ఐటీ సోదాల్లో అవినీతి బయటపడినందున మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లను అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు మాజీ పి.ఎస్. వద్దనే రూ. 2000 కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలు దొరికాయని ఐటీ శాఖ ప్రకటనను ఉటంకిస్తూ చెప్పారు. కదిలింది తీగ మాత్రమేనని, డొంక కూడా కదులుతుందని అంబటి చెప్పారు. అరెస్టు చేయకపోతే చంద్రబాబు వ్యవస్థలను ‘మేనేజ్’ చేస్తారని వ్యాఖ్యానించారు.
2020-02-14ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంబంధించిన ‘ప్రతిమ’, పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న ‘మెగా ఇంజనీరింగ్’, ఢిల్లీకి చెందిన షాపూర్జీ కంపెనీల్లో ఐటీ సోదాలపై మాట్లాడాలని జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాలు చేశారు. ‘‘ఆ పేర్లు ఎత్తితే మీ తోకలు కట్ అవుతాయి. హైదరాబాద్, ఢిల్లీ వెళ్తే మీ వీపులు పగులుతాయి. అందుకే అవేవీ మాట్లాడకుండా చంద్రబాబుపై బురద వేస్తారా?’’ అని శుక్రవారం మండిపడ్డారు.
2020-02-14ఏపీ మాజీ డీజీపీ ఎ.బి. వెంకటేశ్వరరావు సస్పెన్షన్ నిలిపివేతకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించింది. ఏబీ దాఖలు చేసిన పిటిషన్ పై ‘క్యాట్’ శుక్రవారం విచారణ చేపట్టింది. డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే కేంద్రానికి సమాచారం ఇచ్చారా? మే నెల నుంచి ఏబీకి వేతనం ఎందుకు ఇవ్వలేదు? అని ‘క్యాట్’ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకోసం ప్రభుత్వానికి గడువు ఇస్తూ.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈలోగా సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలన్న ఏబీ తరపు న్యాయవాది విన్నపాన్ని తోసిపుచ్చింది.
2020-02-142012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన మానసిక పరిస్థితి సరిగా లేదన్న వాదనను సుప్రీం కొట్టిపారేసింది. వినయ్ వైద్య పరీక్షల నివేదికల్లో అంతా సాధారణంగానే ఉందని పేర్కొంది. వినయ్ శర్మ క్షమాబిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించిన నేపథ్యంలో దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి నిర్ణయంపై శర్మ చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
2020-02-14ద ఎనర్జీ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (తేరి) మాజీ ఛైర్మన్ రాజేంద్ర కె. పచౌరి (79) గురువారం గుండెపోటుతో మరణించారు. ఇంథన నిపుణుడిగా, పర్యావరణవేత్తగా పచౌరి చిరపరిచితుడు. 2001లో భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యునిగా నియమితులయ్యారు. ఐపిసిసి ఛైర్మన్ గా 2002 నుంచి 2015 వరకు పని చేశారు. ఆయన హయాంలోనే ఐపిసిసికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ‘తేరి’ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఆ సంస్థ ఉద్యోగి ఒకరు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో పచౌరి కనుమరుగయ్యారు.
2020-02-13సిఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలన్న పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. వివేకా కుమార్తె సహా పలువురు వేసిన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది. అయితే, అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదా వేశారు. ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ కోరిన ప్రస్తుత సిఎం జగన్, ఇప్పుడు వైఖరి మార్చుకున్నారు. అయితే, వివేకా కుమార్తె తన పిటిషన్లో రక్త సంబంధీకులతో సహా పలువురిపై అనుమానం వ్యక్తం చేశారు.
2020-02-13ఆదాయ పన్ను శాఖ ఈ నెల 6వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణెలలో నిర్వహించిన సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలకు భాగం ఉన్న బోగస్ కాంట్రాక్టుల రాకెట్లో రూ. 2000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లాయని ఆ ప్రకటనలో పేర్కొంది. మాజీ సిఎం చంద్రబాబు మాజీ పి.ఎస్. శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తదితరుల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.
2020-02-13క్రికెట్ చరిత్రలో అతిపెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో భాగస్వామి అయిన బుకీ సంజీవ్ చావ్లాను ఢిల్లీ కోర్టు 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. లండన్ నుంచి చావ్లాను గురువారం పట్టుకొచ్చినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. అప్పట్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ హన్సీ క్రోనే ఈ కుంభకోణంలో భాగమయ్యారు. ఆయన 2002లో ఓ విమాన ప్రమాదంలో మరణించారు. 2000 మార్చిలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో 5 మ్యాచ్ లను చావ్లా ఫిక్స్ చేశారన్నది నేరారోపణ.
2020-02-13 Read Moreదేశ రాజధాని వాసులకు ఆసక్తికరమైన వార్త. ఇక వాళ్లు మెట్రో రైళ్ళలో పుట్టిన రోజు, ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు చేసుకోవచ్చు. గంటకు రూ. 5000 చెల్లించి కోచ్ లను బుక్ చేసుకోవచ్చు. సినిమా షూటింగులు, ఫొటోగ్రఫీకి స్టేషన్లను అద్దెకు ఇవ్వాలన్న నిర్ణయం తర్వాత.. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్.ఎం.ఆర్.సి) ఫంక్షన్లకు కోచ్ లను అద్దెకు ఇస్తామన్న ప్రకటన చేసింది. ఈ కార్పొరేషన్ నోయిడా, గ్రేటర్ నోయిడా మధ్య మెట్రో రైళ్ళను నడిపిస్తోంది. కోచ్ కావాలంటే 15 రోజుల ముందు దరఖాస్తు చేయాలి.
2020-02-13కరోనా వైరస్ డిసీజ్ (కోవిడ్)-2019 చైనాను వణికిస్తోంది. కొత్తగా 15,152 కేసులు నమోదైనట్టు చైనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం 24 గంటల్లో 254 మంది ఈ వ్యాధితో చనిపోయారు. వారిలో 242 మంది ఒక్క హుబీ ప్రావిన్సువారే. మొత్తం 52,526 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించగా.. వారిలో 8,030 మందికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా 5,911 మందికి నయం కావడంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు.
2020-02-13 Read More