చైనా-ఇండియా సైనిక ఘర్షణలో జవాన్ల ప్రాణాలు పోవడం గత 45 ఏళ్ళలో ఇదే తొలిసారి. 1975 జూన్ మాసంలో చైనా సైనికుల కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు మరణించిన ఘటన తర్వాత... సోమవారం (2020 జూన్ 15) ఘర్షణలో ముగ్గురు భారత సైనికులు చనిపోయారు. 1962 యుద్ధంలో ఇండియా ఓడిపోయాక 1967 సిక్కిం ఘర్షణల్లో చైనాకు ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 8 సంవత్సరాలకు అరుణాచల్ ప్రదేశ్ లోని తులుంగ్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ కు చెందిన నలుగురిని చైనా సైనికులు కాల్చి చంపారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఒక్క బుల్లెట్ పేలలేదు. మొన్నటివరకు ఒక్క ప్రాణమూ పోలేదు.
2020-06-16లడాక్ లోని గాల్వన్ వ్యాలీలో ఇండియా, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత ఆందోళనకర స్థాయికి చేరింది. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో భారత ఆర్మీ అధికారి ఒకరు, ఇద్దరు జవాన్లు మరణించారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగా సోమవారం గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణ జరిగినట్టు భారత ఆర్మీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం (మంగళవారం) ఇరు దేశాల సీనియర్ మిలిటరీ అధికారులు సమావేశమైనట్టు ఆ ప్రకటనలో తెలిపారు. గాల్వన్ వ్యాలీ, పాంగాంగ్ ట్సో ప్రాంతాల్లో చైనా సైనికులు ‘భారత భూభాగం’లోకి చొరబడిన సంగతి తెలిసిందే.
2020-06-16‘కరోనా’ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తాజాగా ‘గుజరాత్ నమూనా’పై ట్వీట్ పెట్టారు. కోవిడ్ 19 మరణాల రేటు ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘గుజరాత్ నమూనా బట్టబయలైంది’’ అని విమర్శించారు. గుజరాత్: 6.25%, మహారాష్ట్ర: 3.73%, రాజస్థాన్: 2.32%, పంజాబ్:2.17%, పుదుచ్ఛేరి: 1.98%, జార్ఖండ్: 0.5%, చత్తీస్ గఢ్: 0.35% అంటూ మరణాల రేట్లను తన ట్వీట్ లో పేర్కొన్నారు.
2020-06-16శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి ప్రసంగించారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు ముందు టీడీఎల్పీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు సహా తమ పార్టీ నేతలు పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో టీడీపీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. నల్ల చొక్కాలతో హాజరైన టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగ సమయంలో శాసనసభ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.
2020-06-16రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన అధిపతి గవర్నర్. అందుకే ‘నా ప్రభుత్వం’ అంటుంటారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు కాక ముందు అధికార పార్టీ ఇచ్చే హామీలతో గవర్నరుకు సంబంధం ఉండదు. రాను రాను ఈ విచక్షణ లోపిస్తోంది. మంగళవారం ఏపీ అసెంబ్లీని ఉద్ధేశించి ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అధికార పార్టీ ఎన్నికల హామీలను ప్రస్తావించారు. 122 హామీలలో 77 అమలు చేశామని, మరో 39 పరిశీలనలో ఉన్నాయని, మేనిఫెస్టోలో లేని 40 అంశాలనూ అమలు చేశామని గర్వంగా చెప్పారు. తన ప్రభుత్వం ఎన్ని పథకాలను అమలు చేసిందో గవర్నర్ చెప్పవచ్చు. కానీ, తనవి కాని ఎన్నికల హామీల ప్రస్తావన అవాంఛనీయం.
2020-06-16వలస కార్మికులను తరలించడానికి ఏర్పాటు చేసిన ‘శ్రామిక్’ ప్రత్యేక రైళ్ళ ద్వారా రూ. 360 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే శాఖ తెలిపింది. సగటున ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ. 600 వచ్చినట్టు తెలిపింది. అంటే.. మే 1 నుంచి గడచిన నెలన్నరలో సుమారు 60 లక్షల మంది ఈ రైళ్ళలో ప్రయాణించారన్నమాట. ఇప్పటిదాకా 4,450 ప్రత్యేక రైళ్ళను నడిపినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్ వి.కె. యాదవ్ చెప్పారు. ఒక్కో శ్రామిక్ ప్రత్యేక రైలు నడపడానికి రూ. 75 నుంచి 80 లక్షలు ఖర్చయినట్టు ఆయన తెలిపారు.
2020-06-162019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తనను కాళ్లా వేళ్లా బ్రతిమాలితేనే వైసీపీలో చేరి నర్సాపురం లోక్ సభ స్థానంలో పోటీ చేశానని ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తనంతట తాను వైసీపీలో చేరలేదని, తాను కాబట్టే అక్కడ గెలిచానని ఉద్ఘాటించారు. జగన్ సీటు ఇస్తేనే ఎంపీగా గెలిచాడంటూ నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణంరాజు తోసిపుచ్చారు. తనను తన కులంవాడి చేతనే తిట్టించాలని ప్రసాదరాజును ఉపయోగించారని, దీనివల్ల ఆయనకు మంత్రి పదవి రావచ్చని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
2020-06-16గత నాలుగేళ్ళుగా రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ సింగిల్ డిజిట్ బాట పట్టింది. 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి) 8.16 శాతం పెరిగినట్టు తాజా సామాజిక ఆర్థిక సర్వే అంచనా వేసింది. గత ఆరేళ్ళలో ఇదే కనిష్ఠం. సర్వేను సిఎం జగన్ సోమవారం విడుదల చేశారు. స్థిర ధరల్లో ఏపీ జి.ఎస్.డి.పి. 2014-15లో 9.2 శాతం వృద్ధి చెందిగా.. 2015-16లో 12.16 శాతం, 2016-17లో 10.40 శాతం, 2017-18లో 11.32 శాతం, 2018-19లో 11.02 శాతం వృద్ధి నమోదైంది. స్థూల ఉత్పత్తి 2019-20లో స్థిర ధరల్లో 6,72,018 కోట్లుగానూ, ప్రస్తుత ధరల్లో 9,72,782 కోట్లుగానూ అంచనా.
2020-06-16మనుషుల తరహాలోనే బుద్ధి జీవులు నివశించే గ్రహాలేవైనా విశ్వంలో ఉన్నాయా? అని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అన్వేషిస్తున్నారు. ఎక్కడో సుదూరంగా కాదు.. మన గెలాక్సీలోనే 30 వరకు గ్రహాంతర జీవుల నాగరికతలు ఉండొచ్చని తాజాగా నాటింగ్హమ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమి తరహాలోనే జీవ పరిణామం జరిగే అవకాశం ఉన్న గ్రహాలు మనకు దగ్గరగా ఎన్ని ఉన్నాయో అంచనా వేసేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. బుద్ధి జీవుల అవతరణకు భూమిపై పట్టినట్టే 500 కోట్ల సంవత్సరాలు అవసరమన్న అంచనా ప్రాతిపదికగా.. మన గెలాక్సీలో కొన్ని డజన్ల క్రియాశీల నాగరికతలు ఉండొచ్చని పేర్కొన్నారు.
2020-06-1510 వేల కేసులు కాదు. మరణాలే! దేశంలో ‘లాక్ డౌన్’ విధించిన రోజున ఊహకు కూడా అందని ప్రమాదకర పరిస్థితిని ఇప్పుడు దేశం ఎదుర్కొంటోంది. ‘కరోనా’ను కట్టడి చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 24న ‘లాక్ డౌన్’ ప్రకటించింది. అంతకు ముందు మార్చి 22 (జనతా కర్ఫ్యూ) నుంచే ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మార్చి 21న దేశంలో 336 వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అప్పటికి ఐదుగురే మరణించారు. 85 రోజుల తర్వాత కేసులు 3,32,783కు, మరణాలు 9,520కి పెరిగాయి. అంటే.. కేసులు 990 రెట్లు, మరణాలు ఏకంగా 1904 రెట్లు పెరిగాయి. రేపటికి మరణాలు 10,000 మార్కును దాటనున్నాయి.
2020-06-15