ఈ ఏడాది హజ్ యాత్రను చాలా కొద్దిమందితో నిర్వహించనున్నట్టు సౌదీ అరేబియా తాజాగా ప్రకటించింది. ఇప్పటికే తమ దేశంలో నివశిస్తున్న వివిధ దేశాల యాత్రికులను అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే ఇకపైన ఎవరినీ విదేశాలనుంచి అనుమతించరు. ‘కరోనా’ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో.. జూలైలో జరిగే ఈ మత క్రతువుపై సౌదీ హజ్ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హజ్ యాత్ర సాధారణంగా నిర్వహిస్తే ‘భౌతిక దూరం’ పాటించడం సాధ్యం కాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి ఏటా 20 లక్షలకు పైగా ముస్లింలు వివిధ దేశాలనుంచి హజ్ యాత్రకు వెళ్తుంటారు.
2020-06-23అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ట్వీట్లలో ఓటమి భాష ధ్వనిస్తోంది. 2020 ఎన్నికల్లో ఓ డెమోక్రాట్ గెలిస్తే.. అది ఆఫ్రికన్ అమెరికన్లకు విషాదకర ఓటమి అవుతుందని ట్రంప్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. కొద్ది గంటల తర్వాత ఎన్నికల్లో రిగ్గింగ్ జరగబోతోందంటూ మరో ట్వీట్ పెట్టారు. మిలియన్లకొద్దీ మెయిల్-ఇన్ బ్యాలెట్లను విదేశాలు ముద్రించబోతున్నాయని, ఇది మన కాలపు కుంభకోణం కాబోతోందని పేర్కొన్నారు. దీనికి అమెరికన్లు స్పందించారు. ఓటమిని ఊహించి ముందే సాకును సిద్ధం చేసుకుంటున్నారని కొందరు వెటకారమాడితే.. 2016లో మెయిల్-ఇన్ బ్యాలెట్ల ద్వారానే ట్రంప్ గెలిచారని మరికొందరు గుర్తు చేశారు.
2020-06-23‘దశలవారీ మద్య నిషేదం’ సిఎం జగన్ హామీ. ఆయన అధికారంలోకి వచ్చాక తొలి సంవత్సరం (2019-20) రాష్ట్రంలో 30 శాతం షాపులు తగ్గించినా ఆదాయం కేవలం రూ. 4.69 శాతమే తగ్గింది. మద్యంపైన వాణిజ్య పన్ను 2018-19లో రూ. 10,915.69 కోట్లు వసూలు కాగా 2019-20లో రూ. 10,403.84 కోట్లు వసూలైంది. సొంత పన్నుల ఆదాయం (43,332.45 కోట్ల)లో ఇది 24 శాతం. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తున్నందున అమ్మకాలపై లాభం దీనికి అదనం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ఆదాయం రూ. 51,689 కోట్లు ఉండొచ్చని ప్రభుత్వ అంచనా. ఈసారైనా మద్యం వాటా తగ్గిస్తారా? వేచి చూడాలి.
2020-06-22‘కరోనా లాక్ డౌన్’ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో పన్నుల వసూళ్లు అసాధారణంగా పడిపోయాయి. ఏప్రిల్, మే నెలలకు గాను రూ. 8,319.44 కోట్లు వసూలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా వచ్చింది కేవలం రూ. 2,874.85 కోట్లు. అంటే లక్ష్యంలో కేవలం 34.55 శాతం మాత్రమే వసూలయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి సోమవారం (జూన్ 22న) వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీ పరిహారం కింద రూ. 2,355.73 కోట్లు రావలసి ఉందని మంత్రి చెప్పారు.
2020-06-22స్టెరాయిడ్ ‘డెక్సామెథాసోన్’కు తీవ్రంగా జబ్బుపడిన రోగుల ప్రాణాలను కాపాడే సామర్ధ్యం ఉందన్న నిర్ధారణ ‘కోవిడ్ 19’పై పోరాటానికి ఊతమిచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ చెప్పారు. సోమవారం జెనీవా (స్విట్జర్లాండ్)లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఉత్పత్తిని పెంచడం, ప్రపంచం మొత్తానికి వేగంగా.. సమానంగా పంపిణీ చేయడం తదుపరి సవాలు’’ అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. యు.కె. పరీక్షల ఫలితాల తర్వాత ఇప్పటికే ‘డెక్సామెథాసోన్’కు డిమాండ్ బాగా పెరిగిందని, అయితే... తక్కువ ధరకు అందించాల్సి ఉందని పేర్కొన్నారు.
2020-06-22మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కిలోమీటర్ల విస్తీర్ణంలోని భారత భూభాగాన్ని నిస్సహాయంగా చైనాకు అప్పగించారని బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా ఆరోపించారు. తాజా చైనా ఆక్రమణ విషయంలో మన్మోహన్ ప్రధాని మోడీని విమర్శించినందుకు నడ్డా సోమవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 2010, 2013 మధ్య మన్మోహన్ హయాంలో 600సార్లు చైనా సైన్యం చొరబాట్లు చోటు చేసుకున్నాయని నడ్డా ఆరోపించారు. సైనిక దళాలను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ మాజీ ప్రధానిపై నడ్డా ధ్వజమెత్తారు.
2020-06-22చైనాతో సరిహద్దు ఘర్షణలో మరణించిన తెలంగాణవాసి కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సిఎం కె. చంద్రశేఖరరావు భారీ వరాలు అందించారు. రూ. 5 కోట్ల ఆర్థిక సాయం, భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం, హైదరాబాద్ బంజారాహిల్స్ లో 711 గజాల ఇంటి స్థలం పత్రాలను స్వయంగా అందించారు. సోమవారం సంతోష్ బాబు ఇంటికి వెళ్లి ఆయన పిల్లల పేరిట రూ. 4 కోట్ల చెక్కును, తల్లిందండ్రులకు రూ. కోటి చెక్కును అందజేశారు. సంతోష్ భార్యకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని, ఇంటి స్థలం డాక్యుమెంట్లను అందించారు. సూర్యాపేటలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.
2020-06-22చైనా సంస్థలతో కుదుర్చుకున్న 3 పెట్టుబడి ఒప్పందాలను నిలిపివేస్తూ మహారాష్ట్రలోని ‘మహావికాస్ అఘాది’ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి విలువ రూ. 5 వేల కోట్లు ఉంటుందని సమాచారం. ఇటీవల మాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 పేరిట నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. లడఖ్ లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో.. ఆ ఒప్పందాలపై మహారాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. ఘర్షణ జరగక ముందు ఈ ఒప్పందాలు కుదిరాయని, మరే ఇతర ఒప్పందాలపైనా సంతకాలు చేయవద్దని విదేశాంగ శాఖ సూచించిందని మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ చెప్పారు.
2020-06-22చైనా నిర్మించిన భారీ ప్రాజెక్టులలో ఒకటి ‘త్రీ గార్జెస్’ డ్యాం. వరద నివారణ, జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా ప్రధాన లక్ష్యాలుగా తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తయింది. లక్ష్యానికి తగ్గట్టే జలరవాణాలో ‘త్రీగార్జెస్’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 17 సంవత్సరాలుగా ఈ డ్యాం వద్ద ఉన్న షిప్ లాక్ ద్వారా 8,73,800 ఓడలు పయనించాయి. 1.22 కోట్ల మంది ప్రజలు ప్రయాణించగా 146 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగినట్లు త్రీగార్జెస్ కార్పొరేషన్ వెల్లడించింది. అంటే.. రోజుకు 2.35 లక్షల టన్నులకు పైగా సరుకు రవాణా జరిగింది.
2020-06-22ప్రధాని ఎల్లప్పుడూ తాను వాడే పదాల పర్యవసానాలను గుర్తెరిగి మాట్లాడాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై మన్మోహన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గాల్వన్ లోయలోకి చొరబడి టెంట్లు వేసుకున్న చైనా సైనికులను ఖాళీ చేయించే ప్రయత్నంలో 20 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కర్నల్ సంతోష్ బాబు, ఇతర జవాన్లు చేసిన అసాధారణ త్యాగానికి తగినట్టుగా కేంద్రం స్పందించకపోతే ‘ప్రజల విశ్వాసానికి చారిత్రక ద్రోహం’ చేసినట్టేనని సింగ్ విమర్శించారు.
2020-06-22