించానని సిఎం చెప్పారు.
2023-11-01తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 9వ తేదీన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారని ఆయన తనయుడు, మంత్రి కె.టి. రామారావు వెల్లడించారు. బుధవారం కామారెడ్డిలో జరిగిన ఎన్నికల సభలో కె.టి.ఆర్. మాట్లాడారు. బిజెపికి ఓట్లు వేసి వృధా చేసుకోవద్దని ప్రజలకు విన్నవించారు. బిజెపి వాళ్ళు డబ్బు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం కారు గుర్తుపైనే వేయాలని సూచించారు. ‘‘గుజరాత్ దొంగ పైసలు ఇస్తే బ్రహ్మాండంగా గుంజుకోండి. అవి మనలను దోచుకొని తెచ్చుకున్న పైసలే’’ అని కె.టి.ఆర్. వ్యాఖ్యానించారు.
2023-11-01కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రానికి డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం హుజూర్ నగర్ ‘‘ప్రజా ఆశీర్వాద’’ సభలో ప్రసంగించారు. ఆ డజను మందిలో ప్రతి ఒక్కరూ ‘‘నన్ను గెలిపించండి. నేను ముఖ్యమంత్రి అవుతా’’ అంటారని, అయితే కాంగ్రెస్ పార్టీనే గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయనని శపథం చేశారంటూ, ‘‘ఆయన తీస్తే ఎంత తీయకపోతే ఎంత’’ అని ఎద్దేవా చేశారు.
2023-10-31