లోక్ సభకు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశలో ఏప్రిల్ 11న 91 సీట్లకు, రెండో దశలో ఏప్రిల్ 18న 97 సీట్లకు, మూడో దశలో ఏప్రిల్ 23న అత్యధికంగా 115 సీట్లకు, నాలుగో దశలో ఏప్రిల్ 29న 71 సీట్లకు, ఐదో దశలో మే 6న అతి తక్కువగా 51 సీట్లకు, ఆరో దశలో మే 12న 59 సీట్లకు, ఏడో దశలో మే 19న మరో 59 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరగాల్సి ఉంది.
2019-03-10ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ సీట్లకూ ఏప్రిల్ 11న తొలి దశలోనే పోలింగ్ నిర్వహించనున్నట్టు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. లోక్ సభతోపాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో... ఏప్రిల్ 11నుంచి మే 19 వరకు పోలింగ్ జరుగుతుంది. మే 23వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిశాక 42 రోజులకు గాని ఫలితాలు వెలువడవు.
2019-03-10దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఎన్నికల షెడ్యూలును వెల్లడించారు. దేశంలో మొత్తం ఓటర్లు 90 కోట్లు కాగా, తొలిసారి ఓటర్లు కోటిన్నర మంది ఉన్నారని ఆయన తెలిపారు. 99.36 శాతం ఓటర్లకు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని, గత ఎన్నికల్లో 9 లక్షల పోలింగ్ బూతులు ఉంటే ఈసారి 10 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. రైతులకు, విద్యార్ధుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా, పండగ తేదీలను కూడా పరిగణనలోకి తీసుకొని షెడ్యూలును రూపొందించామని అరోరా చెప్పారు.
2019-03-10‘‘మిస్టర్ వాట్సన్, ఇటు రండి. మీతో పని ఉంది’’.. 133 ఏళ్ళ క్రితం టెలిఫోన్ సృష్టికర్త అలెగ్జాండర్ గ్రహంబెల్ ప్రక్క గదిలో ఉన్న తన సహాయకుడికి టెలిఫోన్లో ఇచ్చిన ఈ ఆదేశం చరిత్రలో భాగమైంది. టెలిఫోన్ ద్వారా వినిపించిన తొట్ట తొలి స్పష్టమైన సంభాషణ ఇదే. 1876 మార్చి 10న ఈ ప్రయోగం చేయడానికి మూడు రోజుల ముందే గ్రహంబెల్ టెలిఫోన్ పేటెంట్ పొందారు. స్కాట్లాండ్ లో పుట్టిన గ్రహంబెల్ తండ్రినుంచి ఉపన్యాస కళను పుణికిపుచ్చుకున్నారు. బోస్టన్ వర్శిటీలో వోకల్ ఫిజియాలజీ ప్రొఫెసర్ గా పనిచేసేప్పుడు ఖాళీ సమయంలో శబ్ద తరంగాలపై పరిశోధించారు. టెలిగ్రాఫ్ తరహాలో మాటలను కూడా ప్రసారం చేయవచ్చనే నిర్ధారణకు వచ్చారు.
2019-03-10 Read Moreటర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరం వెళ్తున్న టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి గాల్లో కుదుపులకు గురై అందులో ప్రయాణిస్తున్న 29 మంది గాయపడ్డారు. గాయపడినవారికి జాన్ ఎఫ్. కెన్నడి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స చేసినట్టు అమెరికన్ అధికారులు తెలిపారు. కుదుపులకు గురైన విమానంలో మొత్తం 326 మంది ప్రయాణీకులు, 21 మంది సిబ్బంది ఉన్నారు. గత నెలలో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం కూడా ఇలాగే కుదుపులకు గురై ఐదుగురు గాయపడ్డారు.
2019-03-10 Read Moreఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి ఆదివారం కూలిపోయింది. అందులో 149 మంది ప్రయాణీకులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. అడిస్ అబాబా విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:38కి బయలు దేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 800 విమానం, కెన్యా రాజధాని నైరోబి వెళ్తుండగా 8:44కి కమ్యూనికేషన్ తెగిపోయింది. సెర్చ్ ఆపరేషన్ల తర్వాత విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. విమానంలోనివారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. నాలుగు నెలల క్రితమే వచ్చిన కొత్త విమానం కూలిపోవడంతో ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ షాకైంది. ఐదు నెలల క్రితం ఇండోనేషియాలో ఇదే మోడల్ విమానం కూలిపోయింది.
2019-03-10 Read Moreమోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజర్ విడుదలలో కీలక పాత్ర ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 1999లో అజర్ ను కాందహార్ తీసుకెళ్లినప్పుడు ఉగ్రవాదులతో అజిత్ దోవల్ ఉన్న ఫొటోను రాహుల్ ఆదివారం షేర్ చేశారు. ‘‘ప్రధాని మోదీ... అమరులైన 40 మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్ల కుటుంబాలకు చెప్పండి. వారిని చంపిన హంతకుడు మసూద్ అజర్ ను విడుదల చేసిందెవరు? ప్రస్తుతం మీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవలే అజర్ విడుదల ఒప్పందాన్ని కుదిర్చారన్న విషయాన్ని కూడా చెప్పండి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
2019-03-10 Read Moreతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావును, ఆ తర్వాత ఆయన సోదరి కవితను కలుసుకున్నారు. సబిత తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్రుగా ఉన్న కార్తీక్ రెడ్డి, లోక్ సభ ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న నేపథ్యంలో పార్టీ మార్పునకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ తాజా భేటీలకు అనుసంధానకర్తగా వ్యవహరించడం విశేషం.
2019-03-10లోక్ సభ ఎన్నికలకోసం అభ్యర్ధులను ఎంపిక చేసే బాధ్యతను అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు అప్పగిస్తూ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్.జె.డి) కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. లాలూ ప్రస్తుతం జార్ఖండ్ లోని రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తూ రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ఆయన అక్కడినుంచే అభ్యర్ధులు, పొత్తులపై కసరత్తు చేస్తున్నారు. రెబల్ జెడి (యు) నేత, లోక్ తాంత్రిక్ జనతా దళ్ (ఎల్.జె.డి) వ్యవస్థాపకుడు శరద్ యాదవ్ శనివారం లాలూను అక్కడే కలుసుకున్నారు.
2019-03-10 Read Moreతమ పార్టీ తరపున లోక్ సభ సీట్లలో మహిళలకు 33 శాతం కోటాను అమలు చేయనున్నట్టు ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఒడిశాలోని కేంద్రపారాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నవీన్ ఈ ప్రకటన చేశారు. గతంలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి దేశానికి దిక్సూచిగా నిలిచిన బీజేడీ ఇప్పుడు ఒడిశానుంచి 33 శాతం మహిళలను లోక్ సభకు పంపుతుందని నవీన్ ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికలతోపాటే ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.
2019-03-10