‘కరోనా’ మహమ్మారి విస్తరణ ఏపీలోనూ వేగవంతమైంది. నిన్న ఉదయం నుంచి గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 304 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,456కు చేరింది. ఇప్పటిదాకా 86 మంది ‘కరోనా’ ప్రభావంతో మరణించినట్టు ప్రభుత్వ సమాచారం. రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు 5087 మంది వైరస్ బారిన పడగా వారిలో 2770 మంది కోలుకున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 210 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1159 మందికి ‘కరోనా’ నిర్ధారణ అయింది.
2020-06-15ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. వారిని గూఢచారులుగా చిత్రించేందుకు పాకిస్తాన్ భద్రతా సంస్థలే తీసుకెళ్ళి ఉంటాయని భావిస్తున్నారు. రెండు వారాల క్రితం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారులను గూఢచర్యం ఆరోపణలతో భారత ప్రభుత్వం బహిష్కరించినందుకు ప్రతిచర్యగా ఈ పని చేసి ఉండొచ్చు. ఇస్లామాబాద్ లో అదృశ్యమైన ఇద్దరూ సిఐఎస్ఎఫ్ డ్రైవర్లుగా ప్రాథమిక సమాచారం. శుక్రవారం ఉదయం ఇంటినుంచి బయలుదేరిన వారిద్దరూ కార్యాలయానికి చేరలేదు.
2020-06-15కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి. వీణ వివాహం సోమవారం ఉదయం తిరువనంతపురంలో జరిగింది. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాస్ ను వీణ వివాహమాడారు. ముఖ్యమంత్రి నివాసంలో కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగింది. వీణ, రియాస్ లకు ఇది రెండో వివాహం. ఈ మతాంతర వివాహాన్ని స్పెషల్ మారేజ్ యాక్ట్ కింద నమోదు చేశారు.
2020-06-15బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ (34) ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకొని కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే, బాంద్రాలోని ఆయన నివాసంలో లేఖ ఏమీ దొరకలేదని తెలిపారు. టీవీ నటుడిగా కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి ప్రవేశించిన సుశాంత్.. ‘ఛిచ్చోర్’, ‘ఎంఎస్ ధోని’ వంటి సినిమాలతో త్వరగా పాపులారిటీ సాధించారు. సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్ (28) కొద్ది రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నారు.
2020-06-14గుజరాత్ రాష్ట్రంలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్.సి.ఎస్) తెలిపింది. కాగా, అమెరికా సంస్థ యు.ఎస్.జి.ఎస్. ఈ భూకంప తీవ్రతను 5.2గా నమోదు చేసింది. రాజ్ కోట్ పట్టణానికి 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఆదివారం రాత్రి 8.13 గంటలకు సంభవించిన ఈ భూకంపం వల్ల జరిగిన నష్టం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
2020-06-14ఇండియాలోని కాలాపని, లిపులేఖ్, లింపియాధురా వంటి భూభాగాలను తమ దేశంలో కలిపి చూపించిన కొత్త రాజకీయ పటానికి నేపాల్ పార్లమెంటు దిగువ సభ ఆమోదం తెలిపింది. ప్రధాని కెపి శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, మాధేసీ పార్టీ మద్ధతిచ్చాయి. 275 మంది సభ్యుల ప్రతినిధి సభ ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అన్ని పార్టీల సభ్యులూ బిల్లుపై సంతకాలు చేశారు. శతాబ్దాల దౌత్యపరమైన అవమానాలను తిప్పికొట్టిందంటూ ప్రభుత్వాన్ని మావోయిస్టు అగ్రనేత ప్రచండ ప్రశంసించారు.
2020-06-13‘కరోనా’ వైరస్ పాజిటివ్ కేసులు ఇండియాలో 3,09,603కు చేరాయి. అందులో 8,890 మంది మరణించగా 1,54,231 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రోజుకు 11,500కు పైగా కొత్త కేసులు, 390 మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో అమెరికా (21,16,922), బ్రెజిల్ (8,29,902), రష్యా (5,11,423) తర్వాత స్థానంలో ఇండియా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు నిన్న (జూన్ 12న) రికార్డు స్థాయిలో (1,40,900) పెరిగాయి. 4,603 మంది నిన్న మరణించారు. ఇండియా వాటా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 8 శాతంగానూ, మరణాల్లో 8.5 శాతంగానూ ఉంది.
2020-06-13అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి లను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. తమ వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారనే కారణంతో జెసిపై కేసు నమోదైంది. 154 లారీలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారని, బి.ఎస్-3 వాహనాలను బి.ఎస్-4 కింద నమోదు చేయించారని రాష్ట్ర రోడ్డు రవాణా అధారిటీ అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ లో ప్రభాకరరెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసి అనంతపురం తరలిస్తున్నారు. నిన్న తెలుగుదేశం శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
2020-06-13ఇఎస్ఐ కొనుగోళ్ళ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహా ఆరుగురిని అరెస్టు చేసినట్టు ఎసిబి జాయింట్ డైరెక్టర్ రవికుమార్ చెప్పారు. రాష్ట్రంలో 19 చోట్ల సోదాలు నిర్వహించి సికె రమేష్ కుమార్, డాక్టర్ విజయకుమార్, చింతల కిష్టప్ప, రమేష్ బాబు, డాక్టర్ వి. జనార్ధన్ లను అరెస్టు చేసినట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2014-19 కాలంలో రూ. 988 కోట్ల విలువైన మందులు, ల్యాబ్ కిట్లు, సర్జికల్ పరికరాలు, బయోమెట్రిక్ మెషీన్లు కొనుగోలు చేయగా... అందులో సుమారు రూ. 150 కోట్ల మేరకు అవినీతి జరిగిందని రవికుమార్ చెప్పారు. వివిధ పరికరాలకు 50 నుంచి 130 శాతం వరకు అదనంగా చెల్లించారని పేర్కొన్నారు.
2020-06-12తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడును 100 మంది పోలీసులు అక్రమంగా, చట్టవిరుద్ధంగా కిడ్నాప్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. బలహీనవర్గాలకు వైసీపీ చేస్తున్న మోసంపై పోరాడుతున్నందుకే సిఎం జగన్ కక్ష కట్టి కిడ్నాప్ చేయించారని విమర్శించారు. అచ్చెన్నను ఎక్కడికి తీసుకెళ్ళారో తెలియదని.. కుటుంబ సభ్యులకు, తనకు కూడా ఫోనులో అందుబాటులో లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జ్యోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
2020-06-12