అంతర్జాతీయ పేటెంట్ దరఖాస్తులలో ఇండియా వెనుకబడింది. 2018లో 2007 దరఖాస్తులతో 13వ స్థానంలో ఉన్న ఇండియా, 2019లో 2053 దరఖాస్తులతో 14వ స్థానానికి తగ్గింది. దరఖాస్తులు స్వల్పంగా పెరిగినా ఓ ర్యాంకు కోల్పోవడానికి ప్రధాన కారణం.. టర్కీ సాధించిన ప్రగతి. 2018లో 1403 దరఖాస్తులతో 20వ స్థానంలో ఉన్న టర్కీ 2019లో 2058 దరఖాస్తులతో ఏకంగా 7 స్థానాలు ఎగబాకింది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యు.ఐ.పి.ఒ) తాజా నివేదిక మంగళవారం విడుదలైంది. పేటెంట్ దరఖాస్తుల్లో టాప్ 13 దేశాల్లో ర్యాంకులను కోల్పోయింది అమెరికా, ఇండియా మాత్రమే.
2020-04-07అంతర్జాతీయ పేటెంట్ల రేసులో అగ్రరాజ్యం అమెరికాను అధిగమించింది చైనా. 2019లో చైనా అగ్రస్థానానికి చేరినట్టు ఐరాస పేటెంట్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది. చైనా నుంచి 58,990 పేటెంట్ దరఖాస్తులు దాఖలు కాగా అమెరికా నుంచి 57,840 దాఖలైనట్టు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యు.ఐ.పి.ఒ) తెలిపింది. గత 20 ఏళ్లలో చైనా పేటెంట్ల సంఖ్య 200 రెట్లు పెరిగిందని ఈ సంస్థ పేర్కొంది. 1978లో పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ వ్యవస్థ ఉనికిలోకి వచ్చాక.. ప్రతి ఏటా అమెరికాదే ఆధిపత్యం. గత ఏడాది 3, 4, 5 స్థానాల్లో జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా ఉన్నాయి.
2020-04-07దేశవ్యాప్తంగా 22,567 సహాయ శిబిరాలు ఉంటే 15,541 (68.86%) కేరళ ప్రభుత్వం నడుపుతున్నవేనని, సహాయ నిధిలో మాత్రం కేవలం 1.4 శాతం కేటాయించిందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు సిపిఎం నేత సీతారాం ఏచూరి. కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలోని గణాంకాలనే ఏచూరి మంగళవారం వెల్లడించారు. దేశం మొత్తంగా సహాయ శిబిరాల్లో 6,31,119 మంది ఉండగా, ఒక్క కేరళలోనే 3,02,016 మంది (47.9%) ఉన్నారని వివరించారు. అన్ని రాష్ట్రాలకు రూ. 11,092 కేటాయించిన కేంద్రం కేరళకు ఇచ్చింది కేవలం రూ. 157 కోట్లు (1.4%) అని ఆక్షేపించారు. ‘‘మోడీ ప్రభుత్వం వద్ద ఏమైనా సమాధానాలున్నాయా?’’ అని ఏచూరి ప్రశ్నించారు.
2020-04-07ఇండియాలో ‘కరోనా’ బాధితుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. మంగళవారం ఆ రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 1000 దాటింది (1018). ఒక్క ముంబయి నగరంలోనే 590 కేసులు నమోదయ్యాయి. ‘మహా’రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్క రోజే 150 కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ‘కరోనా’ సోకినవారి సంఖ్య మంగళవారం 4,789కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో 353 మంది కోలుకోగా 124 మంది మరణించారని పేర్కొంది. ప్రభుత్వ లెక్క ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లోనే 508 కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి.
2020-04-07‘‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినా ప్రధాని నరేంద్ర మోడీ తిరస్కరించారు’- నిన్న జరిగిన ఈ ప్రచారంలో కేసీఆర్ వంటి నేతలూ భాగమయ్యారు. వాస్తవం వేరు. ఎగుమతులకు అనుమతించకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయన్న అమెరికా అధ్యక్షుడి బెదిరింపుతో నరేంద్ర మోడీ వెనక్కు తగ్గారు. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు మంగళవారం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘కరోనా’ నిరోధానికి ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ను సిఫారసు చేసిన ట్రంప్.. మాత్రలను పంపాలని మోడీని కోరారు. లేకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేసినట్టు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఫలితమే నిషేధం ఎత్తివేత.
2020-04-07‘కరోనా’ లక్షణాలు తీవరించడంతో యు.కె. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ను ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’కు తరలించారు. కొద్ది రోజుల క్రితం వైరస్ నిర్ధారణ అయినా ఇంట్లోనే ‘స్వీయ నిర్బంధం’లో ఉన్నారు జాన్సన్. వైరస్ తగ్గకపోగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆదివారం లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం వైరస్ ప్రభావం తీవ్రమై ఆరోగ్యంలో క్షీణత కనిపించడంతో రాత్రి 7 గంటలకు (బ్రిటిష్ కాలమానం) ఐసియుకు మార్చారు. అవసరమైన చోట తన డిప్యూటీగా వ్యవహరించాలని విదేశాంగ కార్యదర్శికి జాన్సన్ సూచించారు.
2020-04-07సోమవారం రాత్రి 9 గంటల సమయానికి దేశంలో 1,01,068 మందికి ‘కరోనా’ టెస్టులు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. అంటే.. దేశ జనాభాలోని ప్రతి 13,726 మందిలో ఒక్కరిని పరీక్షించారు. వారిలో 4,135 మందికి ‘కరోనా’ నిర్ధారణ అయింది. సోమవారం ఒక్క రోజే 11,432 నమూనాలను పరీక్షించగా 311 మందికి ‘కరోనా’ నిర్ధారణ అయిందని ఐసిఎంఆర్ తెలిపింది. యూరోపియన్ దేశాలు, కొరియా, జపాన్, చైనా వంటి ఆసియా దేశాలు, అమెరికాతో పోల్చినా ఇండియాలో పరీక్షలు తక్కువ. చాలినన్ని టెస్టు కిట్లు అందుబాటులో లేవు.
2020-04-06కరోనా వైరస్ అమెరికాలో శరవేగంగా విస్తరిస్తోంది. సోమవారం నాటికి వైరస్ దేశంలో 3,47,003 మందికి సోకింది. 10,335 ప్రాణాలను బలి తీసుకుంది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 3,048 మంది చనిపోయారు. మరణాల రేటు 3 శాతానికి (2.98 శాతం) పెరిగింది. రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం, మరణాల రేటు పెరుగుతుండటం అమెరికన్లను భయపెడుతోంది. ఈ వారం మృతుల సంఖ్య బాగా పెరుగుతుందని ట్రంప్ నిన్ననే ఆందోళన వ్యక్తం చేశారు.
2020-04-06‘కరోనా’ మహమ్మారితో దేశంలో మృతుల సంఖ్య 111కు చేరినట్టు కేంద్ర ప్రభుత్వం కొద్ది గంటల క్రితం వెల్లడించింది. ఒక్క మహారాష్ట్రలోనే సోమవారం సాయంత్రం వరకు 52 మంది మరణించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. సోమవారం ఏడుగురు ఈ మహమ్మారికి బలయ్యారు. ‘కరోనా’ కేసుల సంఖ్యలోనూ, మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలో వైరస్ సోకినవారి సంఖ్య 868కి పెరిగింది. అందులో సగానికి పైగా ముంబయి నగరంలోనే నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఒక్క రోజే 120 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
2020-04-06‘కరోనా’ వైరస్ సోకినవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తొలుత బలయ్యేది కుటుంబాలే. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకితే అందరికీ వ్యాపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 7 కుటుంబాల్లోనే 55 ‘కరోనా’ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో సోమవారం నాటికి 61 యాక్టివ్ కరోనా కేసులు ఉంటే.. అందులో ‘కుటుంబ కరోనా’ కేసులే 90 శాతం కావడం గమనార్హం. ఒక్కరి వల్ల కుటుంబం మొత్తానికి వైరస్ సోకిన ఉదంతాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి.
2020-04-06