కరోనా వైరస్ (SARS-CoV-2) ప్రాథమిక రకం కంటే వేగంగా వ్యాపించిన కొత్త రూపాంతరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రకం (D614G) ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా వ్యాపించిందని లాస్ అలమాస్ జాతీయ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఓ అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. ఇది ఫిబ్రవరిలో ఐరోపా ఖండంలో ప్రత్యక్షమై వేగంగా అమెరికా తూర్పు తీరానికి వ్యాపించి, మార్చి మధ్య కల్లా ప్రపంచవ్యాప్తంగా ‘ఆధిపత్య రకం’గా అవతరించిందని వారు వివరించారు. వేగంగా వ్యాపించడంతో పాటు.. ఒకే వ్యక్తికి రెండోసారి సంక్రమించే గుణం ఈ కొత్త రకానికి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (పరిశోధనా పత్రం కోసం ఎడమకు స్వైప్ చేయండి)
2020-05-05 Read Moreమద్యం ధరలు పెంచి అమ్మకాలను నియంత్రిస్తున్నందున కల్తీ మద్యం రావచ్చని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగొచ్చని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటివి ఎక్కడా కనిపించకూడదని కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో హుకుం జారీ చేశారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలను హెచ్చరించిన సిఎం, ఈ వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ‘‘ఈ విషయంలో నన్ను నిరాశపరచొద్దు’’ అని జగన్ వ్యాఖ్యానించారు. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకే ధరలను భారీగా పెంచామని చెప్పారు.
2020-05-05ప్రభుత్వ కార్యాలయాలకు ‘వైసీపీ రంగులు’ వేయడాన్ని ఏపీ హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. ఇంతకు ముందు వైసీపీ జెండాలోని మూడు రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేయగా తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఆ మూడు రంగులకు మట్టి రంగు జోడించాలని అధికారులను ఆదేశిస్తూ జీవో 623ని జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు ఆ జీవోను కూడా నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
2020-05-05జాతీయ ఇంజనీరింగ్, వైద్య విద్యా సంస్థల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ప్రకటించింది. ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశాలకోసం జెఇఇ 2020 మెయిన్స్ పరీక్షను జూలై 18 నుంచి 23 వరకు, అడ్వాన్సు పరీక్షను ఆగస్టులోనూ నిర్వహించనున్నట్టు మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. వైద్య సంస్థల కోసం జాతీయ అర్హత & ప్రవేశ పరీక్ష (నీట్) 2020ని జూలై 26న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పరీక్షలను ఏటా ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేవారు. ‘కరోనా’ కారణంగా ఈ ఏడాది విలువైన విద్యా కాలం కోల్పోయినందున.. సిలబస్ తగ్గించనున్నట్టు మంత్రి చెప్పారు.
2020-05-05ఏపీ ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ రమేష్ కుమార్ రాసినట్టు చెబుతున్న లేఖ ఎస్ఇసి కార్యాలయంలో రూపొందలేదని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఎక్కడో తయారైన లేఖను పెన్ డ్రైవ్ ద్వారా తెచ్చి ఎస్ఇసి ల్యాప్ టాప్ లో కాపీ చేశారని, అక్కడ ఎడిట్ చేసినట్టు లింకు ఫైల్స్ మాత్రం ఉన్నాయని సునీల్ కుమార్ మంగళవారం చెప్పారు. ఆ లేఖ ఏ కంప్యూటర్లో పుట్టిందో కచ్చితంగా తేలుతుందని సంశయాత్మకంగా చెప్పడం గమనార్హం. ‘లేఖను కమిషనర్ కేంద్రానికి పంపారా లేదా.. అన్న అంశంతోపాటు ఎక్కడ పుట్టిందో విచారించే పరిధి సిఐడికి ఉందా?’ అన్న ప్రశ్నకు కూడా ఆయన ధీమాగా బదులివ్వలేకపోయారు.
2020-05-05‘లాక్ డౌన్’ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఐదుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆర్.కె. రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డి, విడదల రజని, సంజీవయ్య, వెంకటగౌడ లకు నోటీసులు జారీ అయ్యాయి. వారిపై ఏ చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ‘లాక్ డౌన్’లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్ల ర్యాలీ.. రోజా, రజనీలకు పూల స్వాగతాలు వివాదాస్పదమయ్యాయి. ట్రాక్టర్ల ర్యాలీ తర్వాతే శ్రీకాళహస్తిలో ‘కరోనా’ విజృంభించిందన్న విమర్శా ఉంది.
2020-05-05‘లాక్ డౌన్’ సమయంలో మద్యం షాపులు తెరిచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం, మంగళవారం ‘దిద్దుబాటు చర్యలు’ చేపట్టింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని అనుసరించి మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచింది. నిన్న ఏపీలో 25 శాతం పెంపుదలతో మద్యాన్ని అమ్మారు. అయితే, ‘లాక్ డౌన్’ నిబంధనలను కూడా పట్టించుకోకుండా మందుబాబులు షాపుల వద్ద బారులు తీరారు. ఢిల్లీలో కూడా అవే సీన్లు. దీంతో.. ధరలను 70 శాతం పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఉదయానికి ఏపీ ప్రభుత్వం కూడా మరో 50 శాతం రేట్లు పెంచింది. అలవాటు పడిన ప్రాణాలు ఇప్పుడైనా ఆగుతాయా?!
2020-05-05దేశంలో ‘కరోనా’ వైరస్ కేసులు, మరణాలు సోమవారం అసాధారణంగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 3,928 కొత్త కేసులు, 195 మరణాలు నమోదయ్యాయి. ‘కరోనా’ వ్యాప్తి ప్రారంభమయ్యాక ఒక్క రోజులో ఇంతగా కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆదివారానికి దేశంలో వైరస్ నిర్ధారణ అయిన కేసులు 42,505. సోమవారానికి అవి అమాంతం 46,433కి పెరిగాయి. అదే సమయంలో మరణాల సంఖ్య 1568కి పెరిగింది. ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం రావలసి ఉంది. 14,541 కేసులు, 583 మరణాలతో మహారాష్ట్ర.. 5804 కేసులు, 319 మరణాలతో గుజరాత్ అగ్ర స్థానాల్లో ఉన్నాయి.
2020-05-05తెలంగాణ నుంచి వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి 40 ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వలస కార్మికుల ఇబ్బందులపై సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రైళ్ళను ఏర్పాటు చేయవలసిందిగా కేసీఆర్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యాను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి సందీప్ కుమార్ సుల్తానియా (ఐఎఎస్), జితేందర్ (ఐపిఎస్)లను ప్రత్యేక అధికారులుగా నియమించారు.
2020-05-04యుద్ధం వద్దన్నందుకు సొంత దేశంలో విద్యార్ధులను కాల్చి చంపిన ఘటన అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. ‘కెంట్ రాష్ట్ర నరమేధం’గా చరిత్రకెక్కిన కాల్పులు జరిగి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు. వియత్నాంతో సుదీర్ఘ యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికాలో ‘శాంతి’ ర్యాలీలు జరుగుతున్న కాలం అది. కాంబోడియాపై అమెరికా సైన్యం భారీగా బాంబులు వేయడాన్ని నిరసిస్తూ.. కెంట్ స్టేట్ యూనివర్శిటీ వద్ద 1970 మే 4న విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. వారిపైన అనూహ్యంగా అమెరికా నేషనల్ గార్డ్ సైనికులు కాల్పులు జరిపారు. నలుగురు విద్యార్ధులు చనిపోగా 9 మంది గాయపడ్డారు.
2020-05-04