అమెరికా జాతీయ వైద్య సంస్థలతో కలసి పనిచేసిన వుహాన్ వైరాలజీ సంస్థ (చైనా) శాస్త్రవేత్తలపై ప్రముఖ అమెరికన్ సైంటిస్టు ఆంథొని ఫాసి ప్రశంసలు కురిపించారు. వారిని ‘‘అర్హతగల, అత్యంత గౌరవనీయులైన చైనా శాస్త్రవేత్తలు’’గా పేర్కొన్నారు. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్ పైన పరిశోధన కోసం వుహాన్ వైరాలజీ సంస్థకు నిధులు సమకూర్చడాన్ని సమర్థించుకున్నారు. చైనాలోని వుహాన్ లేబొరేటరీ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందని కొంతమంది అమెరికన్ రాజకీయ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఫాసి పునరుద్ఘాటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
2021-07-24వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు ఎర్రగంగిరెడ్డి తనను బెదిరించాడని వాచ్ మన్ రంగన్న చెప్పారు. తన పేరు చెబితే నరికేస్తానన్నాడని, అందువల్లనే ఇన్నాళ్ళూ తాను నోరు మెదపలేదని రంగన్న తాజాగా మీడియాకు చెప్పారు. సీబీఐ ఇచ్చిన భరోసాతో ఇప్పుడు చెబుతున్నానన్నారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తాను జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్టు రంగన్న తెలిపారు. వివేకా ఇంటికి ఎర్రగంగిరెడ్డి తరచూ వచ్చేవాడని, తనతో చాలాసార్లు మాట్లాడాడని రంగన్న చెప్పారు. అయితే, రంగన్నను తాను ఒకేసారి చూశానని ఎర్రగంగిరెడ్డి చెబుతున్నారు.
2021-07-24టోక్యో ఒలింపిక్స్ మొదటి రోజున మూడు బంగారు పతకాలతో సహా మొత్తం నాలుగు మెడల్స్ పొంది చైనా అగ్ర స్థానంలో నిలిచింది. ఇటలీ, జపాన్, కొరియా, ఈక్వెడార్, హంగరీ, ఇరాన్, కొసావో, థాయ్ లాండ్ ఒక్కో బంగారు పతకాన్ని సాధించాయి. ఒక రజత పతకంతో ఇండియా 14వ స్థానంలో నిలిచింది. చైనా షూటర్ యాంగ్ కియాన్, వెయిట్ లిఫ్టర్ హూ జిహుయి పాత రికార్డులను బద్దలు కొడుతూ ఆ దేశానికి తొలి రెండు బంగారు పతకాలను సాధించిపెట్టారు. తర్వాత ఫెన్సర్ సున్ యివెన్ మూడో బంగారు పతకాన్ని జోడించారు.
2021-07-24ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నిటినీ 2023-24 నాటికి రైలు, విమాన మార్గాలతో అనుసంధానిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. శనివారం ఆయన మణిపూర్ రాజధాని షిల్లాంగ్ శివార్లలో అంతర్రాష్ట్ర బస్ టెర్మినస్ (ఐ.ఎస్.బి.టి)ని షా ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతీయ మండలి (ఎన్.ఇ.సి), రాష్ట్ర ప్రభుత్వం 90:10 నిష్ఫత్తిలో రూ. 48 ఖర్చుతో ఈ టెర్మినస్ ను నిర్మించాయి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2021-07-24కరోనా మహమ్మారి విలయతాండవంలోనూ సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్న అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ తొలిసారి ‘అసమానత’ గురించి ప్రస్తావించారు. 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలైన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఆయనో వ్యాసం రాశారు. ఇండియాలో మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలు పౌరులకు అసమానంగా ప్రయోజనాలను చేకూర్చాయని అంబానీ పేర్కొన్నారు. కొరతల నుంచి సమృద్ధి వరకు పయనించిన ఇండియా, 2051 నాటికి సమాన, సుస్థిర శ్రేయో వ్యవస్థగా రూపాంతరం చెందాల్సి ఉందన్నారు.
2021-07-24టోక్యో ఒలింపిక్స్ తొలి రోజునే ఇండియా బోణీ కొట్టింది. మణిపూర్ కు చెందిన మీరాబాయ్ చాను మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించారు. 26 సంవత్సరాల చాను మొత్తం 202 కేజీలు (87+115) ఎత్తారు. ఇప్పటివరకు ఒలింపిక్స్ లో ఈ క్రీడాంశంలో పతకం సాధించిన రెండో భారతీయురాలు చాను కావడం విశేషం. తొలిగా 2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్ లో ఆంధ్రా అమ్మాయి కరణం మల్లీశ్వరి కాంశ్యపతకం సాధించారు. 21 సంవత్సరాల తర్వాత మల్లీశ్వరి రికార్డును మెరుగుపరుస్తూ చాను రజత పతకాన్ని సాధించారు.
2021-07-24కరోనా ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో 2021 జూలైలో నిర్వహిస్తున్న టోక్యో ఒలింపిక్స్-2020 కళ్ళకు కడుతున్నాయి. అతి భారీ క్రీడోత్సవాల ప్రారంభోత్సవం ఈసారి కళ్ళు జిగేల్ మనే వెలుగులు, ఢమఢమనాదాలు లేకుండా సాదాసీదాగా జరిగింది. కొద్దిపాటి బాణాసంచా వెలుగుల్లో, వీక్షకులు లేని స్టేడియంలో ప్రపంచ క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి. టోక్యో ప్రజలు బయట వీధుల్లో బారులు తీరి క్రీడాకారులు వచ్చే సమయంలో చేతులు ఊపుతూ శుభాకాంక్షలు తెలిపారు. మూక డ్రోన్ల సమూహాల విన్యాసం ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది.
2021-07-24శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ ఇండియా చేజారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 43.1 ఓవర్లలో 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించి ఛేజింగ్ స్కోరును నిర్దేశించారు. శ్రీలంక జట్టు 39 ఓవర్లలోనే మూడు వికెట్లు మిగిలి ఉండగా 227 పరుగులు సాధించింది. చివరి వన్డేలో శ్రీలంక గెలిచినా సిరీస్ 2-1 తేడాతో భారత్ వశమైంది. శ్రీలంక జట్టు ఇండియాపై వన్డే మ్యాచ్ గెలవడం గత నాలుగేళ్ళలో ఇదే మొదటిసారి.
2021-07-24జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) బడ్జెట్ 2016-17లో ఉన్న రూ. 33.17 కోట్ల నుంచి 2017-18లో అమాంతం రూ. 333.58 కోట్లకు పెరిగిందని, పెగాసస్ స్పైవేర్ కోసం ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఒకు వందల కోట్లు చెల్లించింది అదే సంవత్సరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు 2018-19లో మండలి ఏకంగా రూ. 812 కోట్లు ఖర్చు చేసింది. జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, జడ్జిలు, ఎన్నికల అధికారుల ఫోన్లను హ్యాక్ చేయడానికి స్పైవేర్ ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఎ బడ్జెట్ జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (ఎన్.ఎస్.సి.ఎస్) పరిధిలోకి వస్తుంది.
2021-07-23మోదీ ప్రభుత్వంలో కొత్త మంత్రి మీనాక్షి లేఖి రైతు సంఘాల నేతలపై నోరు చేసుకున్నారు. జంతర్ మంతర్ ‘రైతు పార్లమెంటు’ వద్ద ఒక మీడియా వ్యక్తిపై దాడి జరిగిందని ఆరోపించిన మంత్రి, ‘‘వాళ్లు రైతులు కాదు... రౌడీలు. ఇవి నేరపూరిత చర్యలు. జనవరి 26న జరిగినవి కూడా సిగ్గుపడవలసిన నేరపూరిత చర్యలే. ప్రతిపక్షాలు ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు కొన్ని నెలలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
2021-07-22