కర్నాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో శాసనసభా పక్ష నేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రకటించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పూర్తి ఫలితాలు రాక ముందే పరిస్థితి స్పష్టం కావడంతో... అందుకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అదే లేఖలో... సోనియా నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయతను ప్రకటించారు.
2019-12-09కర్నాటక ఉప ఎన్నికల్లో బిజెపికి మెజారిటీ సీట్లు రావడంతో ఎడియూరప్ప ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఉప ఎన్నికలు జరిగిన 15 అసెంబ్లీ స్థానాల్లో 10 బిజెపి వశమయ్యాయి. మరో రెంటిలో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. రెండు చోట్ల కాంగ్రెస్, మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్ధులు గెలిచారు. పార్టీ ఫిరాయించి బిజెపికి అనుకూలంగా ఓటు వేసిన కాంగ్రెస్, జెడి(ఎస్) సభ్యులు అనర్హతకు గురి కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కనీసం 6 చోట్ల గెలిస్తే తప్ప సాధారణ మెజారిటీ నిలువని పరిస్థితుల్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి.
2019-12-092019-20 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు 5 శాతానికి లోపే ఉంటుందని ‘ఐహెచ్ఎస్ మార్కిట్’ అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం తొలి అర్ద భాగంలో వృద్ధి రేటు కేవలం 4.75 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో 5 శాతం నమోదు కాగా... రెండో త్రైమాసికంలో మరింత దిగజారి 4.5 శాతానికి పరిమితమైంది. కొద్ది రోజుల క్రితమే రిజర్వు బ్యాంకు కూడా వృద్ధి రేటు అంచనాను 6.1 నుంచి 5 శాతానికి తగ్గించింది.
2019-12-08 Read Moreదేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది మరణించారు. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనంలో చిన్నతరహా పరిశ్రమలున్నాయి. కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడ నివసిస్తున్నారు. ముందు రోజు పగలంతా పనిచేసి అలసిపోయిన కార్మికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు భవనం రెండో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అధికారులు చెబుతున్నారు.
2019-12-08మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన పత్రిక ‘‘సాక్షి’’ వెల్లడించింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనున్నట్టు పేర్కొంది. అత్యాచార కేసులపై విచారణను కేవలం మూడు వారాల్లో పూర్తి చేసి సత్వరమే శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్టు ఈ కథనం చెబుతోంది.
2019-12-09 Read Moreఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఆర్.టి.సి) ప్రయాణీకుల ఛార్జీలను భారీగా పెంచబోతోంది. పల్లె వెలుగు, సాధారణ సిటీ బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, మెట్రో బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. సోమవారం అర్దరాత్రి నుంచి పెంచిన ఛార్జీలు అమలు చేస్తారని సమాచారం. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలకు ఛార్జీల మోత భారీగానే ఉంటుంది.
2019-12-07న్యాయం ఎప్పటికీ ప్రతీకారం రూపు దాల్చకూడదని భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణలో నలుగురు రేపిస్టులను పోలీసులు కాల్చి చంపిన నేపథ్యంలో జస్టిస్ బాబ్డే స్పందించారు. శనివారం రాజస్థాన్ హైకోర్టులో నూతన భవనం ప్రారంభం సందర్భంగా జస్టిస్ బాబ్డే మాట్లాడారు. న్యాయవ్యవస్థలో జాప్యంపై ఆత్మ పరిశీలన అవసరమేనని, అయితే న్యాయం ప్రతీకార రూపుదాల్చితే తన స్వభావాన్నే కోల్పోతుందని పేర్కొన్నారు.
2019-12-07నిందితుల కుటుంబ సభ్యులు కూడా బిడ్డలను కోల్పోయిన బాధను అనుభవించాలని తెలంగాణ సామూహిక హత్యాచార బాధితురాలి తండ్రి అభిప్రాయపడ్డారు. ఆ నలుగురు తమ కుమార్తెపై అత్యాచారం చేసి చంపితే తాము బాధను అనుభవించడంలేదా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం నిందితుల కుటుంబాల వాదనను ఓ విలేకరి వినిపించినప్పుడు, బాధితురాలి తండ్రి ఈ విధంగా స్పందించారు. నిందితుల మరణంతో తమకు న్యాయం జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు.
2019-12-07తెలంగాణ సామూహిక హత్యాచారం నిందితుల సామూహిక ‘‘ఎన్కౌంటర్’’పై జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది. శనివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బృందం సభ్యులు మహబూబ్ నగర్ వెళ్లి నిందితుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం చీకటిపడే సమయానికి చటాన్ పల్లి వద్ద ‘‘ఎన్కౌంటర్’’ జరిగిన ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణులతో చర్చించిన సభ్యులు, ‘‘ఎన్కౌంటర్’’ జరిగిన తీరుపై పోలీసులను ప్రశ్నించినట్టు సమాచారం.
2019-12-07‘‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయత, క్రమశిక్షణ ముఖ్యం. ఎవరు గీత దాటినా సహించే ప్రసక్తే లేదు’’...ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని ఉద్ధేశించి పరోక్షంగా చేసిన హెచ్చరిక ఇది. నిన్న నెల్లూరులో ఆనం చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి శనివారం స్పందించారు. వ్యవస్థలు తమ పని తాము చేసుకుపోయే పరిస్థితి నెల్లూరులో లేదని, మాఫియా ఆగడాలపై ప్రజలు కుమిలిపోతున్నారని ఆనం నిన్న వ్యాఖ్యానించారు.
2019-12-07