కేరళలోని ఎర్నాకుళం సాధారణ ఆసుపత్రి తొలిసారిగా ఒక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారి అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కేరళ మరో మైలురాయిని అధిగమించిందన్న సి.ఎం, ఈ విశేష క్రియ వెనుక ఉన్న బృందానికి అభినందనలు తెలిపారు.

2023-11-26

47 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపై పరిశోధన కోసం రష్యా ప్రయోగించిన ‘లూనా-25’ విఫలమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫీగా దిగడానికి నిర్దేశించిన కక్ష్య నుంచి లూనా అంతరిక్ష వాహనం అనూహ్యమైన మలుపు తీసుకుందని, ఫలితంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్ కాస్మోస్’ ఓ ప్రకటనలో తెలిపింది. లూనా వైఫల్యంతో ఇప్పుడు అందరి దృష్టి ‘చంద్రయాన్ 3’పైనే కేంద్రీకృతమైంది. చంద్రయాన్ 3 లాండర్ కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దిగవలసి ఉంది.

2023-08-20

అమెరికా జాతీయ వైద్య సంస్థలతో కలసి పనిచేసిన వుహాన్ వైరాలజీ సంస్థ (చైనా) శాస్త్రవేత్తలపై ప్రముఖ అమెరికన్ సైంటిస్టు ఆంథొని ఫాసి ప్రశంసలు కురిపించారు. వారిని ‘‘అర్హతగల, అత్యంత గౌరవనీయులైన చైనా శాస్త్రవేత్తలు’’గా పేర్కొన్నారు. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్ పైన పరిశోధన కోసం వుహాన్ వైరాలజీ సంస్థకు నిధులు సమకూర్చడాన్ని సమర్థించుకున్నారు. చైనాలోని వుహాన్ లేబొరేటరీ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందని కొంతమంది అమెరికన్ రాజకీయ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఫాసి పునరుద్ఘాటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

2021-07-24

బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తన కంపెనీ ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష విమానం ‘యూనిటీ 22’లో కొద్దిసేపు అంతరిక్ష విహారం చేశారు. ప్రైవేటు జెట్ సైజులో ఉన్న ఈ అంతరిక్ష విమానంలో ఆదివారం సాయంత్రం భూ ఉపకక్ష్య లోకి వెళ్లినవారిలో తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. విమానం శబ్దవేగానికి మూడు రెట్ల వేగాన్ని అందుకొని 53.5 మైళ్ల ఎత్తుకు చేరిందని కంపెనీ ప్రకటించింది. అక్కడ అంతా మూడు నిమిషాల పాటు భారరహిత స్థితిని ఆస్వాదించారు. ఇద్దరు పైలట్లు విమానాన్ని నడపగా బ్రాన్సన్, శిరీష సహా నలుగురు ప్రయాణించారు.

2021-07-11

ప్రపంచ టెక్నాలజీ-ఇ.కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ‘‘అమెజాన్.కామ్’’ అధిపతి జెఫ్ బెజోస్ (57) కంపెనీ సి.ఇ.ఒ. బాధ్యతల నుంచి వైదొలిగారు. 27 సంవత్సరాల క్రితం కేవలం ఆన్ లైన్ లో పుస్తకాల అమ్మకంతో ప్రారంభమైన అమెజాన్ నేటి మార్కెట్ విలువ ఒకటిన్నర ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. జెఫ్ బెజోస్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అంతే కాదు... 200 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువ కలిగిన తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కాడు. సి.ఇ.ఒ.గా తప్పుకున్నప్పటికీ, ఎగ్జిక్యూటివ్ ఛైర్ గా బెజోస్ కీలకంగా కొనసాగనున్నారు.

2021-07-04

చైనా రూపొందించిన ‘కృత్రిమ సూర్యుడు’ తొలిసారిగా విజయవంతంగా పని చేశాడు. అణు విద్యుత్ పరిశోధనా సామర్ధ్యంలో గొప్ప ముందడుగా భావిస్తున్న న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ హెచ్ఎల్-2ఎం టొకమాక్ ను చైనా గత ఏడాది రూపొందించింది. దీన్నే ‘కృత్రిమ సూర్యుడు’గా వ్యవహరిస్తున్నారు. ఇది చైనాలో అతిపెద్ద రియాక్టర్, అత్యాధునిక న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగాత్మక పరికరం. 150 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చేరుకొని ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదు. అంటే, సూర్యుడి కేంద్రకంలో ఉండే ఉష్ణోగ్రత కంటే 10 రెట్లు అధికం.

2020-12-05

‘టైమ్’ మ్యాగజైన్ తొలిసారిగా వెల్లడించిన ‘ఈ ఏటి మేటి బాల’గా భారతీయ అమెరికన్ బాలిక గీతాంజలిరావు ఎంపికయ్యారు. 15 ఏళ్ళ అంజలిని తెలివైన యువ శాస్త్రవేత్తగా ‘టైమ్’ కీర్తించింది. కలుషితమైన తాగునీరు, ఒపియాయిడ్ వ్యసనం, సైబర్ వేధింపుల వంటి అనేక అంశాలను ఎదుర్కోవడానికి సాంకేతికతను ఉపయోగించడంలో అంజలి అద్బుతమైన కృషి చేశారని పేర్కొంది. 5000 మంది నామినీలను పరిశీలించాక గీతాంజలీరావును ఎంపిక చేశారు. గీతాంజలిని ‘టైమ్’ కోసం హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలి ఇంటర్వ్యూ చేయడం మరో విశేషం.

2020-12-03

చంద్రుడిపైన మట్టి-రాళ్ల నమూనాలను సేకరించిన చైనా వ్యోమనౌక గురువారం రాత్రి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ రోజు చంద్రుడిపైనుంచి పైకి లేచిన ఈ నౌక ఆ ఉపగ్రహం చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్-రిటర్నర్ ను చేరాక భూమివైపు ప్రయాణం మొదలవుతుంది. ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ లతో కూడిన చాంగె-5ను చైనా గత నెల 24న ప్రయోగించింది. ల్యాండర్-అసెండర్ ద్వయం ఈ నెల 1న చంద్రుడిపైన మాన్స్ రంకెర్ ప్రాంతపు ఉత్తర భాగంలో దిగి నిన్న నమూనాలను సేకరించి కంటైనర్ లో భద్రపరిచాయి.

2020-12-03

కరోనాను నిరోధించడంలో తమ టీకా 94.5 శాతం ప్రభావవంతమైనదని ప్రయోగాల్లో రుజువైనట్టు అమెరికా కంపెనీ ‘మోడెర్నా’ సోమవారం ప్రకటించింది. తుది దశ ప్రయోగాల డేటా ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టు కంపెనీ పేర్కొంది. ఇంతకు ముందే మరో అమెరికా కంపెనీ ఫైజర్ తమ టీకా 90 శాతం పైగా ప్రభావవంతమైనదని ప్రకటించింది. అయితే, ఫైజర్ టీకా నిల్వకు -70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం కాగా.. మోడెర్నా టీకాకు 30 రోజుల పాటు సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత, ఆ తర్వాత ఆర్నెల్ల వరకు -20 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతాయని కంపెనీ చెబుతోంది.

2020-11-16

విశ్వాంతరాళాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం అంగలు చాస్తున్న మానవుడికి ఇప్పటికీ తన శరీరంలోనే తెలియని అవయవాలున్నాయంటే ఆశ్చర్యమే. అలాంటి ఒక అజ్ఞాత అవయవాన్ని నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మనిషి గొంతు ఎగువ భాగంలో ముక్కుకు వెనుకగా లోతుగా ఉన్న లాలాజల గ్రంథుల సమూహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు వాటికి ‘గొట్టపు లాలాజల గ్రంథులు’గా నామకరణం చేశారు. ‘ప్రొస్టేట్ క్యాన్సర్’పై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ అవయవం కనిపించినప్పుడు ఆశ్చర్యపోయారు. 100 మంది రోగులను క్షుణ్ణంగా పరిశీలించాక నిర్ధారణకు వచ్చారు.

2020-10-21
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 Last Page