మైక్రోసాఫ్ట్ విండోస్-7 ఆపరేటింగ్ వ్యవస్థ జీవిత కాలం ఈ రోజుతో ముగిసింది. ‘జనవరి 14 తర్వాత విండోస్-7కు సంబంధించిన సమస్యలు, సాఫ్ట్ వేర్ నవీకరణ, సెక్యూరిటీ అప్ డేట్స్ వంటి ఏ విషయంలోనూ సాంకేతిక మద్ధతును మైక్రోసాఫ్ట్ ఇవ్వబోదు’’ అని కంపెనీ ప్రకటించింది. విండోస్-7లో కొత్త ఫీచర్లను జోడించడం 2015లోనే ఆపేశారు. విండోస్-10 వ్యవస్థను 100 కోట్ల కంప్యూటర్లలో చూడాలన్న లక్ష్యానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.
2020-01-14‘నిర్భయ’ నిందితుల్లో ఇద్దరి క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తీహార్ జైలులో ఉన్న నలుగురిని జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరి తీసేలా ఢిల్లీ కోర్టు ఈ నెల 7న డెత్ వారంట్ జారీ చేసింది. నిందితుల్లో ఇద్దరు.. వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ సింగ్.. మరణి శిక్ష అమలుపై స్టే కోరుతూ క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. మరణ శిక్ష మార్చడానికి చట్టబద్ధంగా ఉన్న చివరి అవకాశం ‘క్యూరేటివ్ పిటిషన్’. ఇక ‘రాష్ట్రపతి క్షమాబిక్ష’ పెడితే తప్ప 22న ఉరి తప్పదు.
2020-01-14ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఉద్ఘాటించారు. మంగళవారం తుళ్లూరు గ్రామంలో నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించిన రాధ, ఉద్యమానికి మద్ధతు తెలిపారు. ఎక్కడ (అసెంబ్లీలో) ప్రమాణం చేశారో ఆ జిల్లా ప్రజలకే అన్యాయం చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్ధేశించి రాధ వ్యాఖ్యానించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం రైతుల నాయకత్వంలో జరుగుతోందని, వారు ఆదేశించిన విధంగా తాము పని చేస్తామని రాధ చెప్పారు.
2020-01-14పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తొలి రాష్ట్రం కేరళ. తాజాగా ఆ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిఎఎను రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని పినరయి విజయన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. సిఎఎ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ)లను ఉల్లంఘించిందని కేరళ పిటిషన్లో పేర్కొంది.
2020-01-14ఇండియా ఇటీవల చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవాస భారతీయ టెక్ దిగ్గజం సత్య నాదెళ్ల తప్పు పట్టారు. సోమవారం ఆయన ‘బజ్ ఫీడ్’తో మాట్లాడుతూ సిఎఎ చెడ్డదని, జరుగుతున్న పరిణామాలు విచారకరమని వ్యాఖ్యానించారు. తన కెరీర్ లో టెక్నాలజీ, వలస ప్రాధాన్యతపై సత్య మాట్లాడారు. ’’నేను అమెరికా వచ్చి మైక్రోసాఫ్ట్ సీఈవో అయినట్టే... ఓ బంగ్లాదేశీ వలసదారు ఇండియాలో ఓ పెద్ద స్టార్టప్ ఏర్పాటు చేసినా లేక ఇన్ఫోసిస్ వంటి కంపెనీ సీఈవో అయినా చూసి సంతోషిస్తా’’ అని సత్య పేర్కొన్నారు.
2020-01-14అమరావతి ఉద్యమంలో పాల్గొన్నవారి పాస్ పోర్టులు రద్దవుతాయనే బెదిరింపులు సామాజిక మాథ్యమాల్లోనూ, వార్తలు మీడియాలోనూ దర్శనమిచ్చాయి. ఈ ప్రచారం విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం వరకు చేరడంతో స్పష్టమైన ప్రకటన వెలువడింది. ఆందోళనకారుల పాస్ పోర్టులు రద్దు చేసే చర్య ఏదీ తీసుకోలేదని ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి డి.ఎస్.ఎస్. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పాస్ పోర్టుల చట్టం, నిబంధనల ప్రకారమే రద్దు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
2020-01-14జి.ఎన్.రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు సిఫారసులను భోగి మంటల్లో వేయాలని పిలుపునిచ్చిన రాజధాని పరిరక్షణ సమితి, మంగళవారం విజయవాడలో లాంఛనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. వేకువ జామున బెంజి సర్కిల్ జెఎసి కార్యాలయంలో భోగి మంట వేసి ఆయా కమిటీల సిఫారసు ప్రతులను అందులో కాల్చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జెఎసి కన్వీనర్ ఆళ్ళ శివారెడ్డి, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, ఎంపి కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు.
2020-01-14ఆర్థిక మాంద్యంతో దేశంలో ఉద్యోగాలకు భారీగా కోత పడుతోంది. 2018-19లో కంటే ఈ ఏడాది కొత్త ఉద్యోగాల సంఖ్య 16 లక్షలు తగ్గుతోందని ఎస్.బి.ఐ. రిసెర్చ్ సోమవారం తెలిపింది. ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ) గణాంకాల ప్రకారం గత ఏడాది 89.7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది. ఇ.పి.ఎఫ్.ఒ. డేటా ప్రధానంగా... నెల జీతం రూ. 15,000 మించని ఉద్యోగాలను చూపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, ఎన్.పి.ఎస్. పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగాలు ఈ డేటాలో ఉండవు.
2020-01-13 Read Moreఢిల్లీలో వాయు కాలుష్యం చాలా సహజమైన అంశంగా మారింది. కొద్ది దూరంలో ఉన్న మనుషులు, వాహనాలు కనిపించక ప్రమాదాలు జరగడమూ చూశాం. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో మాదిరే సోమవారం కూడా విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. 18 విమానాలను రద్దు చేసినట్టు ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు సోమవారం వెల్లడించారు.
2020-01-13రిటైల్ ధరల సూచీ అమాంతం 7.35 శాతానికి పెరగడంలో ప్రధాన పాత్ర కూరగాయలదేనని జాతీయ గణాంక సంస్థ పేర్కొంది. 2018 డిసెంబరుతో పోలిస్తే 2019 డిసెంబరులో కూరగాయల విభాగంలో ద్రవ్యోల్భణం 60.5 శాతం పెరిగింది. అందులో ప్రధానంగా ఉల్లిపాయల వాటా ఎక్కువ. గత నెలలో ఉల్లి ధర రూ. 100 దాటిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం ఆహార విభాగంలో ద్రవ్యోల్భణం మార్పు 2018 డిసెంబరులో మైనస్ 2.65 శాతం కాగా, గత డిసెంబరులో 14.12 శాతం పెరిగింది.
2020-01-13