భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నరు శక్తికాంత దాస్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనకు దగ్గరగా మెలిగినవారిని హెచ్చరించినట్టు దాస్ పేర్కొన్నారు. ఇంట్లోనే విడిగా ఉంటూ తన పనిని కొనసాగిస్తానని, రిజర్వు బ్యాంకులో పనులు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. తాను డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులను వీడియో కాన్ఫరెన్సు, టెలిఫోన్ ద్వారా సంప్రదిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.
2020-10-25చైనా మన భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నదని, కేంద్ర ప్రభుత్వం-ఆర్ఎస్ఎస్ అందుకు అనుమతించాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదివారం ఆర్ఎస్ఎస్ విజయదశమి సమావేశంలో ఆ సంస్థ అధిపతి మోహన్ భగవత్ చేసిన ప్రసంగానికి రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ‘‘లోలోపల మోహన్ భగవత్ కు నిజం తెలుసు. దాన్ని ఎదుర్కోవడానికి ఆయన భయపడుతున్నారంతే. నిజం ఏమిటంటే... చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. భారత ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ దాన్ని అనుమతించాయి’’ అని రాహుల్ గాంధీ ట్వీటారు.
2020-10-25శక్తిలోనూ, వ్యాప్తిలోనూ చైనా కంటే ఇండియా పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆకాంక్షించారు. ఆ దేశ విస్తరణ ప్రణాళికల గురించి ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. భగవత్ ఆదివారం ఆర్ఎస్ఎస్ విజయ దశమి వార్షిక సమావేశంలో మాట్లాడారు. ‘‘మహమ్మారి సమయంలో చైనా మన సరిహద్దులను ఆక్రమించింది’’ అని భగవత్ చెప్పారు. పౌరసత్వ (సవరణ) చట్టం ఏ మతానికీ వ్యతిరేకం కాదంటూ ‘‘ఇది వారి జనాభాను తగ్గించడానికి ఉద్దేశించినదని కొంతమంది మన ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు’’ అని భగవత్ విమర్శించారు.
2020-10-25విశాఖపట్నంలోని ‘గీతమ్’ విశ్వవిద్యాలయం ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిందంటూ కొన్ని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. శనివారం వేకువ జామునే జెసిబిలతో వెళ్లిన అధికారులు వర్శిటీ ప్రధాన ద్వారం, సెక్యూరిటీ గది, ప్రహరీ గోడలను కూల్చివేసి లోపలి వరకు హద్దు రాళ్లు పాతారు. రుషికొండ, ఎన్నాడ గ్రామాల పరిధిలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమి ‘గీతమ్’ ఆక్రమణలో ఉందని స్థానిక ఆర్డీవో కిషోర్ చెప్పారు. నోటిసులు ఇవ్వకుండా కూల్చివేశారని వర్శిటీ యాజమాన్యం ఆరోపించగా, కొద్ది నెలల క్రితమే మార్కింగ్ చేశామని... ఈ విషయం యాజమాన్యం ‘దృష్టి’లో ఉందని ఆర్డీవో పేర్కొన్నారు.
2020-10-24స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. వచ్చే మూడు నెలల్లో కరోనా వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలను మంత్రి ప్రస్తావించారు. మార్చిలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక... ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసులు భారీగా పెరిగినా... ప్రపంచమంతటా ఎన్నికలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనూ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఇసి ఈ నెల 28న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
2020-10-23సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఫేస్ బుక్’, మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ లకు జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంటు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు-2019కి సంబంధించి శుక్రవారం తన ఎదుట హాజరు కావాలని ఫేస్ బుక్ సంస్థ అధికారులను ఈ పార్లమెంటు కమిటీ ఆదేశించింది. అలాగే ట్విట్టర్ ప్రతినిధులు ఈ నెల 28న హాజరు కావలసి ఉంటుంది. ఈ కమిటీకి బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి అధ్యక్షులుగా ఉన్నారు. అమెజాన్, గూగుల్ ప్రతినిధులను కూడా పిలువనంపే అంశం కమిటీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
2020-10-22టీడీపీతో కలసి ‘ఢిల్లీని తలదన్నే రాజధాని’ని నిర్మిస్తామని ఎన్నికలకు ముందు వాగ్ధానం చేసిన నరేంద్ర మోదీ, ప్రధానిగా ‘అమరావతి’కి శంకుస్థాపన చేసి నేటికి ఐదేళ్ళు పూర్తయింది. 2015 అక్టోబర్ 22న పార్లమెంటు నుంచి పుట్ట మట్టి, నీరు తెచ్చి పవిత్ర జలాలు, మట్టితో పూజ చేసి మరీ అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలో మూడున్నరేళ్ళ పాటు కొంత పురోగతి సాగించాక, ప్రభుత్వం మారడంతో అమరావతికి గ్రహణం పట్టింది. పాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని నిర్ణయించిన సిఎం జగన్మోహన్ రెడ్డి, అమరావతి పునాది రాళ్లను శిథిలావస్థకు చేరుస్తున్నారు.
2020-10-22భారత విదేశీ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW- రా) అధిపతి సమంత్ కుమార్ గోయల్ నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలిని కలిసారు. నేపాల్ తో ఉన్న స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరాయాన్ని ఇండియా అనుమతించబోదని స్పష్టం చేస్తూ... అన్ని సమస్యలనూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గోయల్ సూచించినట్టు సమాచారం. నవంబర్ మొదటి వారంలో భారత సైన్యాధిపతి ఎంఎం నరవణె నేపాల్ సందర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో ‘రా’ చీఫ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారం సాయంత్రం నేపాల్ ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగినట్టు ఆయన మీడియా సలహాదారు సూర్య థాప చెప్పారు.
2020-10-22అమెరికా టాప్ సీక్రెట్ నిఘా కార్యకలాపాలను బట్టబయలు చేసిన ఎన్ఎస్ఎ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ (37)కు రష్యా శాశ్వత ప్రాతిపదికన ఆశ్రయమిచ్చింది. ఈ విషయాన్ని స్నోడెన్ లాయర్ అనతోలి కుచెరెనా వెల్లడించారు. రష్యాలో నిరవధికంగా నివాసం ఉండటానికి బేషరతుగా అనుమతి ఇవ్వాలని కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించినట్టు స్నోడెన్ కు గురువారం నోటిఫికేషన్ అందింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2013లో స్నోడెన్ కు ఆశ్రయం మంజూరు చేశారు. ఆయన ప్రస్తుతం మాస్కోలో లేదా నగర సమీపంలో ఉంటున్నారు.
2020-10-22వచ్చే ఐదేళ్ళలో బీహార్ లో 19 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బిజెపి మేనిఫెస్టోను గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. జనతాదళ్ (యునైటెడ్)తో కలసి ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తున్న బిజెపి, మిత్రపక్షం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా ఉంది. నితీష్ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించినా, ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే ఈసారి సీఎం సీటుకు పట్టుబట్టే అవకాశం ఉంది.
2020-10-22